15, సెప్టెంబర్ 2020, మంగళవారం

గీతా మకరందము

14-18-గీతా మకరందము
        గుణత్రయవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అవతారిక - ఆ యా గుణములు కలవారు మరణానంతర మేయేలోకములను బొందుదురో చెప్పుచున్నారు –

ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా 
మధ్యే తిష్ఠన్తి రాజసాః |
జఘన్యగుణవృత్తిస్థా
అధో గచ్ఛన్తి తామసాః ||

తాత్పర్యము:- సత్త్వగుణము గలవారు (మరణానంతరము) ఊర్ధ్వలోకముల కేగుచున్నారు. రజోగుణముగలవారు మధ్యమమగు మనుష్యలోకమున జన్మించుచున్నారు. నీచగుణ ప్రవృత్తిగల తమోగుణయుతులు (పాతాళాది) అధోలోకములకు (లేక, అల్పములగు పశ్వాదిజన్మలకు) జనుచున్నారు.

వ్యాఖ్య:- సత్త్వగుణముగలవారు ఊర్ధ్వలోకములను, ఊర్ధ్వగతినే పొందుదురని తెలుపుటవలన, ఆ
గుణము అవలంబనీయమనియు, రజోగుణతమోగుణయుతులు, మధ్య లోకమును, అధోలోకమును బొందుదురని చెప్పుటవలన ఆ గుణములు అభిలషణీయములు కావనియు స్పష్టమగుచున్నది. దీనినిబట్టి ఊర్ధ్వగతిగాని, అధోగతిగాని వారి వారి యధీనమునందే కలవని తేలుచున్నది. కాబట్టి ప్రయత్నపూర్వకముగ సత్త్వగుణసమాశ్రయముద్వారా ఊర్ధ్వగతినే పడయుటకు సర్వులును యత్నించవలెను.

ప్రశ్న:- సత్త్వగుణము కలవారు మరణానంతర మేలోకములకు పోవుదురు?
ఉత్తరము:- ఊర్ధ్వలోకములకు (లేక , ఊర్ధ్వగతికి)
ప్రశ్న:- రజోగుణము కలవారు?
ఉత్తరము:- మధ్యమమగు మనుష్యలోకములకు (లేక, మధ్యమగతికి).
ప్రశ్న:- తమోగుణము కలవారు?
ఉత్తరము:- అధోలోకములకు (లేక, అధోగతికి)

కామెంట్‌లు లేవు: