26, జులై 2020, ఆదివారం

జ్ఞాపకం





*గడచిపోయే కాలం అంతా జ్ఞాపకమే. స్మృతి శకలమే. జ్ఞాపకాలని పలవరించని వారు ఉండరు. సశైవం, బాల్యం, కౌమారం, యవ్వనం, నడిప్రాయం, వృధాప్యం...ఇలా ప్రతీ దశ జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. మనుషులు వెళ్లిపోయినా వారి జ్ఞాపకాలు నిలిచిపోతాయి. అందుకే మనిషికి నిష్క్రమణ లేదు. వెళ్లిపోయినవాళ్ళు ఇతరుల జ్ఞాపకాల్లో జీవిస్తారు. రోడ్డు మలుము తిరిగిన ప్రతిసారి ఆ మూలమీద నిల్చున్న దృశ్యం మనసులో రూపుగడుతుంది. గడప ముందు నిలబడ్డ చిత్తరువు పదిలంగా ఉండిపోతుంది. ఒక పాట, ఒక మాట, ఒక దృశ్యం జ్ఞాపకాలని సజీవంగా నిలుపుతాయి. బుద్ధుడు, క్రీస్తు, అది శంకరుడు, మొహమ్మద్ ప్రవక్త, మర్క్స్ వంటి మహానుభావులకు మరణం లేదు. శతాబ్దాలు గడిచినా వారి ఆలోచనలు, భావాలు, బోధనలు మనల్ని ఉత్తేజితులను చేస్తూనే ఉన్నాయి. ఈ విధంగా ప్రతీ మనిషి మరొకరి జ్ఞాపకాల్లో సజీవంగా నిలిచే అవకాశం ఉంది. మనసులో, మాటలో, చేతలో అంతరం లేకుండా జీవించిన  మనిషికి మృత్యువు ఉండదు. ఏ ఆనవాలు లేకుండా అదృశ్యమవరు. నలుగురి నెత్తి కొట్టయినా బతకాలనుకునే వారిని లోకం సులువుగా మరచిపోతుంది. కుటుంబ సభ్యులు మరచిపోతారు. లోకంలో పదుగురికి మేలు చేసే జీవనరీతిని అలవాటు చేసుకున్న వారి జ్ఞాపకాలు పరిమళిస్తాయి. వారి మృతి తేజస్సును అందిస్తుంది. అందుకే జ్ఞాపకాలు ఎంతో పదిలమైనవి. వాటిని కాపాడుకోవడానికి మనుషులు అహరహం శ్రమిస్తారు. కళలు, సాహిత్యం, సమస్త సృజనాత్మక రూపాలు ఇందులో భాగంగానే ఆవిష్కృతమయ్యాయి. జ్ఞాపకాలకి ధన్యతని చేకూరుస్తున్నాయి.*

*సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి....26.07.2020...ఆదివారం....🙏

కామెంట్‌లు లేవు: