10, మార్చి 2025, సోమవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము*


*312 వ రోజు*


*తృతీయాశ్వాసం*


సైంధవుని చంపడానికి శ్రీకృష్ణుడు మార్గం చూపాడు అని విన్న ధృతరాష్ట్రుడు ఉలిక్కిపడ్డాడు. సంజయా ! సైంధవుని పాండవులు నిర్జించారా ! లేక ద్రోణుడు సైంధవుని రక్షించాడా నాకు వివరంగా చెప్పు. సంజయుడు " ధృతరాష్ట్ర మహారాజా ! మరునాడు ధర్మరాజు వంధిమాగధుల స్తోత్రపాఠాలతో నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని పూజాధికములు ముగించి దానధర్మములు చేసి ఆ స్థాన మండపముకు వచ్చాడు. అప్పుడు అక్కడకు వచ్చిన శ్రీకృష్ణుని ధర్మరాజు సాదరంగా ఆహ్వానించి ఉచితాసనం చూపించాడు. భీముడు, నకులసహదేవులు, సాత్యకి, ద్రౌపదేయులు, ఘటోత్కచుడు, ద్రుపదుడు, విరాటుడు, కేకయరాజులు మొదలైన వారు వారి ఆసనములు అలంకరించారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునితో " కృష్ణా ! ఇప్పటి వరకు మాకు అన్ని విధాల నీ సహాయ సహకారాలు అందించావు. ఇప్పుడు ఈ ఆపదనుండి మమ్ము నీవే కాపాడాలి " అన్నాడు. శ్రీకృష్ణుడు " ధర్మజా ! ఈ రోజు అర్జునుడు రణరంగమున వీరవిహారం చేసి సైంధవుని వధించుట తధ్యం " అని పలికాడు. ఇంతలో అక్కడకు వచ్చిన అర్జునుడు ముందు రోజు రాత్రి తాను కన్న కలను గురించి సభాసదులకు వివరించాడు. అది విన్న సభికులు విశ్మయమందారు. తరువాత అందరూ యుద్ధసన్నాహాలు చేసారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, సాత్యకి అందరూ కలిసి అర్జునుడి శిబిరానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు రధము ఎక్కి సారధిగా కూర్చున్నాడు. అర్జునుడు రధము ఎక్కి సాత్యకిని చూసి " సాత్యకీ ! మనకు మంచి శకునములు కనపడుతున్నాయి. ఈ రోజు నేను సైంధవుని వధించి నా శపథం నెరవేర్చుకుంటాను. సైంధవవధ ఎంత ముఖ్యమో ధర్మరాజు రక్షణా అంత ముఖ్యమే. ద్రోణాచార్యుని ప్రతిజ్ఞ గురించి మనం ఆలోచించాలి. కనుక నీవు ధర్మరాజు రక్షణ బాధ్యత వహించాలి " అన్నాడు. అర్జునుడి మాట మేర సాత్యకి ధర్మరాజు రక్షణకు వెళ్ళాడు. అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కుమారుని మరణం కలిగించిన శోకము కోపమూ కలగలసి మృత్యుదేవతగా వచ్చిన అర్జునుడిని కౌరవులు ఎలా ఎదుర్కొన్నారు. సైంధవుని ఇంట్లో ఆర్తనాదాలు వినపడుతున్నాయి. సంజయా ! నేను, భీష్ముడు, ద్రోణుడు చెప్పిన మాటలు వినక కర్ణుడు, శకుని, దుశ్శాసనుని మాటలు విన్నాడు. సంధి చెడగొట్టాడు తన వాళ్ళందరిని చంపుకుంటున్నాడు. శివుని ఓడించిన అర్జునుడితో వైరం పెట్టుకుంటున్నాడు. శ్రీకృష్ణుని చెలికానితో వైరం వద్దని చెప్పిన రాజ్యం మీద లోభంతో నా మాట వినలేదు. నేను చెయ్యగలిగినది ఏమి ? " అని వగచాడు. సంజయుడు " మహారాజా ! గతజల సేతుబంధన మేలనయ్యా ! మాయా జూదం నాడే నీవు అడ్డుకోవలసింది. సంధి ప్రయత్నంతో వచ్చిన శ్రీకృష్ణుడి మాటను ఆదరించి ఉండ వలసినది. నీ తమ్ముడు పాండురాజు రాజ్యపాలన చేసి విస్తరించిన రాజ్యంలో భాగాన్ని అతడి కుమారులకు ఇవ్వడానికి నీకు అభ్యంతరం ఎందుకు ? నీవు చేసిన పనికి నీ కుమారుని నిందించుట తగునా ! లోకులు నిన్ను లుబ్ధుడు, అధర్మపరుడు అనక ఏమి చేస్తారు. నీ దుర్నీతికి తగిన ఫలితం అనుభవిస్తున్నావు . ఇందుకు కౌరవులేమి చేస్తారు. గాండీవ ఘోష, పాంచజన్య తీవ్ర ధ్వని, కపిధ్వజ రెపరెపలు సహించుటకు దేవతలకు కూడా శక్యము కాదు. ఇక నీ కుమారులు ఎంత!


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: