10, ఆగస్టు 2020, సోమవారం

నైవేద్యం



సమస్త జీవరాశికి ఎప్పుడు ఎప్పుడు, ఏమి కావాలన్న విషయం విష్ణువుకు తెలుసు. అందువల్లే ఆయన్ను స్థితి కారకుడు అంటారు. ఆ విష్ణువు రూపమైన వేంకటేశ్వరుడికి నైవేద్యం సమర్పించడం అంటే సష్టిలో ఆకలితో ఉన్న సమస్త జీవులను సంతృప్తి పరచడమేనని మన పురాణాల్లో చెప్పబడింది. కలియుగ దైవంగా తిరుమల కొండ పై కొలువై ఉన్న ఆ వేంకటేశ్వరుడికి నిత్యం మూడు పూటలా నైవేద్యాన్ని సమర్పిస్తారు. తిరుమల గర్భగుడిలో స్వామి వారి మూల విగ్రహం ఎత్తునకు అనుగుణంగా స్వామి వారికి ఏ పూట ఎంత పరిమాణంలో నైవేద్యం సమర్పించాలన్న విషయం శాస్త్రంలో స్పష్టంగా నిర్దేశించారు. అదే సమయంలో ఏ సమయంలో ఏ ఏ రకాల నైవేద్యం సమర్పించాలన్న విషయం కూడా శాస్త్రంలో పేర్కొన్నారు. ఆ నైవేద్యానికి సంబంధిచిన వివరాలతో పాటు నైవేద్యం సమయంలో ఎటువంటి ఆచారాలు పాటిస్తారన్న విషయానికి సంబంధించిన వివరాలు
బాలభోగం ఇలా సాధారణంగా తిరుపతి అనగానే లడ్డు మనకు గుర్తుకు వస్తుంది. అయితే ఈ లడ్డుతో పాటు స్వామివారికి మూడు పూటలా వివిధ రకాల పదార్థాలను స్వామివారికి నైవేద్యం పెడుతారు. అటు పై ఆ నైవేద్యాన్ని భక్తులకు పంచుతారు. ఈ మూడు పూటల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల మధ్య సమర్పించే నైవేద్యాన్ని బాలభోగం అంటారు. ఇందులో మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కర పొంగలి, రవ్వకేసరి ఉంటుంది.
రాజభోగం
మధ్యాహ్నం సమర్పించే నైవేద్యాన్ని రాజభోగం అంటారు. ఇలా ఇది పది నుంచి పదకొండు గంటల మధ్య ఉంటుంది. ఇందులో శుద్ధాన్నం, పులిహోర, గుడాన్నం, దద్యోజనం, శీర లేదా చక్కెరన్నం ఉంటుంది. ఇక రాత్రి స్వామివారికి నివేదించే నైవేద్యాన్ని శయన భోగం అంటారు. ఇందులో మరీచ్య అన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ తో పాటు వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నాన్ని సమర్పిస్తారు. దీనినే శాకాన్నం అని పిలుస్తారు.
శయనభోగం
రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య సమర్పిస్తారు. మూడు పూటలతో పాటు స్వామివారికి అల్పాహారాలు కూడా సమర్పిస్తారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన తర్వత అప్పుడే తీసిన చిక్కని ఆవుపాలు సమర్పిస్తారు. తోమాల, సహస్రనామ అర్చన సేవల తర్వాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం ఇస్తారు. తర్వాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాత:కాల ఆరాధన పూర్తవుతుంది. అటు పై సర్వదర్శనం మొదలవుతుంది. రాజభోగం అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వ దర్శనం ప్రారంభమవుతుంది. సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని తాజా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అర్థరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం అందజేస్తారు. అటు పై ఏకాంత సేవలో భాగంగా నేతితో వేయించిన బాదం, జీడిపప్పులు, తాజా పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.
అన్నీ ఆగమశాస్త్ర ప్రకారమే
ఇక నైవేద్యాలను ఎలా వండాలి, ఎవరు వండాలి అన్న విషయంతో పాటు ఆ సమయంలో ఎలా ఉండాలన్న విషయం మొత్తం ఆగమశాస్త్రంలో సవివరంగా పేర్కొన్నారు. నైవేద్యం వండే సమయంలో వాసన సోకకుండా నోటికి, ముక్కుకు అడ్డుగా వస్త్రం పెట్టుకొంటారు. స్వామికి సమర్పించేదాకా బయటివారు ఎవరూ నైవేద్యాన్ని కనీసం చూడటానికి కూడా అనుమతించరు. నైవేద్యాన్ని సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్లతో శుద్ధి చేస్తారు. అటు పై నైవేద్యం పెట్టే సమయంలో అర్చకుడు మాత్రమే ఉంటారు. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు నైవేద్యం పై గ్రాసముద్రతో ప్రసాదన్ని తాకి దానిని స్వామి కుడిచేతికి తాకించి, నోటి దగ్గర తాకుతారు. పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్నసూక్తం పఠిస్తారు. ముద్దముద్దకీ మధ్య ఔషద గుణాలున్న వివిధ పత్రాలు కలిపిన నీటిని కూడా సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించేత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది.
51 లడ్డూలను ఒక ప్రోక్తం అంటారు. ఒక్కోసారి వెయ్యి ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు. అంటే 51వేల లడ్డూలన్న మాట. ఇందుకుగాను 2వేల కిలోల శనగ పిండి, 4వేల కిలోల చక్కెర, 1850 కిలోల నెయ్యి, 350 కిలోల జీడిపప్పు, ఎనభై ఏడున్నర కిలోల ఎండుద్రాక్ష, 50 కిలోల యాలకులు, 50 కిలోల కలకండ అవసరమవుతాయి.
వివిధ నైవేద్యాలు
తిరుమలలో విజయనగర సామ్రాజ్య కాలం నాటికే రోజుకు వందకు పైగా నివేదనలు చేసే పద్ధతి ఏర్పడిపోయింది. వందలాది మంది దాతలు అనేక పదార్థాల నివేదనకు ఏర్పాట్లు చేయడంతో ఎన్నెన్నో నైవేద్యాలు స్వామివారికి నివేదిస్తూవుంటారు. వీటిలో కొన్నిటిని ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టడమో, అమ్మడమో చేసే పద్ధతి ఉంది. స్వామి వారి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్దుష్టంగా ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో సవాల్ జవాబ్ పట్టీలో నిర్దేశించడంతో, తిరుమల తిరుపతి దేవస్థానం దానని ప్రమాణంగా తీసుకుని ఈ నివేదనలు కొనసాగిస్తోంది.
వేర్వేరు నైవేద్యాల పేర్లు ఇలా ఉన్నాయి:
అన్న నైవేద్యాలు
• సంధి తిరుప్పానకం
• తిరుప్పానకం
• రజన తిరుప్పానకం
• వెళ్ళై తిరుప్పానకం
• అర్ధనాయకతళిగ
• నాయికతళిగ
• దద్దోజనం (దధ్యోజనం)
• మట్టిరాయ్ తళిగ
• తిరుప్పావడ (పులిహోర లాంటి పదార్థం)
• తిరువలక్కం
• తిలాన్నం
• అక్కలిమండై


పంచవాహి - పవిత్ర అన్నం
భక్ష్యాలు
• అప్పపడి - అప్పాలు
• అతిరసపడి - అరిసెలు
• వడైపడి - వడ
• గోధిపడి - వడ వంటిది
• సుఖియాన్‌పడి
• ఇడ్డిలీపడి - ఇడ్లీ
• సిడైపడి
• ప్రోదిలింగైపడి
ఇతర పదార్థాలు
• పోరిపడి - అటుకులు
• తిరుక్కనమడై లేక మనోహరపడి - మినపలడ్డు (సున్నుండ లాంటిది)
• పారుప్పువియలు - గుగ్గిళ్ళు
• తిరుప్పయ్యారం - మినపవడ (పొట్టు ఉన్న మినుములతో చేస్తారు)
• అవల్‌పడి - గట్టి అటుకులు
• తెరకులాల్
ఇతర తినుబండారాలు
• మాత్ర
• బెల్లం
• పంచదార
• రకరకాల పళ్ళు
• వేయించిన జీడిపప్పు
• బాదం
• మినపసున్ని
• జిలేబీ
• దోసె
• వేయించిన నువ్వుల పొడి
• కజ్జాయం పాలు
• పెరుగు
• వెన్న
• తాంబూలం
******************

కామెంట్‌లు లేవు: