10, మార్చి 2025, సోమవారం

*ప్రియ బాంధవా మేలుకో 5*

 *ప్రియ బాంధవా మేలుకో 5*




గత వ్యాసాలలో నల్ల బజారు బడా బాబుల మరియు *ద్రవ్యోల్బణం* గురించి వివరాలు తెలుసుకున్నాము. దేశం ఎలా ఉంటే మాకేంటి *మేము, మా  పిల్లలు బాగున్నారు కదా యని సమాజంలో అధిక శాతం ప్రజలనుకుంటూ ఉంటారు,* అనుకుంటూనే ఉన్నారు కూడా.


నల్ల బజారు వ్యవహారాలు మరియు ద్రవ్యోల్బణము వలన దేశ ఆర్థిక వ్యవస్థ, సంబంధిత అంశాలన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. సదరు పరిస్థితులను సమతుల్యం చేయడానికి పాలకులు/ప్రభుత్వం  ఆదాయం పెంచడం కోసం పన్నులు పెంచాల్సి ఉంటుంది. *సదరు పన్నుల వలన ప్రజలపై మరింత భారం పడుతుంది*. 


మన దేశంలో స్థానిక, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పన్నులు ఇంకా మరెన్నో పన్నులు.

సౌలభ్యం కోసం పన్నులను రెండు రకాలుగా విభజిద్దాము....ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు. మరింత విపులంగా పన్నుల వివరాలలోకి వెళ్లు అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు అప్రస్తుతము. భారత దేశానికి స్వపరిపాలన వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత గూడా ప్రస్తుతమున్న అసంగతాల గురించి ప్రస్తావించుకుంటున్నాము. 


పన్నుల దుర్దశ లేని దేశాలు ఉండవు కదా ఇది మామూలే అని అనుకోవడానికి వీలులేదు. ప్రపంచంలో కొన్ని దేశాలలో, కొన్ని ప్రదేశాలలో ప్రజలపై పన్నుపోటు ముఖ్యంగా ఆదాయపు పన్ను పోటు ఉండదు, అయినా ఆ ప్రాంత  అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి లోటు ఉండదు. పన్నులు లేకున్నా ఖజానా పై వత్తిడి ఉండదు. అన్ని వర్గాల ప్రజలకు సామాజిక భద్రత ఉంటుంది. సామాజిక అవసరాల రూపకల్పనకు, నిర్వహణకు పన్నులు అవసరమే. పన్నులలో ముఖ్యంగా ఆదాయము పై పన్నును కష్టంగా భావిస్తారు ప్రజలు. *పలు రకాల పన్నులు ఎలాగు చెల్లిస్తున్నాము, మళ్ళీ ఆదాయంపై పన్నులా అని ప్రజలు విసుక్కునే అవకాశము ఎక్కువ*. 


ఆదాయపు పన్ను లేని దేశాలలో ముఖ్యంగా గల్ఫ్ దేశాల పేర్లు చెప్పుకోవాలి.... సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్, ఎమిరేట్స్, కువైట్, ఖతర్, ఒమన్, బహైన్ మరియు ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని కేయన్ ఐలాండ్స్, బెర్ముడా, బహమాస్, అంగ్విలా, సెయింట్ కిట్స్, నివిస్ బ్రిటిష్ ఈలాంటి దేశాలు , ప్రదేశాలు ఎన్నెన్నో. ఉత్తర కొరియా దేశం 1974 లోనే అన్ని పన్నులు రద్దు చేసింది. 


ప్రపంచం చుట్టి రావడమెందుకంటే, అన్ని దేశాలలో ప్రజలు కూడా మన దేశంలోని అధిక శాతం జనాభాలాగే నిస్సత్తువగా, నిరస్త్రాణగా, దేశ కాల పరిస్థితులపై అవగాహన మరియు శ్రద్ధ చూపెట్టకుండా, తాము మాత్రమే బాగుంటే చాలు అని అనుకోరు, *అని తెలుసుకోవడానికి*. 


శ్రద్ధగా *నిరంతరం ప్రజలు తమ బాగోగులతో పాటు  దేశ, కాల పరిస్థితులను మరియు ప్రభుత్వ పాలనా సామర్థ్యాన్ని,  సాంఘికాభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను, చర్యలను, దేశ భద్రతను గమనిస్తూ ఉండాలని, ప్రజలు చైతన్య దృష్టి అలవర్చుకోవాలని*, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే అక్రమాల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయాలి, అక్రమాలని నిరోధించాలని ఈ వ్యాస పరంపర అభిమతము.


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: