15, సెప్టెంబర్ 2020, మంగళవారం

*ధార్మికగీత - 8*


                                     
 *శ్లో:-*
*న గృహం గృహమి త్యాహు: ౹*
 *గృహిణీ గృహ ముచ్యతే* ౹
 *గృహం తు గృహిణీ హీనమ్ ౹*
 *అరణ్య సదృశం మతమ్* ౹౹

*భా:- పరివారం, సేవకగణము, వస్తువాహనములు, ధనకనక రాసులు, సిరిసంపదలతో తులతూగుతున్నప్పటికిని ఆ ఇల్లు వాస్తవంగా "గృహము" అని వ్యవహరింపబడదు. మహాలక్ష్మిని పోలిన "గృహిణి " మహారాణిలా తిరుగాడు చున్నప్పుడే ఆ ఇంటిని నిజమైన గృహముగా పరిగణిస్తారు. అట్టి ఇల్లాలి ప్రాపులో సంతానం దినదిన ప్రవర్ధమానమై, వంశాభివృద్ధితో ఇల్లు కళకళ లాడుతుంది. బ్రహ్మచర్య, వానప్రస్థ,సన్న్యాసాశ్రమ వాసులకు, బంధుమిత్రులకు ఆత్మీయ అతిథిమర్యాదలలో కీలక పాత్రధారి ఇల్లాలే. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఓర్పు, నేర్పు, సమర్ధత, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత , దయ, ధైర్యము, స్థైర్యము మూర్తీభవించిన అలాంటి "గృహిణి" లేని ఆ ఇల్లు అడుగడుగునా భయానకమై, అరణ్యాన్ని తలపిస్తుంది. కళాకాంతులు , భోగభాగ్యాలు, శాంతిసౌభాగ్యాలు లేక వెలవెల పోతుంది. గృహస్థుకు గృహమే ఒక స్వర్గసీమ. అందుకనే " ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే యీ జగతికి జీవనజ్యోతి " అన్నాడో సినీకవి*
                                     *****
                       *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

 *ధార్మికగీత - 8*

 *పరివారంబును వస్తుసంపదలు నింపైయుండి పొర్లాడినన్*
*అరయన్ గేహిని లేని యిల్లు ధరపై నారణ్యమై వెల్గదే?*
*కరమై యాశ్రమవాసులన్ బొదవుచున్ గార్హస్థ్యమింపొందగా*
*వరమైనిల్చెడి యింతియేగద! సదా ప్రాణంబు జీవంబుయున్*

కామెంట్‌లు లేవు: