10, ఆగస్టు 2020, సోమవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం



అష్టమ స్కంధము - పదియవ అధ్యాయము

దేవాసుర సంగ్రామము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

10.27 (ఇరువది ఏడవ శ్లోకము)

తేఽన్యోన్యమభిసంసృత్య క్షిపంతో మర్మభిర్మిథః|

ఆహ్వయంతో విశంతోఽగ్రే యుయుధుర్ద్వంద్వయోధినః॥6687॥

ఆ రెండు పక్షములవారు ఎదురెదురుగా మోహరించి పరస్పరము పరుషవచనములను పలుకుచుండిరి. ఈ విధముగా వారు యుద్ధమును కొనసాగించుచుండిరి. 

10.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

యుయోధ బలిరింద్రేణ తారకేణ గుహోఽస్యత|

వరుణో హేతినాయుధ్యన్మిత్రో రాజన్ ప్రహేతినా॥6689॥

10.28  (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

యమస్తు కాలనాభేన విశ్వకర్మా మయేన వై|

శంబరో యుయుధే త్వష్ట్రా సవిత్రా తు విరోచనః॥6689॥

రాజా! బలిచక్రవర్తి ఇంద్రునితోను, కుమారస్వామి తారకాసురునితోను, వరుణుడు హేతితోడను, మిత్రుడు ప్రహేతితోను తలపడి పోరుచుండిరి. యమధర్మరాజు కాలనాథుని, విశ్వకర్మ మయుని, శంబరాసురు త్వష్టతో, సవిత విరోచనుని ఎదుర్కొని యుద్ధము చేయుచుండిరి.

10.30 (ముప్పదియవ శ్లోకము)

అపరాజితేన నముచిరశ్వినౌ వృషపర్వణా|

సూర్యో బలిసుతైర్దేవో బాణజ్యేష్ఠైః శతేన చ॥6690॥

10.31 (ముప్పదియవ శ్లోకము)

రాహుణా చ తథా సోమః పులోమ్నా యుయుధేఽనిలః|

నిశుంభశుంభయోర్దేవీ భద్రకాలీ తరస్వినీ॥6691॥

అపరాజితుడు నముచితోను, అశ్వనీదేవతలు వృషపర్వునితోను, సూర్యుడు బలిచక్రవర్తియొక్క కుమారులైన బాణుడు మొదలగు నూరుమందితోను యుద్ధము సలుపుచుండిరి. చంద్రుడు రాహువుతోడను, వాయుదేవుడు పులోమునితోను పోరాడు చుండిరి. వేగముగల భద్రకాళీదేవి శుంభునిశుంభులను ఎదుర్కొనుచుండెను.

10.32 (ముప్పది రెండవ శ్లోకము)

వృషాకపిస్తు జంభేన మహిషేణ విభావసుః|

ఇల్వలః సహ వాతాపిర్బ్రహ్మపుత్రైరరిందమ॥6692॥

10.33 (ముప్పది మూడవ శ్లోకము)

కామదేవేన దుర్మర్ష ఉత్కలో మాతృభిః సహ|

బృహస్పతిశ్చోశనసా నరకేణ శనైశ్చరః॥6693॥

10.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

మరుతో నివాతకవచైః కాలేయైర్వసవోఽమరాః|

విశ్వేదేవాస్తు పౌలోమై రుద్రాః క్రోధవశైః సహ॥6694॥

శత్రుసూదనా! పరమశివుడు జంభాసురునితోను, అగ్నిదేవుడు మహిషాసురునితోను, బ్రహ్మదేవుని తనయులైన మరీచి మొదలగువారు వాతాపి, ఇల్వలులతోను పోరు సల్పుచుండిరి. దుర్మర్షణుని కామదేవుడు,ఉత్కళుని మాతృగణములవారును, శుక్రాచార్యుని బృహస్పతియు, శనైశ్చరుడు నరకాసురుని ఎదుర్కొనుచుండిరి. మరుద్గణముల వారు నివాత కవచులతోను, వసువులు కాలేయులతోను, విశ్వేదేవులు పౌలోములతోను, రుద్రగణములవారు క్రోధవశులతోను సంగ్రామ మొనర్చుచుండిరి.

10.35 (ముప్పది ఐదవ శ్లోకము)

త ఏవమాజావసురాః సురేంద్రాః  ద్వంద్వేన సంహత్య చ యుధ్యమానాః|

అన్యోన్యమాసాద్య నిజఘ్నురోజసా  జిగీషవస్తీక్ష్ణశరాసితోమరైః॥6695॥

ఈ విధముగా రణరంగమున దేవతలు, అసురులు ద్వంద్వయుద్ధము ద్వారాను, సామూహిక ఆక్రమణ ద్వారాను ఎదుర్కొనుచు పరస్పర విజయకాంక్షతో, వీరావేశముతో వాడియైన బాణములతోను, ఖడ్గములతోను, తోమరములతోను కొట్టుకొనుచుండిరి.

10.36 (ముప్పది ఆరవ శ్లోకము)

భుశుండిభిశ్చక్రగదర్ష్టిపట్టిశైః  శక్త్యుల్ముకైః ప్రాసపరశ్వధైరపి|

నిస్త్రింశభల్లైః పరిఘైః సముద్గరైః సభిందిపాలైశ్చ శిరాంసి చిచ్ఛిదుః॥6696॥

భుశుండులు, చక్రములు, గదలు, చురకత్తులు, అడ్డకత్తులు, కత్తులు, శక్తులు, కొరవులు, ఈటెలు, గండ్రగొడ్డళ్ళు, బల్లెములు, ఇనుపరోకళ్ళు, ముండ్లగదలు, ఇనుపగుదియలు మొదలగు ఆయుధములతో వారు శత్రువులయొక్క శిరములను ఖండించుచుండిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

కామెంట్‌లు లేవు: