*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*
*434 వ రోజు*
*అశ్వత్థామ సుయోధనుడిని చూసి విలపించుట*
అంతలో చుట్టు జనపదములలో ఉన్న వారు, ముని కుమారులు సుయోధనుడిని చూడ వచ్చారు. వారితో పాటు అక్కడికి వచ్చిన కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ సుయోధనుడి దురవస్థ చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అశ్వత్థామ సుయోధనుడి చూసి " రారాజా ! అనేక రాజన్యులు నీచుట్టూ చేరి ప్రశంసింస్తుంటారే ఇప్పుడిలా ఒంటరిగా పడి ఉన్నావా ! కురుసామ్రాజ్య సింహాసాధిష్టుడవైన నువ్విలా కటిక నేల మీద పడి ఉండమని ఆ విధాత నీ నొసటన వ్రాసాడా ! నీ బల సౌర్యములు ఏమయ్యాయి, అహర్నిశం పట్టు ఆ పట్టు ఛత్రములు ఎక్కడ, నీ సైన్యాధిపతు లేమయ్యారు రారాజా ! ఈ నాడిలా ఒంటరిగా దుమ్ము కొట్టుకుని కటిక నేలను పడి ఉన్నావు. పన్నీటి జలకాలు ఆడవా రారాజా ! భీష్మ, ద్రోణ, కర్ణులు నీ పక్కన ఆశీనులై ఉండగా దుశ్శాసన, వికర్ణుల సేవలందుకుంటూ పరివేష్టితుడవై అష్టశ్వైర్యములు అనుభవించిన నిన్ను రాజులంతా మరచినారా ! ఒక్కరూ రారేమి ! నీ విషయంలో లక్ష్మీ ఇంత చంచలమైందా ! విధి నీ పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించిందేమి నేనేమి చెయ్యను " అని విలపించాడు.
*సుయోధనుడు అశ్వత్థామను చూసి విలపించుట*
అశ్వత్థామను చూసి సుయోధనుడు " గురుపుత్రా ! నీవెరుగనిది ఏమున్నది. మనుజుల విధి విధానములు నీకు తెలియనివి కాదు కదా ! ఆ బ్రహ్మ దృష్టిలో ఆ సుఖదుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి. మనం అన్నిటినీ సమంగా చూడాలి. సుఖదుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి. నా బంధుమిత్రులు మహా వీరులు యుద్ధంలో మరణించిన తరువాత నేను ఒక్కడినే జీవించు ఉండటం ధర్మమా ! నా బాహు బలము, వీర్యము, ధైర్యము సడలి పోగా శత్రువులు నన్ను పడగొట్టి నాకు సద్గతి కలిగించారు. మీరు ముగ్గురూ వారికంట పడక నా కంట పడటం నాకు ఆనందం కలిగిస్తుంది. " అని పాడవులు అక్కడికి వచ్చిన తరువాత జరిగిన విషయములు సవిస్తరంగా వారికి వివరించాడు. అది విని అశ్వత్థామ కోపంతో ఊగి పోయాడు.
*అశ్వత్థామ సైన్యాధ్యక్షునిగా అభిషిక్తుడగుట*
అశ్వత్థామ కోపంతో " రారాజా ! నా తండ్రిని అర్జునుడు అధర్మంగా చంపినప్పుడే నా గుండెలు మండి పోయాయి. ఇప్పుడు నిన్ను అక్రమంగా పడతోసారు. ఆ పాడవులను నా అస్త్రములతో దగ్ధం చేయకున్న నేను బ్రతికీ వ్యర్ధమే ! రారాజా ! సుయోధన సార్వభౌమా ! నేను సత్యం పలుకుతున్నాను. పాండవులను, పాంచాలురను వారి బంధుమిత్రులను కృష్ణుడు చూస్తుండగా నేను వధిస్తాను. ఇదే నాప్రతిజ్ఞ నన్ను ఆజ్ఞాపించండి " అని సుయోధనుడి ముందు మోకరిల్లాడు. సుయోధనుని మనసు ఆహ్లాదంతో నిండి పోయింది. " కృపాచార్యా ! వెంటనే పుణ్యజలాలు తెప్పించండి అన్నాడు. వారిని చూడటానికి వచ్చిన ముని కుమారులను అడిగి పుణ్య జలాలను తెప్పించాడు కృతవర్మ. అప్పుడు సుయోధనుడు కృపాచార్యుని చూసి " కృపాచార్యా ! అశ్వత్థామను సైన్యాధ్యక్షిడిగా అభిషేకించండి. అశ్వత్థామ పుట్టుకతో బ్రాహ్మణుడైనా రారాజు కోరిక మీద యుద్ధం చేయుట పరమధర్మం " అన్నాడు. కృపాచార్యుడు పుణ్యాహవాచన మంత్రములు చదివి అశ్వత్థామను కౌరవసేనకు అధ్యక్షునిగా అభిషేకించాడు. తనకు లభించిన గౌరవానికి అశ్వథ్థామ పొంగి పోతూ రారాజును గుండెలకు హత్తుకొని పైకి లేచి సింహ నాదం చేసి " రారాజా ! పాండవులను సమూలంగా నాశనం చేసి నీ దర్శనం చేసుకుంటాను " అన్నాడు. కృతవర్మ, కృపాచార్యుడు వెంటరాగా పాండవశిబిరాల వంకకు వెళ్ళాడు " అని సంజయుడు దృతరాష్ట్రునికి వివరించాడని వైశంపాయనుడు జనమే జయునికి చెప్పాడు.
*శల్య పర్వము ద్వితీయాశ్వాసము సమాప్తం*
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి