26, జులై 2020, ఆదివారం

*శ్రీనరసింహ శతకము*

*(38) జందెమింపుగ వేసి సంధ్యవార్చిన నేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు*
*తిరుమణి శ్రీచూర్ణ గురురేఖ లిడినను విష్ణు నొందక కాడు వైష్ణవుండు*
*బూదిని నుదుటను బూసుకొనిన నేమి శంభు నొందక కాడు శైవజనుడు*
*కాషాయవస్త్రాలు గట్టి కప్పిన నేమి యాశపోవక కాడు యతివరుండు*
*ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన గురుని జెందక సన్ముక్తి దొరకబోదు*
*భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*

శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామీ!
నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు.
పాపములను పారద్రోలు వాడవు.
దుష్టులను శిక్షించువాడవు.

తండ్రీ! అందముగ జందెం వేసుకొని, సంధ్య వార్చినా బ్రహ్మమును తెలియని వాడు బ్రాహ్మణుడు కాడు.

తిరుమణి శ్రీచూర్ణములతో పెద్ద నామాలు (గురు రేఖలు) పెట్టుకున్నను విష్ణువును తెలియనివాడు వైష్ణవుడు కాడు.

లలాటమున విభూతి రేఖలను ధరించినా శివుని తెలియనివాడు శైవుడు కాడు.

కాషాయ వస్త్రాలు ధరించినా ఆశలుడగని వాడు సన్యాసి కాడు.

లౌకిక వేషాలు ఎన్ని ధరించినా గురువును ఆశ్రయించని వానికి ముక్తి లేదు.

*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: