18-43-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అIl క్షత్రియుల కర్మలను వివరించుచున్నారు–
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం
యుద్ధే చాప్యపలాయనమ్ |
దానమీశ్వరభావశ్చ
క్షాత్రం కర్మ స్వభావజమ్ ||
తా:- శూరత్వము, తేజస్సు (కీర్తి, ప్రతాపము), ధైర్యము, సామర్థ్యము, యుద్ధము నందు పాఱిపోకుండుట, దానము, (ధర్మపూర్వక) ప్రజాపరిపాలనాశక్తి (శాసకత్వము) - ఇయ్యవి స్వభావమువలన పుట్టిన క్షత్రియకర్మయైయున్నది.
వ్యాఖ్య: - "యుద్ధేచాప్యపలాయనమ్” యుద్ధమునందు పాఱిపోవుట క్షత్రియుని ధర్మముకాదనియు తెలుపబడినది. అయితే బాహ్యయుద్ధ మెపుడో యొకపుడు సంభవించును. కాని అంతర్యుద్ధము మోక్షపర్యంతము సర్వజీవులయందును జరుగుచునే యుండును. మంచికి చెడ్డకు, ధర్మమునకు అధర్మమునకు, దైవసంపదకు అసురసంపదకు సంగ్రామము హృదయమున నిరంతరము సాగుచునే యుండును. బలవత్తరమగు మాయతో జరుగు అట్టి యుద్ధమున ప్రతిమనుజుడు ఇట్టి క్షాత్రమునే ప్రదర్శించ వలసియుండును. అనగా మాయ (ప్రకృతి)తో జరుగుయుద్ధమున వెన్నుచూపరాదు. ముందు వేసిన అడుగును వెనుకకు త్రిప్పరాదు. బాహ్యయుద్ధమున క్షత్రియులు చూపు, ధైర్య, పరాక్రమములకంటె అధికతరములగు ధైర్యసాహసములను మనుజుడు తన అంతర్యుద్ధమున జూపవలసియుండును. అపుడే విజయము కరతలామలకమై జీవుడు మోక్షసామ్రాజ్యాభిషిక్తుడు కాగల్గును. కావున బ్రహ్మతేజము, క్షాత్రవీర్యము - అను నీ రెండిటిని జీవుడు సంపాదించవలసియున్నది. మఱియు లక్ష్యమగు ఆత్మసాక్షాత్కారము, జీవన్ముక్తి పొందువఱకు మనుజుడు వెనుకకు మఱలరాదు. ఇవ్విధమున “యుద్ధేచాప్య పలాయనమ్' అను ఈ క్షత్రియ ధర్మసూత్రమును ప్రతివాడును తన అంతర్యుద్ధమున అవలంబించి కృతార్థుడు కావలయును.
ప్ర:- క్షత్రియుని స్వభావజనిత కర్మలెవ్వి?
ఉ:- (1) శూరత్వము (2) తేజస్సు (కీర్తి, ప్రతాపము) (3) ధైర్యము (4) సామర్థ్యము (5) యుద్ధమునందు వెనుకకు మఱలకుండుట (6) దానము (7) ప్రజాపరిపాలనాశక్తి (శాసకత్వము) ఇవి క్షత్రియుని కర్మములు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి