23, జూన్ 2025, సోమవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ప్రథమాశ్వాసము*

*416 వ రోజు*


*శకుని వధ*


కృష్ణుడు రధమును సుయోధనుడి వంకకు పోనిచ్చాడు. సహదేవుడు, భీముడు, సుయోధనుడిని చంపడానికి చెరి ఒక వైపు నుండి వచ్చారు. ఇంతలో శకుని తన సైన్యముతో వారి ముందు నిలిచాడు. శకుని, సుశర్ముడు అర్జునుడిని, సుదర్శనుడు భీమసేనుడిని, సుయోధనుడు సహదేవుని ఎదుర్కొన్నారు. సుయోధనుడు ఒక బల్లెమును సహదేవుడి మీద వేసాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లాడు. వెంటనే తేరుకుని సహదేవుడు సుయోధనుడి మీద అత్యంత శక్తివంతమైన బాణములు ప్రయోగించాడు. కౌరవ సైనికులు తోమరములతో అర్జునుడిని కప్పారు. అర్జునుడు కోపించి వాడి అయిన బల్లెములతో గాంధార సేనల తలలు నరికాడు. ఇంతలో త్రిగర్త సైనికులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు సంశక్తులలో ఒక్కడైన సత్యకర్ముడి తలను నరికాడు. చివరగా మిగిలిన సంశక్తుడు సత్యేషుడిని కూడా చంపాడు. ఆఖరుగా మిగిలిన సుశర్మ వక్షస్థలముకు గురి పెట్టి ఒక బల్లెము విసిరాడు. ఆ బల్లెము సుశర్మ వక్షస్థలం చీల్చింది. తరువాత అర్జునుడు సుశర్మ కుమారులు అందరిని ఒక్కొక్కరిని మూడేసి బాణములతో కొట్టి చంపాడు. సంశక్త సైన్యం పారి పోయింది. భీముడు చావగా మిగిలిన సుయోధనుడి తమ్ముడు సుదర్శనుడిని సంహరించాడు " ఓ ధృతరాష్ట్ర మహారాజా ! ఇక నీకుమారులలో ఒక్క సుయోధనుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. శకుని సహదేవుడితో తలపడి పది బాణములు అతడి శరీరంలో గుచ్చాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లాడు. అది చూసి భీముడు శకుని ముందున్న గాంధార సైన్యమును నాశనం చేయసాగారు. అది చూసి కౌరవసేనలు పారి పోయాయి. సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు పురికొల్పాడు. సహదేవుడు మూర్ఛ నుండి తేరుకుని శకుని మీద పది బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండించాడు. శకుని వేరొక విల్లు తీసుకొని సహదేవుడి మీద శరవర్షం కురిపించాడు. శకుని కుమారుడైన ఉలూకుడు సదేవ, భీమసేనుల మీద బాణవర్షం కురిపించాడు. సహదేవుడు కోపించి ఒకే ఒక బల్లెము విసిరి ఉలూకుడి తల ఖండించాడు. తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చలించిన శకుని ఆగ్రహోదగ్రుడై సహదేవుడి మీద మూడు బాణములు వేసాడు. సహదేవుడు ఆ మూడు బాణములను ఖండించి శకుని విల్లు విరిచాడు. శకుని మహా కోపంతో సహదేవుని కత్తిని, గద ను, బల్లెమును ప్రయోగించాడు. సహదేవుడు వాటిని మధ్యలో ఖండించాడు. అది చూసి శకుని తన రథ రక్షకులతో సహా అక్కడి నుండి పారి పోయాడు. సహదేవుడు అతడిని నిలువరించి " ఓ గాంధార రాజా ! రాజ ధర్మం విడిచి ఇలా పారి పోవడం నీవంటి సుక్షత్రియునకు తగదు. నాడు జూదం ఆడిననాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడించిన మాయా జూదంకు ఫలితం చూసావు కదా సర్వనాశనం అయింది. నాడు జూదంలో ఓడి పోయి తలలు వంచుకున్న మా కోపాగ్ని జ్వాలల ఫలితం చూసావు కదా ! మమ్ము అవమానించినందుకు సుయోధనుడు తన వారందరిని పోగొట్టుకుని అనుభవిస్తున్నాడు. ఆ సుయోధనుడు చూస్తుండగా నీ తల తెగి నేలను ముద్దాడేలా కొడతాను " అని సహదేవుడు శకుని రథాశ్వములను, కేతనమును, విల్లును ఖండించాడు. అది చూసి శకుని అత్యంత భయంకరమైన శక్తి ఆయుధమును సహదేవుడి మీద విసిరాడు. సహదేవుడు ఆ శక్తి ఆయుధమును ఖండించి రెండు చేతులలో రెండు బల్లెములను తీసుకొని అత్యంత వేగంగా శకుని మీద వేసి అతడి తల ఖండించాడు. శకుని తల నేల పడగానే శరీరం కూడా నేల మీదకు వాలింది. మహాభారత యుద్ధానికి కారణ భూతుడైన గాంధార రాజు శకుని సహదేవుడి చేతిలో మరణించాడు.


*సుయోధనుడి నిష్క్రమణ*


శకుని మరణానికి పాండవ సైన్యం హర్షాధిరేకంతో జయజయ ధ్వానాలు చేసారు. యోధులు పరమ ప్రమోదంతో శంఖధ్వానం చేసారు. గాంధార సేనలు శకుని మరణం తరువాత కూడా బెదరక తమ రాజు మరణానికి కారకుడైన సహదేవుడి మీద తిరగబడింది. సహదేవుడికి సాయంగా అర్జునుడు, భీముడు నిలబడ్డారు. భీమార్జున ధాటికి ఆగలేక వారి ధాటికి గాంధార సైన్యం నశించింది. సుయోధనుడు రణభూమిలో ఒంటరిగా నిలబడ్డాడు. ఎదురుగా ఆనందాతిరేకంతో హర్షధ్వానాలు చేస్తున్నారు. సుయోధనుడు యుద్ధభూమిని వదిలి వేయడానికి నిశ్చయించుకున్నాడు " అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయునితో " సంజయా ! ఆ సమయమున ఇరుపక్షాల బలాబలాలు ఎలా ఉన్నాయి " అని అడిగాడు. సంజయుడు " మహారాజా! ఒక్క సుయోధనుడు తప్ప కౌరవ సైన్యం అంతా సర్వ నాశనం అయింది. పాండవ పక్షాన రెండు వేల రథములు, ఏడు వందల ఏనుగులు, అయిదు వందల హయములు, పది వేల కాల్బలం మిగిలారు. సుయోధనుడు తన గదను భుజం మీద పెట్టుకుని రణభూమిని విడిచి ఎటో వెళ్ళాడు " అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు. సుయోధనుడి నిష్క్రమణతో పద్దెనిమిది రోజులు అవిచ్ఛన్నంగా సాగిన యుద్ధం సమాప్తమైంది.

*శల్య పర్వము ప్రథమాశ్వాసము సమాప్తం *

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: