25, ఏప్రిల్ 2025, శుక్రవారం

మేఘసందేశం కాళిదాసు 🙏 రెండవ భాగము

 🙏మేఘసందేశం కాళిదాసు 🙏

                       రెండవ భాగము 

నాయకులు నాలుగు రకాలు. వారినే చతుర్విధ నాయకులు అంటారు. ధీరోదాత్తుడు (వీరత్వం అధికంగా ఉండి ఆవేశం లేకుండా ఆలోచన కలవాడు ఉదా: శ్రీ రాముడు), ధీరోద్ధతుడు (వీరత్వం ఎక్కువగా ఉండి ఆలోచన ఏ మాత్రం లేనివాడు ఉదా: భీముడు), ధీర లలితుడు (వీరత్వం, లాలిత్యం సమపాళ్ళలో కలిసిన ప్రేమ స్వరూపుడు ఉదా: శ్రీ కృష్ణుడు), ధీర శాంతుడు (శాంతాన్ని అధికంగా కలిగిన వీరుడు ఉదా: గౌతమ బుద్ధుడు). కాళిదాసు తన రచనలలో నాయకుడిని ఎప్పుడూ ధీరోదాత్తునిగానే మలుచుకుంటాడు. శాకుంతలంలో అదే జరిగి అభిజ్ఞానశాకుంతలం అయ్యింది కదా! ఈ మేఘ సందేశంలో కూడా నాయకుడైన యక్షుని ధీరోదాత్తునిగానే చూపాడు (పూర్వ మేఘం, మూడవ శ్లోకంలో).


శృంగార నాయికలు ఎనిమిది రకాలు. వారినే అష్టవిధ శృంగార నాయికలు అంటారు. వారిలో నలుగురిని ఎన్నుకుని, ఒక్కొక్కరిగా ఈ కావ్యంలో పూర్వమేఘంలో పరిచయం చేశాడు కాళిదాసు. 


త్వా మారూఢం పవనపదవీ ముద్గృహీతాలకాన్తాః

ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయాదాశ్వ సన్త్యః ।

కః సన్నద్ధే విరహవిధురా త్వయ్యుపేక్షేత జాయాం

న స్యాదన్యోఽప్యహమివ జనోయః పరాధీనవృత్తిః ॥


అంటూ ముందుగా పథికవనితాః అనగా ప్రోషిత భర్తృక గురించి చెప్పాడు. భర్త దూరంగా (పని మీద ఎక్కడికైనా వెళ్ళినా, దేశాంతరం వెళ్ళినా) ఉన్నప్పుడు తన గురించి ఆలోచిస్తూ విరహంతో ఉండే స్త్రీని ప్రోషిత భర్తృక అంటారు. మేఘుడు కామ ప్రకోపన చేసేవాడు. అసలే విరహంతో ఉండే స్త్రీలు నీ (మేఘుని) రాకతో, తమ భర్తతో కలవాలన్న కోరిక పెరిగి, భర్త కూడా అదే కాంక్షతో వస్తాడు అన్న ఆశతో తమ ఫాల భాగం మీద పడుతున్న ముంగురులను పైకి ఎత్తి నిన్ను చూస్తారు. అటువంటి స్త్రీని విడిచి అశక్తుడు, అస్వతంత్రుడు, పరాధీనుడు అయిన మగవాడు తప్ప మరెవ్వరూ ఉండలేరు అంటాడు. ప్రస్తుతం యక్షుని పరిస్థితి అదే కనుక ఆమెకు దూరంగా ఉన్నందుకు చింతిస్తూ మేఘుని వెళ్ళి తన క్షేమ సమాచారం తెలియ చేయమంటాడు. దీనికి సమర్ధింపుగా ఉత్తర మేఘంలో 21, 22, 23, 24, 25 శ్లోకాలలో యక్షుని భార్యలో ఉన్న ప్రోషిత భర్తృక లక్షణాలన్నీ విశదీకరిస్తాడు. కాళిదాసుకి ఈ ప్రోషిత భర్తృక అంటే ప్రత్యేక అభిమానం అనిపిస్తుంది. అభిజ్ఞాన శాకుంతలంలో కూడా శకుంతలని ప్రోషిత భర్తృక (దూర్వాస మహాముని శాపానికి కారణమయినప్పుడు) గానే చూపిస్తాడు.  


గచ్ఛన్తీనాం రమణవసతిం యోషితాం తత్రనక్తం

రుద్ధాలోకే నరపతి పథే సూచి భేద్యై, స్తమోభిః ।

సౌదామన్యా, కనక నికషస్నిగ్ధయా దర్శయోర్వీం

తోయోత్సర్గస్తనితముఖరో మాస్మభూర్విక్లవాస్తాః ॥


అంటూ రమణవసతిం గచ్ఛన్తీనాం అనగా అభిసారిక గురించి చెప్పాడు. అందంగా అలంకరించుకుని, ప్రియుని వద్దకు తాను వెళ్ళే స్త్రీని అభిసారిక అంటారు. ఉజ్జయనిలోని స్త్రీలను వర్ణిస్తూ చెప్పిన ఈ శ్లోకంలో అక్కడి అభిసారికలు (స్త్రీలు) రాత్రిపూట ప్రియుని ఆవాసానికి బయలుదేరతారు కనుక ఆ సమయంలో నువ్వు (మేఘుడు) మెఱుపులతో దారి చూపు కానీ ఉరుముతూ వాన పడి వారిని భయపెట్టకు. వారసలే మిక్కిలి భయస్తులు అని మేఘుడిని హెచ్చరిస్తూ స్త్రీలతో సున్నితత్వం వహించాలని చెప్తాడు. పూర్వ మేఘంలో ఉజ్జయినిలోని (కాళిదాసు నివాస స్థలం) అభిసారికలు ప్రియుని వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారో చెప్పిన కాళిదాసు ఉత్తర మేఘంలో (తొమ్మిదవ శ్లోకంలో) అలకాపురిలోని (యక్షుని నివాస స్థలం) అభిసారికలు తమ ప్రియుని వద్ద నుండీ వచ్చేటప్పుడు ఎలా ఉంటారో వివరిస్తాడు. దీని ద్వారా కాళిదాసు పురుషుల ఏక పత్నీత్వం, స్త్రీల పాతివ్రత్యం ఇష్టాధీనమే కానీ కృత్రిమం కాదు అని చెప్తున్నాడనిపిస్తుంది. మన నాయకుడయిన యక్షుడు ఏకపత్నీ వ్రతుడు, ముందుగా చెప్పుకున్నట్టు ధీరోదాత్తుడు కాకపోతే తన భార్యకి మేఘుడిని బ్రతిమాలుకుని మరీ సందేశం పంపవలసిన అవసరం లేదు కదా! అలా మన నాయకుని ధీరోదాత్త లక్షణం మళ్ళీ చూపాడు.


తస్మిన్కాలే నయన సలిలం యోషితాం ఖణ్డితానాం

శాన్తిం నేయం ప్రణయిభిరతో వర్త్మభానోస్త్య జాశు ।

ప్రాలేయాస్రం కమలవదనాత్సోఽపి హర్తుం నలిన్యాః

ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్ఫాభ్యసూయః 


అంటూ ఖణ్డితానాం అనగా ఖండిత నాయిక గురించి చెప్పాడు. రాత్రంతా పర స్త్రీతో గడిపి, తెల్లవారిన తరువాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన భర్తని చూచి దుఃఖించే స్త్రీని ఖండిత అంటారు. ఆ సమయంలో అనగా సూర్యోదయ సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన భర్తలు తమ భార్యల కన్నీరు తుడుస్తారు. ఈ శ్లోకంలో పద్మం అనే ఖండిత స్త్రీ ముఖము నుండీ కారే మంచు అనే కన్నీటిని తొలగించే భర్త (లేదా ప్రియుడు) సూర్యుడు అని వర్ణించాడు. అటువంటి సూర్యునికి నువ్వు (మేఘుడు) అడ్డు రాకుండా, తన కిరణాలు అనే చేతులతో మంచు అనే కన్నీటిని తుడవనివ్వు, ప్రేయసీ ప్రియుల మధ్యలో నువ్వెందుకు? అడ్డు తొలగు అంటూ హితోపదేశం చేస్తున్నాడు.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: