15, సెప్టెంబర్ 2020, మంగళవారం

' శంకర విజయము

*81 - కంచి మహాస్వామి వారి '* ' శంకర విజయము
🕉🌞🌎🌙🌟🚩

సనాతనుడు, పద్మపాదులు అనే సన్యాస నామంతో శంకరుల శిష్యునిగా వున్నారని, ఇంతకుముందు తెలుసుకున్నాము కదా ! 


పద్మపాదులు శంకరుల శారీరిక భాష్యం పై వివరణ పంచపాదిక అనే పేరుతో వ్రాసారు. దీని విశేషం ఏమిటో చూద్దాం.
 ఈ గ్రంధం వ్రాస్తూ, పద్మపాదులు, ఆగ్రంధంతో సహా, తీర్థయాత్రల క్రమంలో, రామేశ్వరానికి వెళుతూ, మార్గమధ్యలో జంబుకేశ్వరంలో ఆయన మేనమామ ఇంట్లో బసచేశారు. ఆ దశలో తాను వ్రాస్తున్న వివరణ పుస్తకాన్ని అక్కడ వుంచి, తిరుగు ప్రయాణంలో తీసుకు వెళదామని, రామేశ్వరం వెళ్లారు, పద్మపాదులు. 


అయితే, ఈలోపు ఆయన మేనమామ, పద్మపాదులు లేనప్పుడు ఆ పుస్తకాన్ని తిరగవేస్తూ, ఇది మీమాంసకుల సిద్ధాంతానికి చేటు తెచ్చేదిగావున్నదని భావించి, తాను మీమాంసకుడు అవడం వలన, ఆపుస్తకాన్ని, తన పాడుబడిన రెండవయింటిలో వుంచి, ఆ ఇంటికి నిప్పుపెట్టారు. 


పద్మపాదుడు తిరిగివచ్చాక చూసుకుంటే, ఆపుస్తకం కాలిపోయిన విషయం తెలిసింది. తాను ఇంతకుముందు సురేశ్వరాచార్యుని అద్వైతబుద్ధిని శంకించడం వలన, గురువులైన శంకరులు తనకు ఈ శిక్షవేశారని భావించి, శంకరులకు జరిగిన విషయం నివేదించారు పద్మపాదులు. 


దానికిశంకరులు, పద్మపాదులకు ధైర్యం చెబుతూ, ' నీవు నాకు ఇంతవరకూ, మొదటి అధ్యాయంలో ని నాలుగు భాగాలూ, రెండవ అధ్యాయం లోని మొదటిభాగాన్ని మాత్రమే వినిపించావు. నాకు అదంతా గుర్తువున్నది. నేను చెబుతూ వుంటాను. తిరిగి వ్రాసుకో ! దీనినే ప్రచారం చెయ్యి. ' అని చెప్పారు. అలాంటి ధారణశక్తి జగద్గురువులకు కాక ఎవరికి వుంటుంది. ఏకసంధాగ్రాహులంటే అలాంటి వారే కదా !


సూత్రభాష్యం యొక్క మొదటి అయిదుభాగాలకూ అది భాష్యం కనుక దీనికి పంచపాదుక అనే మాట స్థిరపడింది. బ్రహ్మసూత్రాలలో మొదటిఅధ్యయానికి చెందిన నాలుగు సూత్రాలకు వీరి వ్యాఖ్యానం మిగిలింది. పద్మపాదులను పీఠాధిపతిగా నియమించినట్లుగా కూడా తెలుస్తోంది. కొందరు ద్వారకామఠానికి అనీ, మరికొందరు పూరి మఠానికి అనీ, మార్కండేయ సంహితలో, ఆనందగిరీయంలో శృంగేరీమఠానికి అనీ పేర్కొనడం జరిగింది. 


శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో హస్తామలకుడు ఒకరు. వీరిని గురించి కూడా చెప్పుకుందాం. ఆయన మౌనజ్ఞాని. శంకరులు యాత్రలు చేస్తుండగా, పశ్చిమ తీరానికి చెందిన శ్రీబలిలో వీరిని శంకరులు చూసారు. ఈయనకు వయసు కు తగిన జ్ఞానము అబ్బలేదు. చెవిటి, మూగ బాలునిగా వుండేవారు. ఆయన తండ్రి ఆ పిల్లవాడిని శంకరులకు అప్పజెప్పి, అతడిని తీర్చిదిద్దమని వేడుకున్నాడు. తండ్రే స్వయంగా అతడ్ని ' జడుడు ' అని అన్నాడు. కానీ శంకరులకు ఆ పిల్లవానిలో జ్ఞాని కనిపించదు. 


బ్రహ్మజ్ఞానులు కూడా జడుల లాగానే వుంటారు. ఈయనను జ్ఞానిగా శంకరులు గుర్తించారు. 

🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: