11, జులై 2025, శుక్రవారం

కాలాయ నమః*

 *కాలాయ నమః*




కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మానవులకు ప్రాప్తించిన వియోగ విలాపాలు, వినోద విలాసాలు, సిరి సంపదలు, ఉత్తాన పతనాలు ఇవన్నీ స్వయం కృత్యాలు అందామా ప్రారబ్ధ కర్మలా, అన్నిటికి మించి కాల మహిమ కావచ్చునా. ప్రధానంగా ఈ కలియుగంలో దుష్కర్మలకు, సత్కర్మలకు ఫలితాలు ఇక్కడే అనుభవించాలని గూడ పెద్దలంటూ ఉంటారు. మనకు తెలిసిన సత్యం *కాల నియమానికి ఎవరు అతీతులు కారు గాక కారు*. 


విశ్వంలోని ప్రతి జీవి కాలాధీనమై ప్రవర్తించాల్సిందే. కాలం పరమేశ్వర స్వరూపం. దాని ప్రభావం తప్పుకోలేనిది. అయినా *సేవా ధర్మములచే కాల ప్రభావాల "తీవ్రత" నుండి కొంత శాంతి/ఉపశమనము పొందవచ్చును*. మానవుడు కాలాన్ని ఎలా వినియోగించు

కుంటాడన్నది చాలా ముఖ్యము, అవసరము కూడా. వినియోగించుకోని క్షణము తిరిగిరాదు. కాలాన్ని వృధాచేయడమంటే మానవుడు అన్నివిధాలా నష్ట పోయినట్లే. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని, ఏదో రాబోతుందనే ఆశాభావంతో ప్రస్తుత క్షణాలను చేజార్చుకోవడం తగదు. మంచి క్షణం కోసం ఎదురుచూసే దానికంటే, *ఉన్న క్షణాన్నే మంచిగా మలచుకోవడం విజ్ఞుల లక్షణం* మానవ జీవితం సహజంగానే సుఖ దుఃఖాల మయం.



సృష్టి క్రమంలో *మనం* భగవంతుడి స్వరూపాలుగా

 (భగవాన్ మానుష రూపేణ) మానవ లోకంలో జన్మించి, కర్మానుసారం *సరళ* జీవనము సాగిస్తూ ఉండాలి. దేవుడికి అందరు సమానులే. మనుష్యులే వారి వారి తెలివితేటల ప్రకారం, రక రకాల ప్రవర్తనల తోటి సంఘ జీవనం గడుపుతూ ఉంటారు. ఇట్టి మానవ జీవితంలో

 *అసూయలు, అహంకారాలు, వైషమ్యాలు, మనస్పర్థలు ఎందుకు*.  

కొన్ని మానవ స్వభావాలు గమనిద్దాము.

1) *అహంకారం*

అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా విరిసిన పూవుకే తెలియదు, తెల్లవారితే దాని పయనం గుడికో, స్మశానికో లేదా పాదచారుల కాలికిందికో. ఎవరికి ఏమి అపచారము, ఇబ్బంది కలిగించని పూవు భవిష్యత్తే అలా ఏమి చెప్పలేకుండా ఉంటే...అహంకార పూరిత మనుషుల జీవితం ఎంత నరకంగా ఉంటుంది. 

2) *స్వార్థపరత్వం*

*భూమి నాది నాది* యని విర్రవీగిన వారిని చూసి భూమి ఫక్కున నవ్వుతుందట. నువ్వే శాశ్వతం కాదు, ఈ భూమి నీకెలా శాశ్వతం అని. *దాన హీనుని చూసి ధనము నవ్వునట* వేమన వచనాలు. దానము చేయని వారి ధనము పరుల పాలగుట తథ్యము.

3) *నిందా వాక్యములు*

ఎప్పుడు ఇతరులపై నిందలు వేయ స్వభావం గలవారి గురించి పెద్దలు చెప్పిన హితోక్తులు.

 *నహి నిందా, ప్రశస్తా వాక్యం* ఇతరుల గురించి నిందల చెప్పడం మాని, మంచి విషయాలు ఏవైనా ఉంటే చెప్పడం చేయాలి. 

4) *ఓర్పు*

  *నిందా వాక్యములను గూడా నీరాజనాలుగా భావించే* మనస్తత్వం గొప్పది. కాని, ఎంతవరకు సాధ్యము. 

5) *విలువ* 

విలువ అనేది అవతలి వారికి ఇచ్చినప్పుడే మనకు పుచ్చుకునే అర్హత వస్తుంది.


*మరువరాని* విషయము గూడా ఒకటున్నది. *కాలో దురతి క్రమణీయః* కాల ప్రభావాన బుద్ధులు పెడదారిన పడతాయి. *వినాశ కాలే విపరీత బుద్ధిః* 


*మిత్రస్య చక్షుసా సమీక్షా మహే:* మానవుల మధ్య సంబంధాలన్నీ స్నేహ భావంతో ఉండాలని వేదం అనేక సందర్భాలలో, అనేక సార్లు ఆకాంక్షను వెలిబుచ్చినది. మేలైన విషయాలను వినాలి, మంచి ఘటనలే చూడాలి అని వైదిక స్వస్తి మంత్రాలు తెలియజేస్తున్నాయి. *అన్ని మంగళాలే సంభవించాలని వేదాశీస్సులు* దీవిస్తున్నాయి.


ధన్యవాదములు

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: