*తిరుమల సర్వస్వం -297*
చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-12
బ్రూస్ కోడ్ లేదా బ్రూస్ నిబంధనావళి
ఆలయం ఆర్కాటు నవాబుల నుండి సంపూర్ణంగా ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యం లోనికి వచ్చిన తరువాత, ఆలయ ఆదాయవ్యయాలను క్రమబద్ధీకరించి నికరాదాయాన్ని పెంపొందించు కోవడం కొసం 1821 వ సం లో బ్రూస్ అనే ఉన్నతాధికారి నేతృత్వంలో రూపొందించిన ఆలయ పరిపాలనా నియమాల సంకలనం బ్రూస్ నిబంధనావళి గా పేరొందింది. 42 నియమాలు కలిగిన ఈ నిబంధనావళి 1843 వ సం. లో ఆలయం మహంతుల అధీనం లోకి వచ్చేంత వరకూ కొనసాగింది. దీని ననుసరించి -
ఆలయం మరియు ఆలయంలో వివిధ బాధ్యతలు నిర్వర్తించే నిమిత్తం నియమించబడిన, అనువంశిక సిబ్బంది మొత్తం - చిత్తూరు కేంద్రంగా గలిగిన నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ అధీనంలో ఉండేవారు. ఆలయ, క్షేత్ర రోజువారీ నిర్వహణను పర్యవేక్షించే బాధ్యత - తిరుపతి కేంద్రంగా కలిగిన తహసీల్దార్ వహించేవారు. విధి నిర్వహణ నిమిత్తం కలెక్టర్ మరియు తహసీల్దార్ తరచుగా తిరుమలను సందర్శించి, స్వామివారి ఆభరణాలను తణిఖీ చేయాలి. వారు వివిధ వనరుల ద్వారా వచ్చే ఆలయ ఆదాయం పెంపొందించడం పై ఎనలేని శ్రద్ధ వహించేవారు. అధికమొత్తంలో కానుకలు సమర్పించుకునే ధనిక భక్తులకు దర్శనాల విషయంలో ప్రాధాన్యత ఉండేది. వారు సమర్పించుకున్న కానుకలను బట్టి వారికి తలపాగా, పట్టు అంగీ, శాలువా వంటి వస్తువులను శ్రీవారి ప్రసాదంగా బహూకరించేవారు. గంటలకొద్దీ క్యూలో వేచివుండే సాధారణ భక్తులను తడవకు యాభై మంది చొప్పున దర్శనార్థం అనుమతించేవారు. . బ్రహ్మోత్సవాల సమయంలో పూలంగి సేవకు రూ. 1, అద్దాల మంటపం సేవకు రూ. 0.50, పులికాపు సేవకు రూ. 2 చొప్పున రుసుము వసూలు చేసేవారు. శ్రీవైష్ణవ చిహ్నాలైన పంచాయుధాలను ఆసక్తి కలిగిన భక్తుల భుజాలపై ముద్రించడానికి సైతం నిర్ణీత రుసుము వసూలు చేయబడేది.
రొజువారీ ఆదాయం లెక్కలను పర్యవేక్షించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండేవి. ఏరోజు ఆదాయాన్ని ఆరోజు లేదా మరుసటి రోజు అణాపైసలతో సహా లెక్కించి, ఆలయ పారుపత్యదారు దినవారీ నివేదిక తయారు చేసేవారు. జియ్యంగారు గుమాస్తాచే ధృవీకరించ బడిన తరువాత, ఆ నివేదిక దిగువ తిరుపతిలో ఉండే తహసీల్దార్ కు, అక్కడి నుండి చిత్తూరులో ఉన్న కలెక్టరుకు చేరుకునేది. నివేదికతో బాటుగా, రొక్ఖం మరియు వస్తురూపాలలొ ఉన్న నికరాదాయం కూడా కలెక్టరు కార్యాలయం ద్వారా సర్కారువారి ఖజానాకు సాధారణ సమయాల్లో నెలకొకసారి, బ్రహ్మోత్సవాల్లో ప్రతిదినం చేరుకునేది.
అన్ని దారుల గుండా ఆలయానికి వస్తున్న భక్తుల రక్షణ బాధ్యత సంబంధిత పాలెగార్లు వహించే వారు. అయితే - ఆలయ ప్రాంగణంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఆలయం లోనికి అన్యమతస్తులు ప్రవేశించకుండా చూడటం తహసీల్దార్ మరియు మేజిస్ట్రేట్ ల సంయుక్త బాధ్యత. దిట్టం పుస్తకంలో పొందుపరిచిన విధి విధానాల ననుసరించి ప్రసాదాలు తయారు చేయడాన్ని పారుపత్యదారు, తహసీల్దార్ సమిష్టిగా పర్యవేక్షించే వారు.
ఆగమకైంకర్యాలు నిర్వర్తించే అర్చకులు, ఇతర అనువంశిక కైంకర్యపరులు కాకుండా - ఆదాయ వ్యయాల లెక్కలు చూస్తూ తహసీల్దార్ కు జవాబుదారీగా ఉండే శెరిస్తేదార్, నలుగురైదుగురు కానుకలు లెక్కించే గుమాస్తాలు, నివేదికలు తయారు చేసే గణకులు, ధాన్యం కొలిచే సేవకులు, చందనం దుంగల్ని మోసే పరిచారకులు, అల్లిన పూలదండల్ని తీసుకు వచ్చే వాహకులు, కస్తూరి లేపనం తీసేవారు, వంటచెరకు తెచ్చేవారు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తెచ్చే గొల్లవారు, ఆలయ ప్రాంగణం శుభ్రపరిచే కార్మికులు, దీపాలు, దివిటీలు వెలిగించే పనివారు, రక్షణ సిబ్బంది మొదలగు వారు ఆలయంలో పనిచేసేవారు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి