10, మార్చి 2025, సోమవారం

తిరుమల సర్వస్వం -173*

 *తిరుమల సర్వస్వం -173*

*శ్రీ హాథీరామ్ బావాజీ 5*

2  ఈ వృత్తాంతాన్నంతా విన్న రాజభటులకు, ఆలయ అధికారులకు బావాజీ చెప్పినదంతా నమ్మశక్యంగా గోచరించలేదు. ఆ హారాన్ని స్వాధీనపరచుకొని, బాబాజీని అప్పటి చంద్రగిరి పాలకుడైన 'గిరిధర రాయలు' వద్ద హాజరు పరిచారు. రాజుగారికి కూడా బావాజీ అదే విషయాన్ని తిరిగి చెప్పాడు. ఇదంతా కట్టుకథగా భావించిన రాజుగారు బాబాజీని గృహనిర్బంధంలో ఉంచి, తదుపరి విచారణ జరుప వలసిందిగా ఆజ్ఞాపించాడు. 


 అయితే, బావాజీ అదే విషయాన్ని పదే పదే నొక్కి చెప్పడంతో తన నిర్దోషిత్వాన్ని నిరూపించు కోవడానికి రాజుగారు ఒక అవకాశం ఇచ్చారు. బావాజీకి స్వామివారితో అంతటి చనువు ఉన్నట్లైతే, తన మహిమను ప్రత్యక్షంగా చూపించాలి. బాబాజీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసం రాజుగారు ఒక పరీక్ష పెట్టారు. దాని ప్రకారం, రాజుగారి ఆజ్ఞ మేరకు బాబాజీని స్వగృహం లో నిర్బంధించి, అందులోనే బండెడు చెరకుగడలను ఉంచారు. మరునాటి ఉదయం లోపు ఆ చెరుకుగడ లన్నింటినీ బాబాజీ తినగలిగితే, వారు చెప్పేది యధార్థమైనట్లు లెక్క! లేకుంటే బాబాజీ తన నేరాన్ని అంగీకరించి, రాజుగారు విధించే శిక్షను అనుభవించాలి. ఆ శిక్ష అత్యంత కఠినంగా ఉండొచ్చు. ఆరోపణ 'దైవద్రోహానికి' సంబంధించినదవ్వడం వల్ల, మరణశిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఆ విధమైన షరతు విధించి, ఆశ్రమం తలుపులను మూసివేసి, కొద్దిమంది భటులతో కట్టుదిట్టమైన కాపలా ఉంచి, మిగిలిన వారందరూ నిష్క్రమించారు.


 *గండం గట్టెక్కించిన గజరాజు* 


 బావాజీకి ఏం చేయాలో పాలుపోలేదు. చెయ్యని నేరానికి తనకెందుకీ శిక్ష? ఎందుకీ అగ్నిపరీక్ష ? ఒక్క రాత్రిలో ఆ చెరకుగడల రాశిని భుజించటం మానవమాత్రుడికి సాధ్యమయ్యే పని కాదు. ఆ పని చేయాలంటే కేవలం ఏనుగు వల్లనే సాధ్యం!


 ఆ విధంగా ఆలోచించిన బావాజీ, భగవంతునిపై భారం వేసి, స్వామివారిని స్మరించుకుంటూ నిశ్చింతగా ఆ రాత్రి గడపసాగాడు. ఆ స్వామివారే తనను ఎలాగైనా రక్షించుకుంటారని అతని ప్రగాఢ విశ్వాసం. కొద్దిసేపట్లో, బావాజీ భగవన్నామస్మరణలో ఉండగా ఓ మహాద్భుతం జరిగింది. నిశిరాత్రివేళలో శ్వేతవర్ణంలో ఉన్న, ఐరావతం వంటి మత్తగజం, శరీరమంతా చందన లేపనంతో, నుదుటన తిరునామాలు ధరించి, తలుపులు మూసి ఉన్న గృహంలో ప్రత్యక్షమైంది. బావాజీ ఉద్విగ్నుడై చూస్తూ ఉండగా ఆ మత్తగజం గృహం లోని చెరుకుగడలన్నింటిని తన తొండంతో తీసుకొని, తృప్తిగా ఆరగించి, సారం లేని చెరకు పిప్పిని గుట్టగా పోసింది.


 *రాజుగారి పశ్చాత్తాపం* 


 మదపుటేనుగు ఘీంకారానికి మెలకువ వచ్చిన రాజభటులు ఏనుగు చెరకుగడలను భుజించటం చూసి విస్తుపోయారు. మూసిన గృహద్వారాలు మూసినట్లే ఉండటంతో, నమ్మశక్యం కాని ఈ వింతను రాజు గారికి వివరించారు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా ఈ కథనాన్ని వినడంతో జ్ఞానోదయమైన రాజుగారు బాబాజీ చెప్పిన శ్రీవారి పాచికలాట ఉదంతాన్ని విశ్వసించి, అతణ్ణి శ్రీవారి పరమభక్తుడిగా గుర్తించి, బావాజీకి అనుచరుడిగా మారిపోయాడు. అంతటితో, 'గిరిధర రాయలు', 'గిరిధర దాసు' గా మారి, బావాజీకి ప్రథమ శిష్యుడయ్యాడు. బావాజీ ఆశ్రమానికి లెక్కలేనన్ని కానుకలనిచ్చి తన భక్తిని చాటుకున్నాడు. అప్పటి నుండి ఆశారామ్ బలౌత్ 'హాథీరా బాబా' గా వినుతికెక్కారు.


 'హాథీ' అనగా ఏనుగు. ఆయన రామభక్తికి గుర్తుగా 'రాం' అనే పదం, ఉత్తరభారతదేశం లో సాధుపురుషులను సంబోధించే 'బాబా' లేదా 'బావా' అనే పదం వెరసి 'హాథీరామ్ బాబాజీ' గా అవతరించారు.


 ఈ ఉదంతంతో బావాజీ భక్తిప్రపత్తులు లోకప్రసిద్ధమై, వారిని దర్శించుకోవడానికి భక్తులు ఎగబడేవారు. ఉత్తరాది నుండి కూడా భక్తులు వెల్లువెత్తడం మొదలైంది. శ్రీవారి దర్శనానంతరం తప్పనిసరిగా బావాజీ ఆశ్రమానికి వచ్చి, వారిని కూడా భక్తిశ్రద్ధలతో నమస్కరించుకుని, కానుకలు సమర్పించుకునే వారు. అలా భక్తుల విరాళాలతో, రాజుగారి ప్రాపకంతో బాబాజీ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపట్టేవారు. దేవాలయానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం అనేక దానధర్మాలు నిర్వహించేవారు. బ్రహ్మోత్సవాల వంటి సందర్భాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు గావించేవారు. ఆ విధంగా భక్తుల విరాళాలతో, రాజుగారి అండదండలతో; అనతికాలంలోనే బాబాజీ నివాసముంటున్న చిన్న ఆశ్రమం ఈనాడు మనం చూస్తున్న పెద్దమఠం గా రూపు దిద్దుకుంది. ఎందరెందరో భక్తులు గృహస్తాశ్రమాన్ని త్యజించి, బావాజీ అనుచరులుగా, శిష్యులుగా మారారు. వారికి ప్రతిరాత్రి, బావాజి ఎవరితోనో సంభాషిస్తున్నట్లు, పాచికలు వేసిన సవ్వడి వినిపించేవి.


 తరువాతి కాలంలో బాబాజీ, తదనంతరం వారి అనుచరులు 'మహంతుమఠం' పేరిట ఒక ధార్మికసంస్థను ఏర్పరచి, దాని ద్వారా ఆలయాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. ఈ ఆశ్రమంలో నిరాశ్రయులకు, సాధువులు సన్యాసులకు, బైరాగులకు నిత్యాన్నదానం జరిగేది. 'మహంతు' అనే ఉత్తరభారత పదానికి 'సాధువు' లేదా 'సన్యాసి' అని అర్థం. కొందరి కథనం ప్రకారం, బావాజీ వల్లనే శ్రీవేంకటేశ్వరునికి 'బాలాజీ' అనే నామాంతరం వచ్చింది. అయితే, ఈ విషయం ధృవీకరించటానికి బలమైన ఆధారాలు లేవు. దేవాలయంలో పలు ఉత్తరభారత దేశ సాంప్రదాయాలకు మహంతుల కాలం లోనే శ్రీకారం చుట్టబడింది.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: