6, ఆగస్టు 2020, గురువారం

దేశికుల స్తోత్రాలలో శ్రీరామ వైభవం.

దేశికుల వారు రచించిన  మొత్తం ఇరవై ఎనిమిది స్తోత్రాలలో  శ్రీ రామునిపై రెండుస్త్రోత్రాలు  ఉన్నాయి.  అందులో ఒకటి రఘువీర గద్య.    రెండవది పరమార్థ స్తుతి. 

వీటిలో మొదటిది గద్య రూపంలో ఉన్న గొప్ప లయాత్మకమైన రచన. ఈ గద్యను చక్కగా ఉచ్చైస్వరంతో పఠించినప్పుడు దానిలోని లయగతి అనుభవంలోకి వస్తుంది.ఇది సమస్త వాల్మీకి రామాయణమూ 94 కర్ణికలలో కుదించి చేసిన అద్భుత రచన. ఈ రచనలో  కవిదృష్టి అంతా భగవానుని గుణవైభవం మీదే నిలిచింది. రామాయణ కథాఘట్టాలకు , అవతార ప్రాశస్త్యానికి రెండవ స్థానమే దక్కింది.

పరమార్థస్తుతిలో పది శ్లోకాలున్నాయి. ఇవి రామాయణం లోని ఘటనాక్రమాన్ని అనుసరించి కూర్చబడ్డాయి. అయితే  వాటిలో నిగూఢార్థం ఇమిడి ఉంది. ఈస్తుతిని ప్రపన్నులు  ( శరణు కోరిన వారు) నిత్యం పఠించాలని, వారికి శ్రీరాముడు రక్షణ కల్పిస్తాడని  దేశికుల వారు స్వయంగా చెప్పారు.

పైన  చెప్పిన రెండు స్తోత్రాలలో ఒక్కొక్క శ్లోకాన్ని మచ్చుకు ఎంచుకొని  ఈక్రింద  వ్యాఖ్యానించడం జరిగింది.

రఘువీర గద్య. ( చివరి నుండి రెండవ గద్య)

దేవనాగరి లో శ్లోకం

బ్రహ్మకు తండ్రిగా, సంతానవంతుడైన ఈశ్వరునికి  తాతగా, కుటుంబానికి పెద్దగా  నిలచిన శ్రీరామునికి జయము.

రావణ వధానంతరం ఆకాశంలో సమావేశమైన దేవతలతో కూడిన బ్రహ్మ శ్రీరామునితో ఇలా అన్నారు.  “ అహంతే హృదయం రామ”( యుద్ధకాండ) నేను నీ హృదయాన్ని అని ఆమాటకు అర్థం.  ఉపనిషత్తులు  సుతుడు తండ్రికి హృదయమని చెపుతున్నాయి.

దేశికులవారు  పరమాత్మునికి  జీవాత్మ హృదయము, కుమారుడు అని చెపుతున్న, రహస్యత్రయసారంలోని ఉపోద్ఘాతాధికారంలో చెప్పిన వాక్యాలను ఉద్దేశించి ఆ మాటను ఉపయోగించారు.  సీతామాతతో కూడిన శ్రీరాముడు , చతుర్ముఖ బ్రహ్మకు తండ్రిగా, పంచముఖ ఈశ్వరునికి తాతగా, షణ్ముఖునికి , గజాననునికి ముత్తాతగా ఈ గద్య వర్ణిస్తోంది. దీనికి వ్యాఖ్యానం రచించిన శ్రీమదళగియసింగర్  ఇలా అన్నారు. “భగవద్కుటుంబానికి మూలపురుషుడైన శ్రీరామప్రభువు సులభంగా ప్రసన్నుడౌతూ ఉండగా, ఆయన వారసులను శరణు కోరవలసిన అవసరం ఏమిటి?”

2.పరమార్థస్తుతిలోని ఎనిమిదవ శ్లోకం  భగవంతుడైన శ్రీరాముని ఉద్దేశించి చెప్పినది. చాలా ఆసక్తిని కలిస్తూ ఉంటుంది.

దేవనాగరిలిపిలో శ్లోకం:

ఓ శౌర్య పరాక్రమ యోధాగ్రేసరా! నా చేయి ఎలా విడువగలవు? శరణు కోరిన వారిని రక్షిస్తానని ప్రతిన పూనావు కదా! శరణు కోరితే విభీషణునే కాదు రావణునైనా నీవు రక్షిస్తావు కదా!  అలా నీవు ప్రతిన పూనిన విషయం ఈ ప్రపంచానికంతా తెలుసు.

3. అభయప్రదాన సారంలో, దేశికులవారు అయోధ్యానగరాన్ని వీడి, అరణ్యవాసానికి బయలుదేరినప్పటి నుండి  శ్రీరామప్రభువు అంగీకరించిన శరణాగతుల జాబితాను పేర్కొన్నారు.

మొదటగా తనను అనుసరించటానికి లక్ష్మణస్వామిని అనుమతించారు. రాక్షసుల బారి నుండి కాపాడమని శరణు జొచ్చిన తాపసులకు అభయమిచ్చారు. బలవంతుడైన అన్నగారి బారి నుండి కాపాడమని శరణు కోరిన సుగ్రీవునికి అభయమిచ్చారు. నేరం చేసిన కాకాసురునికి కూడా అభయమిచ్చారు. చిరకు శరణు కోరిన విభీషణునికి కూడా అభయమిచ్చారు శ్రీరామచంద్రమూర్తి. దేశికులవారు శ్రీరామునికి తానిచ్చిన ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ, మనందరకూ ఆయనను శరణు వేడమని ప్రబోధిస్తున్నారు.

4. శరణాగతి దీపికలోని 45వ శ్లోకంలో దేశికులు భగవంతునికి ఇలాగే గుర్తుచేయటం కనిపిస్తుంది. “పూర్వావతారంలో శరణాగతుల పట్ల కారుణ్యం చూపటమే ప్రధాన కర్తవ్యమని చెప్పి ఉన్నావు. నన్ను, నా వంటి శరణార్థులను కాపాడమని కోరుతూ ఒకసారి మీ పూర్వావతార ప్రతిజ్ఞను గుర్తు చేయనా!” 

పరమార్థస్తుతిలోని ఆఖరు  శ్లోకంలో  దేశికులు శరణాగతి కోరేవారు  ఈ స్తుతిని పవిత్రభావంతో, శుచిమతితో పఠించాలని సూచించారు. స్తోత్రాన్ని పఠించే వేళ మనసులో అసూయాద్వేషాలు ఉండరాదని నిర్దేశించారు. సీతాదేవిని అపహరించటం వంటి  ఘోరాపరాధం చేసిన  రావణాసురునికే శరణు ఇవ్వగల వాగ్దానం చేసిన శ్రీరామచంద్రుడు  మనకు రక్షణను ఇవ్వటంలో ఎటువంటి సందేహమూ లేదు.

దేశికుల రచించిన అన్ని స్తోత్రాలలో శ్రీరామునికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష ప్రస్తావనలన్నో ఉన్నాయి. ఈ క్రింద వాటిలో కొన్నింటిని ప్రస్తావించడం జరిగింది.

దశావతారస్తోత్రం. (8) : ధనుష్కోవిదుడైన శ్రీరాముడు సముద్రాలను తన శరపాటవంతో శోషింప జేయగలడు. ప్రళయకాలాగ్నిని కూడా ఉపశమింప జేయగలడు. ధర్మం మూర్తీభవించినవాడు. ఒకసారి శరణు అన్నవారి రక్షణను ఎన్నటికీ విడువనివాడు అని పేర్కొన్నారు. అదే స్తోత్రంలోని 12వ శ్లోకంలో, శ్రీరాముని కారుణ్య కాకుత్స్థ అని సంబోధించారు.

 6. దేవనాయక పంచశతిలో (41)దేశికులు రాతిగా మారిన గౌతముని భార్య అహల్యను ఆ శాపం నుండి ఉద్ధరించిన శ్రీరామచరణాలను స్తుతించారు.

7.వరదరాజపంచశతి(25) లో  సముద్రానికి వారధి కట్టి , పది తలల రావణుని హతమార్చిన శ్రీరాముని వర్ణించారు. తాను నిర్మించిన వారధిని స్తుతించిన వారు అరిషడ్వర్గాల నుండి ముక్తి పొందుతారని శ్రీరాముడు స్వయంగా చెప్పారు. అలాగే వారు షడ్విధ దుఃఖాల నుండి ముక్తులౌతారని అన్నారు. అప్పుడు వారిక  ఐదు కర్మేంద్రియాలను, ఐదు జ్ఞానేంద్రియాలను ఆవరించి ఉన్న మనస్సును నియంత్రించగలరు. 

8. దయాశతకం (64-65)లోని ఈ రెండు పద్యాలలో శ్రీరాముని కరుణను పొందిన  వారి జాబితా ఉంది. సముద్రరాజు, పరశురాముడు, కాకాసురుడు, గుహుడు, సుగ్రీవుడు, శబరి ఆ జాబితాలోని వారు.

దయాశతకం(87)లో వరదరాజ పంచశతిలో పేర్కొన్న విషయాలనే మరల చెప్పారు. ఈ ప్రపంచానికంతటికీ దయాదేవి కరుణాభిక్షను ప్రసాదించిందని , కారుణ్యశిఖామణి అని చెపుతూ , ఆమె  భగవాన్‌ శ్రీరాముని చేత     సముద్రానికి వారధిని నిర్మింపజేసిందని, ఆ వారధి దర్శన మాత్రంగా , మానవులు చేసుకొన్న జన్మజన్మల పాపాల నుండి  ముక్తులౌతారని దేశికులవారు  పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు: