6, ఆగస్టు 2020, గురువారం

*వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం*



*ప్రథమ స్కంధము-రెండవ అధ్యాయము*

*భగవత్తత్త్వము మరియు భక్తియుత సేవ*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*2.1 (మొదటి శ్లోకము)*

*వ్యాస ఉవాచ*

*ఇతి సంప్రశ్నసంహృష్టో విప్రాణాం రౌమహర్షిణిః|*

*ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే॥*

రోమహర్షణుని సుతుడైన ఉగ్రశ్రవుడు (సూతగోస్వామి) బ్రాహ్మణుల ఉత్తమ ప్రశ్నలచే పూర్ణసంతుష్టి నొందినవాడై వారికి కృతజ్ఞతలు తెలిపే ప్రత్యుత్తరము నొసగ ఉద్యుక్తుడయ్యెను.

*2.2 (రెండవ శ్లోకము)*

*సూత ఉవాచ*

*యం ప్రవ్రజన్తమను పేతమ పేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ|*

*పుత్రేతి తన్మయతయా తరవోఽభినేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోఽస్మి॥*

శ్రీల సూతగోస్వామి పలికెను: సర్వుల హృదయములలోనికి చేరగలిగిన మహామునియైన శుకదేవగోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. ఉపనయస సంస్కారమును గాని లేదా ఉన్నత కులస్థులు పాటించునటువంటి పవిత్రీకరణవిధానములను గాని అనుసరింపక  సన్న్యాసమును స్వీకరించుటకై  అతడు గృహమును వీడినప్పుడు తండ్రియైన వ్యాసదేవుఢు "హా! పుత్రా!" అని విరహకాతరుడై పలికియుండెను. అదే విరహభావములో మునిగిన వృక్షములు అంతట ఆ బాధాతప్తుడైన తండ్రికి ప్రతిధ్వానముతో ప్రత్యుత్తర మిచ్చినవి.

*2.3 (మూడవ శ్లోకము)*

*యః స్వానుభావమఖిల శ్రుతిసారమేకమధ్యాత్మ దీపమతితితీర్హతాం తమోఽన్ధమ్|*

*సంసారిణాం కరుణయాహ పురాణగుహ్యం*
*తం వ్యాస సూనుముపయామి గురుం మునీనామ్॥*

వ్యాసదేవుని తనయుడును, మునులందరికి గురువర్యుడును అగు శ్రీశుకదేవగోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. అంధకారబంధురమైన సంసారమును తరించుటకు తీవ్రయత్నము సలిపెడి సంసారుల యెడ స్వయముగా అనుభూతమొనర్చుకొనిన పిమ్మట పలికియుండెను.

*2.4 (నాల్గవ శ్లోకము)*

*నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్|*

*దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమూదీరయేత్॥*

జయమును సాధించుటకు ఏకైక మార్గమైన శ్రీమద్భాగవతమును పఠించుటకు మొదట దేవదేవుడైన నరనారాయణ ఋషికి, చదువుల తల్లి సరస్వతీదేవికి, గ్రంథకర్తయైన శ్రీల వ్యాసదేవునికి ప్రతియొక్కరు గౌరవపూర్వక వందనముల నర్పించవలెను.

*2.5 (ఐదవ శ్లోకము)*

*మునయః సాధు పృష్టోఽహం భవద్భిర్లోకమంగళమ్|*

*యత్కృతః కృష్ణసంప్రశ్నో యేనాత్మా సుప్రసీదతి॥*

ఓ మునులారా! యోగ్యములైన ప్రశ్నలు నన్ను అడిగారు. కృష్ణపరములుగా నుండి జగన్మంగళమునకు సంబంధించినవి కనుక శ్రేష్ఠములై యున్నవి. అటువంటి ప్రశ్నలే వాస్తవమునకు ఆత్మను సంపూర్ణముగా సుప్రసన్నము చేయసమర్ధమైనది.


*2.6 (ఆరవ శ్లోకము)*

*స వై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే|*

*అ హైతుక్యప్రతిహతా యయాత్మా సుప్రసీదతి॥*

అధోక్షజుడైన శ్రీకృష్ణభగవానుని యెడ ప్రేమపూర్వకమైన భక్తియుత సేవను కలిగింపజేయునదే మానవుల పరమధర్మమై యున్నది. ఆత్మ యొక్క పూర్ణసంతృప్తి కొరకు అట్టి భక్తియుతసేవ నిర్హేతుకము మరియు అవరోధరహితముగా ఉంటుంది.


*2.7 (ఏడవ శ్లోకము)*

*వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః|*

*జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకమ్॥*

దేవదేవుడైన శ్రీకృష్ణునకు భక్తియుతసేవ చేయుటద్వారా మనుష్యుడు తొందరగా నిర్హేతుకమైన జ్ఞానమును, జగమునుండి వైరాగ్యము పొందుచున్నాడు.

*2.8 (ఎనిమిదవ శ్లోకము)*

*ధర్మః స్వనుష్ఠితః పుంసాం విష్వక్సేనకథాసు యః|*

*నోత్సాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలమ్॥*

తన నిజస్థితి ననుసరించి మనుజుడు చేయు విద్యుక్తధర్మ నిర్వహణము దేవదేవుని కథలయందు అతనికి అనురక్తిని కలిగించనిచో అది కేవలము శ్రమ మాత్రమే అవుతుంది.

*2.9 (తొమ్మిదవ శ్లోకము)*

*ధర్మస్య హ్యాపవర్గస్య నార్థోఽర్థాయోపకల్పతే|*

*నార్థస్య ధర్మైకాస్తస్య కామో లాభాయ హి స్మృతః॥*

విద్యుక్తధర్మములన్నియును నిశ్చయముగా చరమమైన మోక్షము కొరకే ఉద్దేశింపబడినవి. వాటినెన్నడును భౌతికలాభము కొరకై నిర్వహింపరాదు. అంతమాత్రమే కాకుండా మహామునుల నిర్ణయము ప్రకారము పరమధర్మమునందు విముక్తుడైనవాడు. భౌతికలాభము నెప్పుడును ఇంద్రియభోగమునకై వినియోగింపరాదు.

*2.10 (పదవ శ్లోకము)*

*కామస్య నేంద్రియప్రీతిర్లాభో జీవేత యావతా|*

*జీవస్య తత్త్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః॥*

జీవితములో కోరికలెన్నడును ఇంద్రియభోగముల కోసం కేంద్రీకృతమై ఉండరాదు. మానవుడు పరతత్త్వమును గూర్చి విచారణము సలుపుటకే ఉద్దేశింపబడి ఉన్నందున కేవలము ఆరోగ్యప్రదమైన జీవనము కోసం కోరికలను కలిగి ఉండవలెను. అంతకు మించి కర్మల లక్ష్యము వేరొకటి కాకూడదు.

*2.11 (పదకొండవ శ్లోకము)*

*వదన్తి తత్తత్త్వవిదస్తత్వం యజ్ జ్ఞానమద్వయమ్|*

*బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే॥*

పరతత్త్వము తెలిసిన తత్త్వవిదులు అట్టి అద్యయతత్త్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడని పిలుతురు.

*2.12 (పన్నెండవ శ్లోకము)*

*తచ్ఛ్రద్దధానా మునయో జ్ఞానవైరాగ్యయుక్తయా|*

*పశ్యన్త్యాత్మని చాత్మానం భక్త్యా శ్రుతగృహీతయా॥*

జిజ్ఞాసువైనవాడు లేదా ముని జ్ఞానవైరాగ్యయుక్తుడై వేదాంతశృతి ద్వారా తాను శ్రవణము చేసియున్న విధముగా భక్తియుతసేవను గావించుచు పరతత్త్వమును అనుభూతమొనర్చుకొనగలుగును.

*2.13 (పదమూడవ శ్లోకము)*

*అతః పుంభిర్ధ్విజశ్రేష్ఠా వర్ణాశ్రమవిభాగశః |*

*స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి ర్హరితోషణమ్॥*

ఓ ద్విజశ్రేష్ఠులారా! కనుకనే శ్రీకృష్ణభగవానునికి ముదమును గూర్చుటయే వర్ణాశ్రమపద్ధతి ననుసరించి మనుజుడు తన స్వధర్మమునకు నిర్దేశింపబడిన కర్మలను ఒనరింఛుట ద్వారా సాధించెడి అత్యున్నత పూర్ణత్వమని నిర్ణయింపబడినది.

*2.14 (పదునాల్గవ  శ్లోకము)*

*తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః*

*శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా॥*
కనుక ప్రతియొక్కరును ఏకైకలక్ష్యముతో సాత్వతాంపతియైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణము, కీర్తనము, స్మరణము, పూజనములందు ఎల్లప్పుడు నియిక్తులు కావలెను.


*2.15 (పదిహేనవ శ్లోకము)*

*యదనుధ్యాసినా యుక్తాః కర్మగ్రంథినిబంధనమ్|*

*ఛిన్దన్తి కోవిదాస్తస్య కో న కుర్యాత్కథారితమ్॥*

బుద్ధిమంతులైనవారు శ్రీకృష్ణుని  స్మరణమను దివ్యఖడ్గమును చేబూని కర్మగ్రంథిని త్రెంపివేయుచున్నారు. కనుక ఎవరు  ఆ దేవదేవుని కథల యందు శ్రద్ధను కనబరచకుందురు? (శ్రద్ధ కనబరచుదురు అని అర్థము).

*2.16 (పదునారవ శ్లోకము)*

*శుశ్రూషోః శ్రద్దధానస్య వాసూదేవకథారుచిః|*

*స్యాన్మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థనిషేవణాత్॥*

ఓ విప్రులారా! సర్వపాపదూరులైనటువంటి మహాభక్తులకు సేవను గూర్చుట ద్వారా గొప్ప సేవ ఒనరింపబడుచున్నది. అట్టి సేవ ద్వారా మనుజునికి వాసుదేవుని కథలను శ్రవణము చేయుట యందు రుచి ఉత్పన్నమగుచున్నది.


*2.17 (పదిహేడవ శ్లోకము)*

*శృణ్వతాం స్వకథాః కృష్ణః  పుణ్యశ్రవణ కీర్తనః|*

*హృద్యస్తఃస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతామ్॥*

పరమాత్మగా సర్వజీవ హృదయములలో నిలిచినవాడును, శ్రద్ధావంతులైన భక్తుల శ్రేయోభిలాషియును అగు శ్రీకృష్ణభగవానుడు చక్కగా శ్రవణకీర్తనములు జరిగినపుడు పుణ్యప్రదములైన తన దివ్యలీలాకథల యెడ శ్రవణోత్సాహమును పెంపొందించుకొనిన భక్తుని హృదయము నుండి భౌతికసుఖాభాలాషను తొలగించివేయుచున్నాడు.


*2.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*నష్ట ప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా|*

*భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ॥*

నిత్యము తానొనరించునటువంటి శ్రీమద్భాగవతోపదేశముల శ్రవణము,శుద్ధభక్తుల సేవనము ద్వారా హృదయమునందలి అభద్రములన్నియును దాదాపు సంపూర్ణముగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణభగవానుని యెడ అకుంఠితమైన ప్రేమయుతసేవ స్థాపితము కాగలదు.

*2.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తదా రజస్తమోభావాః కామలోభాదయశ్చ యే|*

*చేత ఏతైరనావిద్ధం స్థితం సత్త్వే ప్రసీదతి॥*

నిక్షేపరహితమైన ప్రేమయుతసేవ హృదయమునందు సుస్థిరమైనంతనే రజస్తమోగుణ ఫలములైన కామక్రోధ లోభములు హృదయమునుంఢి అదృశ్యమగును. అంతట భక్తుడు సత్త్వగుణమునందు స్థితిని పొంది సంపూర్ణముగా ప్రసన్నుడగును.

*2.20 (ఇరువదవ శ్లోకం)*

*ఏవం ప్రసన్నమనసో భగవద్భక్తి యోగతః*

*భగవత్తత్త్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే*

ఈ విధముగా శుద్ధసత్త్వము నందు స్థితుడై శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ ద్వారా ప్రసన్నమైన మనస్సును పొందెడి మనుజుడు సమస్త   భౌతికసంగత్వము నుండి ముక్తినొందిన స్థితిలో వాస్తవమైన భగవత్తత్త్వ విజ్ఞానమును పొందగలడు.

*2.21 (ఇరవై ఒకటవ శ్లోకము)*

*భిద్యతే హృదయగ్రంథిశ్ఛిద్యన్తే  సర్వసంశయాః|*

*క్షీయన్తే దాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే॥*

ఈ విధముగా హృదయగ్రంథి త్రెంపివేయబడి సర్వసంశయములు సమూలముగా నశించును. అటుపిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్యకర్మపరంపర పరిసమాప్తి నొందును.

*2.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*అతో వై కవయో నిత్యం భక్తిం పరమయా ముదా|*

*వాసుదేవే భగవతి కుర్వన్త్యాత్మప్రసాదనీమ్॥*

కనుకనే అనంతకాలము నుండి పరమభక్తులైనవారు ఆత్మకు ప్రసన్నతను గూర్చునదైనందున దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుతసేవను నిశ్చయముగా అత్యంత ముదముతో గావించుచున్నారు.

*2.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్గుణాస్తైర్ యుక్తః పరః పురుష ఏక ఇహాస్య ధత్తే|*

*స్థిత్యాదయే హరివిరించిహరేతి సంజ్ఞాః*
*శ్రేయాంపి తత్ర ఖలు సత్త్వతనోర్నృణాం స్యుః॥*

దివ్యుడైన పరమపురుషుడు ప్రకృతి త్రిగుణములైన సత్త్వగుణము, రజోగుణము, తమోగుణములతో పరోక్షముగా సంగత్వమును కలిగియున్నాడు. భౌతికజగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు ఆతడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులనెడి గుణావతారములను స్వీకరించుచున్నాడు. ఈ మూడింటిలో సత్త్వగుణరూపమైన విష్ణువు నుండి సమస్త మానవులు పరమశ్రేయమును పొందగలరు.

*2.24 (ఇరువది నాల్గవ శ్లోకము)*

*పార్థివాద్దారుణో ధూమస్తస్మాదగ్నిస్త్రయీమయః|*

*తామసస్తు రజస్తస్మాత్సత్త్వం యద్బ్రహ్మదర్శనమ్॥*

దారువు భూమి యొక్క రూపాంతరమైనను, ధూమము దారువు కన్నను శ్రేష్ఠమైనది. కాని యజ్ఞము ద్వారా ఉన్నతజ్ఞాన సముపార్జనము జరుగును గనుక అగ్నియనునది ధూమము కన్నను శ్రేష్ఠమైనది. అదేవిధముగా రజోగుణము తమోగుణము కన్నను శ్రేష్ఠమైనను,సత్త్వగుణముచే పరతత్త్వానుభవమును పొందు స్థితికి మనుజుడు చేరును గనుక సత్త్వగుణము రజోగుణము కన్నను శ్రేష్ఠమై యున్నది.


*2.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*భేజిరే మునయోఽథాగ్రే భగవన్తమధోక్షజమ్|*

*సత్త్వం విశుద్ధం క్షేమాయ కల్పన్తే యేఽను తానిహ॥*

ప్రకృతి త్రిగుణములకు పరుడైనందునే అధోక్షజుడైన శ్రీకృష్ణుని పూర్వము మహామునులు  భక్తియుతసేవతో అర్చించిరి. భౌతికబంధముల నుండి ముక్తిని పొంది దివ్యలాభమును పొందు నుద్దేశ్యముతోనే వారు ఆ దేవదేవుని ఆరాధించిరి. అట్టి ప్రామాణికుల ననుసరించువారు కూడ భౌతికజగము నుండి ముక్తిని పొందుటకు అర్హులగుచున్నారు.

*2.26 (ఇరువదిఆరవ శ్లోకము)*

*ముముక్షవో ఘోరరూపాన్ హిత్వా భూతపతీనథ|*

*నారాయణకలాః శాన్తా భజన్తి హ్యనసూయవః॥*

ముక్తిని పొందుట యందు శ్రద్ధావంతులైనవారు నిశ్చయముగా అసూయరహితులై సర్వులను గౌరవింతురు. అయినను వారు ఘోరములైన వివిధ దేవతారూపములను నిరసించి విష్ణువు మరియు అతని ప్రధానాంశముల శాంతరూపములనే అర్చింతురు.

*2.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*రజస్తమఃప్రకృతయః సమశీలా భజన్తి వై|*

*పితృభూతప్రజేశాదీన్ శ్రియైశ్వర్యప్రజేస్సవః॥*

రజోగుణమునందు మరియు తమోగుణమునందు స్థితిని కలిగినవారు స్త్రీసాంగత్యము, ఐశ్వర్యము, అధికారము, సంతానమాది భౌతికలాభమును పొందగోరినవారై నందున పితృదేవతలను, ఇతర జీవులను, లోకపాలనా వ్యవహారములను గాంచెడి దేవతలను అర్చింతురు.

*2.28 (ఇరువది ఎనిమిదివ      శ్లోకము)*

*వాసుదేవపరా వేదా వాసుదేవపరా మఖాః|*

*వాసుదేవపరా యోగా వాసుదేవపరాః క్రియాః॥*

*2.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*వాసుదేవపరం జ్ఞానం వాసుదేవపరం తపః*

*వాసుదేవపరో ధర్మో వాసుదేవపరా గతిః॥*

శాస్త్రములందలి జ్ఞానము యొక్క పరమలక్ష్యము శ్రీకృష్ణభగవానుడై యున్నాడు. యజ్ఞాచరణ ప్రయోజనము ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచుటయే. ఆ ఆదిదేవుని అనుభూతమొనర్చుకొనుటకే యోగము ఉద్దేశింపబడినది. కామ్యకర్మఫలము లన్నియును అంత్యమున అతని చేతనే అనుగ్రహింపబడుచున్నవి. దివ్యజ్ఞానమనగా అతడే. సర్వవిధములైన తీవ్ర తపస్సులు అతనిని తెలిసికొనుట కొరకే నిర్వహింపబడును. ఆ ఆదిదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుతసేవను గూర్చుటయే పరమధర్మమై యున్నది. దేవదేవుడైన అతడే మానవజన్మ యొక్క పరమగతియై యున్నాడు.


*2.30 (ముప్పదవ శ్లోకము)*

*స ఏవేదం ససర్జాగ్రే భగవానాత్మ  మాయయా*

*సదసద్రూపయా చాసౌ గుణమయాగుణో విభుః॥*

సృష్ట్యారంభమున దేవదేవుడైన వాసుదేవుడు తన దివ్యమైన ఆధ్యాత్మికస్థితి యందు నిలిచియుండి ఆంతరంగికశక్తి ద్వారా సథ్, అసత్తులను సృష్టించెను.

*2.31 (ముప్పది ఒకటవ శ్లోకం)*

*తయో విలసితేష్వేషు గుణేషు గుణవానివ|*

*అన్తఃప్రవిష్ట  ఆభాతి విజ్ఞానేన విజృంభితః॥*

భౌతిక జగమును సృష్టించిన పిమ్మట భగవానూడైన వాసుదేవుడు తన విస్తారము ద్వారా దాని యందు ప్రవేశించును. ప్రకృతిజన్య త్రిగుణములను గూడియున్నను, సాధారణ వ్యక్తజీవులలో ఒకనిగా గోచరించినను ఆ దేవదేవుడు సదా తన దివ్యస్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగియుండును.

*2.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*యథా హ్యవహితో వహ్నిర్దారుష్వేకః స్వయోనిషు|*

*నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్*

అగ్ని దారువు నందంతటను వ్యాపించినట్లుగా దేవదేవుడైన వాసుదేవుడు పరమాత్మునిగా సమస్తము నందును వ్యాపించి యుండును. కనకనే అద్వితీయుడైనను ఆ భగవానుడు బహురూపునిగా గోచరించును.

*2.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*అసౌ గుణమయైర్భా వైర్భూతసూక్ష్మేంద్రియాత్మభిః|*

*స్వనిర్మి తేషు నిర్విష్టో భుంక్తే భూతేషు తద్గుణాన్*

పరమాత్ముడు భౌతికప్రకృతి యొక్క త్రిగుణములచే ప్రభావితులైన జీవుల దేహములందు ప్రవేశించి, వారు తమ సూక్ష్మ మనస్సు ద్వారా త్రిగుణ ప్రభావమును అనుభవించునట్లుగా చేయుచున్నాడు.


*2.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*భావయత్యేష సత్త్వేన లోకాన్ వై లోకభావనః|*

*లీలావతారానురతో దేవతిర్యఙ్నరాదిషు॥*

ఈ విధముగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు దేవతలు, మినవులు, జంతువులు మున్నగు జీవులతో నిండియున్న సర్వలోకములను     పోషించుచుండును. శుద్ధ సత్త్వమునందు స్థితులైనట్టి వారలను ఉద్ధరించుటకు అతడు అవతారములను దాల్చి పెక్కులీలలను గావించును.

*శ్రీమధ్భాగవతము నందలి "భగవత్తత్త్వము మరియు భక్తియుతసేవ" అను ప్రథమస్కంధములోని ద్వితీయాధ్యాయము సమాప్తము*

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
**********************

కామెంట్‌లు లేవు: