*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*
*357 వ రోజు*
*అశ్వత్థామకు తండ్రి మరణం ఎరిగించుట*
కౌరవ సైన్యము సైన్యాధ్యక్షుడి మరణంతో కలత చెంది ఉన్న తరుణంలో పాండవసేన విజృంభించి కౌరవసేనలను ఎదుర్కొని తరిమింది. పాండవ సేనల ధాటికి ఆగలేని కౌరవ సేనలు పారిపోసాగాయి. నీ కుమారులు వారిని వెంబడించారు. కృతవర్మ, కృపాచార్యుడు, కర్ణుడు, శకుని మొదలైన వారంతా వెనుతిరిగి చూస్తూ పోతూ పోతూ వారు " ఎంత ఘోరం జరిగింది. ఏమి చేయాలో తోచక ఉంది. ఈ నరమేధం ఇక ఆగదా " అనుకున్నారు. వేరొక చోట యుద్ధము చేస్తున్న అశ్వత్థామ కౌరవ యోధులు వెనుదిరుగుతూ తిరోగమించడం చూసి సుయోధనుడిని సమీపించి " సుయోధనా ! మన సైన్యాలకు ఏమైంది ఇలా వెనుకకు చూసుకుంటూ పరుగెడుతున్నారు? కృపాచార్యుడు, కర్ణుడు ఎందుకింత మ్లానవదనులై ఉన్నారు " అని అడిగాడు. సుయోధనుడు బదులు పలుక లేక పోయాడు. దుఃఖంతో మాట రాక అశ్వత్థామకు తండ్రి మరణం గురించి ఎలా చెప్పాలి అనుకుంటున్నాడు.
*కృపాచార్యుడు అశ్వత్థామకు తండ్రి మరణ వార్త ఎరిగించుట*
కృపాచార్యుడు అశ్వత్థామకు తండ్రి మరణ వార్తను ఇలా చెప్పాడు. " కుమారా ! నీ తండ్రి పాంచాలసేనలో చాలా పెద్ద మొత్తాన్ని చంపుతున్నాడు. పాండవులు ఎలాగైనా నీ తండ్రిని చంపాలనుకున్నారు. భీముడు నీ తండ్రి వద్దకు పోయి అశ్వత్థామ మరణించాడు అని అబద్ధం చెప్పాడు. నీ తండ్రి అతడి మాట నమ్మక యుద్ధం చేస్తూనే ఉన్నా సందేహం తీర్చుకోవడానికి ధర్మజుడు అబద్ధం చెప్పడని నమ్మకంతో అతడిని నిజం చెప్పమని అడిగాడు. అంతకు ముందే భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపడం వలన ధర్మరాజు కూడా అశ్వత్థామ చనిపోయునట్లు చెప్పాడు. ఆ మాట వినగానే నీ తండ్రి అస్త్రసన్యాసం చేసి యోగసమాధిలోకి వెళ్ళాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు నీ తండ్రి రధము మీదకు దూకి నీ తండ్రి తల తెగనరికాడు. అర్జునుడు ధర్మరాజు వద్దని అది ధర్మము కాదని ఎంత అరచినా వినలేదు. నీ తండ్రి మరణించగానే మాకు కాళ్ళు చేతులు ఆడలేదు. మనసైన్యాలు భయపడి పారిపోతున్నాయి. కాని నాకు ఇదంతా కృష్ణుడు ఆడించిన నాటకం అనిపిస్తుంది. లేకున్న భీముడికి ఇన్ని తెలివితేటలు లేవు. ధర్మరాజు ఇంతటి అధర్మానికి ఒడిగట్టడు " అన్నాడు.
*తండ్రి మరణానికి అశ్వత్థామ ప్రతి స్పందన*
కృపాచార్యుడు చెప్పినది ప్రశాంత చిత్తతంతో విన్న అశ్వత్థామ " మామా ! కృపాచార్యా ! జాతస్య మరణం ధృవం. పుట్టిన వానికి మరణం తప్పదు. పైగా యుద్ధం చేస్తుంటే మరణం వెన్నంటి ఉంటుంది. కాని లోకారాధ్యుడైన నా తండ్రిని నీరాయుధుడై యోగసమాధిలో ఉన్న సమయాన జుట్టు పట్టుకుని మెడ నరకడమే బాధాకరంగా అవమానకరంగా ఉంది. సుయోధనా నాకు నా తండ్రి ప్రసాదించిన దివ్యాస్త్రాలు, నా అస్త్ర విద్య నాతండ్రిని కాపాడు కోవడానికి పనికి రాలేదు. నా గురువు, నా దైవం , నా పితృదేవుడు అలా దిక్కు మాలిన చావు చస్తుంటే ఆపలేక పోయాను. సుయోధనా ! దీనికి కారణం ధర్మరాజు పేరుకు ధర్మరాజు చెప్పినది అసత్యం. అతడిని అంతమొందించిన కాని నా మనస్సు శాంతించదు. సుయోధనా నా తండ్రి కుమారుని కన్నది అవసానదశలో ఇలా అవమానం పొందడానికా ! ఇదిగో ఇదే నా ప్రతిజ్బ. దేవతలు అడ్డుపడినా సరే ఆ కృష్ణుడే అడ్డుపడినా నేను పాండవులను సంహరిస్తాను " అన్నాడు. సుయోధనా ! నా పరాక్రమం నేను చెప్పుకో కూడదు. నా తండ్రికి జరిగిన అవమానం తట్టుకోలేక ఇలా అన్నాను. ఇప్పుడు కాకున్న ఎప్పుడైనా ఎలాగైనా నేను పాండవులను వధించి తీరతాను " అన్నాడు. తిరిగి అశ్వత్థామ " సుయోధనా ! నా తండ్రి శ్రీమన్నారాయణుడిని ఆరాధించి నారాయణాస్త్రం పొందాడు. దానిని నా తండ్రి నాకు ప్రసాదించాడు. ఆ అస్త్రం వారు వీరు అన్న తేడా లేకుండా అందరిని హతమార్చి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. నేను ఇప్పుడు నారాయణాస్త్రం ప్రయోగించి శత్రువులను గెలుస్తాను " అన్నాడు. అది విన్న సుయోధనుడు ఆనంద పడి తన వారినందరిని సమాయత్త పరచి శంఖం పూరించాడు. అది చూసి ధర్మరాజాదులు యుద్ధానికి సమాయత్తమయ్యారు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి