17-02-గీతా మకరందము.
శ్రద్ధాత్రయ విభాగ యోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - అర్జునుని యా ప్రశ్నకు భగవానుడు సమాధాన మొసంగుచున్నారు-
శ్రీ భగవానువాచ -
త్రివిధా భవతి శ్రద్ధా
దేహినాం సా స్వభావజా |
సాత్త్వికీ రాజసీ చైవ
తామసీ చేతి తాం శృణు ||
తాత్పర్యము:- శ్రీ భగవంతుడు చెప్పెను - ప్రాణులయొక్క స్వభావముచే (పూర్వజన్మ సంస్కారముచే) గలిగిన
ఆ శ్రద్ధ సాత్త్వికమనియు, రాజసమనియు, తామసమనియు మూడు విధములుగా నగుచున్నది. దానిని గూర్చి వినుము.
వ్యాఖ్య:- "సా స్వభావజా" - అని చెప్పుటవలన పూర్వజన్మ సంస్కారమువలన, జన్మాంతర వాసనా ప్రాబల్యమువలన అట్టిశ్రద్ధ వారియందు స్వభావముగనే జనించునని భావము.
ప్రశ్న:- శ్రద్ధ యెన్ని విధములు? అవి యేవి?
ఉత్తరము: - మూడువిధములు - అవి క్రమముగ (1) సాత్త్వికశ్రద్ధ (2) రాజసిక శ్రద్ధ (3) తామసిక శ్రద్ధ అని చెప్పబడును.
ప్రశ్న:- అట్టి శ్రద్ధ జీవులకెట్లు జనించును?
ఉత్తరము:- స్వభావముగనే. అనగా జన్మాంతరసంస్కారప్రాబల్యమువలన, లేక ఇహజన్మప్రయత్నాతిశయమున సహజముగనే అది జనించునని భావము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి