7, డిసెంబర్ 2020, సోమవారం

అతి సర్వత్ర

 1. “అతి సర్వత్ర వర్జయేత్ “||


“ఎక్కడైనా అతి అంటే సంగతి-సందర్భాలని మించి ప్రవర్తింౘకూడదు” అని పెద్దల సలహా!


దీని మూలశ్లోకం:—


“అతిదానాత్ హతః కర్ణః

త్వతి లోభాత్ సుయోధనః |

అతికామాత్ దశగ్రీవః

త్వతి సర్వత్ర వర్జయేత్ ” ||


దానాలు అతిగాచేసి కర్ణుడు నాశనం ఐపోయేడు. పరద్రవ్యాన్నికూడా స్వంతం చేసేసుకోవాలనే అతి లోభ బుద్ధివల్ల సుయోధనుడు నశించేడు. అతిస్త్రీవ్యామోహం కారణంగా రావణుడు మరణించేడు. అందువల్ల అతిగావుండడం దేనిలోనూ పనికిరాదు”.


ఇదే అర్థంవచ్చే మరొక శ్లోకంకూడా ప్రచారంలోవుంది. అదీ ఇది:—


“అతిదానాత్ బలిః బద్ధః

హ్యతిమానాత్ సుయోధనః |

వినష్టో రావణో లౌల్యాత్ 

అతి సర్వత్ర వర్జయేత్ ” ||


“మితిమీరిన దానం వల్ల బలిచక్రవర్తి బంధింౘబడ్డాడు. మేరమీరిన స్వాభిమానం దుర్యోధనుణ్ణి నాశనంచేసింది. అదుపుతప్పిన (స్త్రీ)లోలత్వం రావణాసురుడిని రాలిపోయేలాగ

చేసింది. (అందువల్ల) అతి దేనిలోనైనా పనికిరాదు”.

కామెంట్‌లు లేవు: