6, ఆగస్టు 2020, గురువారం

*అయోధ్య,.

*అయోధ్య,... ఇతర నగరాల మాదిరిగా అదో భౌగోళిక ప్రాంతంగా మిగిలిపోలేదు.  దైవం నడయాడిన నేలగా ప్రణతులందుకుంది. ఒక్కసారైనా ఆ మట్టిని ముట్టుకోవాలని లక్షలాదిమందిని ఆరాటపడేలా చేసింది.*
 *ఎందుకంటే... అది తరగని ఆధ్యాత్మిక చింతనకు ఆయువుపట్టు. ధర్మవర్తనకు, ప్రజారంజకమైన పాలనకు దిక్సూచి. సనాతన భారతీయ సాంస్కృతిక హర్మ్యానికి హృదయపీఠి.*

 *అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికా*

స్కాందపురాణం దేశంలోని ఏడు మోక్షపురాల్లో ఒకటిగా అయోధ్యను పేర్కొంది.
ఈ నగరం చేప ఆకారంలో ఉంటుందని కూడా ఈ పురాణం చెబుతుంది.
అగ్ని, బ్రహ్మపురాణాలు అయోధ్యను పాపాలను నాశనం చేసే నగరంగా కీర్తించాయి.
 యోగినీతంత్రంలో కూడా అయోధ్య ప్రస్తావన ఉంది.  అధర్వణ వేదం అయోధ్యను దేవనిర్మిత నగరంగా ప్రకటించింది. తులసీదాసు కూడా తన రామచరితమానస్‌లో అయోధ్య వైభవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
 భాగవతంలో కూడా శుకమహర్షి రఘువంశాన్ని ప్రస్తావించి ప్రత్యేకంగా అయోధ్య గురించి వివరిస్తాడు.
 *అందరూ అనుకుంటున్నట్లు అయోధ్య కేవలం నగరం మాత్రమే కాదని, మానవ జీవ చైతన్యానికి ఇదో ప్రతీక అని అధర్వణవేదం చెబుతోంది.*

 *‘అష్టాచక్రా నవద్వారా దేవానాం పూరయోధ్యా  తస్యాగ్‌ం హిరణ్మయః స్వర్గలోకో జ్యోతిషావృత్తః...’* -

ఎనిమిది చక్రాలు, తొమ్మిది ద్వారాలు ఉండే మానవ శరీరం అయోధ్యకు ప్రతీక.
జనన, మరణ చక్రంలో శరీరం తిరుగుతూ ఉంటుంది.
 వీటితో మోక్షం కోసం యుద్ధం చేయడం సాధ్యం కాదు. ఫలితం ఉండదు.
శరీరం అనే పట్టణంలోని జ్యోతిర్మయకోశానికి స్వర్గం అనే పేరుంది.
అది జీవ చైతన్య స్వరూపమైన తేజస్సుతో నిండి ఉంటుంది.
ఈ పట్టణాన్ని బ్రహ్మ సంబంధమైనదిగా  తెలుసుకున్న వారికి బ్రహ్మదేవుడు ఆయువు, కీర్తి అనుగ్రహిస్తాడని అధర్వణ వేదమంత్రాలు చెబుతున్నాయి.
********************

కామెంట్‌లు లేవు: