25, ఏప్రిల్ 2025, శుక్రవారం

తిరుమల సర్వస్వం 219-*

 *తిరుమల సర్వస్వం 219-*



 *సామాజిక సేవా కార్యక్రమాలు-1*


 తిరుమల-తిరుపతి దేవస్థానం వారు దేశవ్యాప్తంగా అనేక సామాజిక సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. వాటన్నింటి కార్యకలాపాలు దాదాపు తిరుపతి కేంద్రంగా కొనసాగుతున్నాయి. వీటిలో చాలావరకు వైద్య, విద్యా రంగాలకు చెందినవే.


 ఈ సేవలన్నీ అణగారిన వర్గాల వారికి ఉచితంగానే అందజేయబడతాయి. మిగిలిన వారికి మాత్రం నామమాత్రపు రుసుము వసూలు చేయబడుతుంది.


 తి.తి.దే ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్ని సామాజిక సేవా పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


 *శ్రీ బాలాజీ దివ్యాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస ట్రస్టు (BIRRD)* 


 దీని ద్వారా పోలియో మెల్లిటస్, సెరిబ్రల్ పాల్సీ, కంజెనిటల్ ఎనామలీస్, వెన్నెముక గాయాలు వంటి వ్యాధులకు, అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తారు.


 *శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం (SVIMS)* 


 ఈ పథకం కింద 2007వ సంవత్సరంలో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించబడింది. దీన్ని *'శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ'* గా పిలుస్తారు. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తరహాలో దీనిని అభివృద్ధి పరిచే ఉద్దేశ్యంతో ప్రణాళికలు రచించారు. ఈ సంస్థ ప్రాంగణం నుంచి శ్రీ పద్మావతి మహిళా కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ విభాగం కూడా నడుపబడుతున్నాయి. ఇందులో కూడా పూర్తి ఉచితంగా, లేదా నామమాత్రపు రుసుముతో అత్యాధునిక వైద్యసేవలను అందిస్తారు.


 *శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్* 


 2010వ సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ ట్రస్టు ద్వారా నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి పూర్తి ఉచిత వైద్యసహాయంతో పాటుగా, కావలసిన వైద్యపరికరాలను కూడా ఉచితంగా ఇస్తారు.


 *శ్రీవేంకటేశ్వరా ప్రాణదానం ట్రస్ట్* 


 దీని ద్వారా నిరుపేద వర్గాలకు చెందిన వారికి గుండె, మూత్రపిండాలు, కాలేయం, మెదడు సంబంధిత ప్రాణాంతక వ్యాధులకై ఉచితంగా చికిత్స చేస్తారు.


‌ *ఇతర వైద్య సేవలు* 


 తిరుమల యాత్రికులకు అత్యవసర వైద్య సేవలందించే నిమిత్తం అన్ని హంగులతో కూడుకున్న మరికొన్ని వైద్యశాలలను కూడా తి.తి.దే. నడుపుతోంది. వినికిడి సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు చేయూత నివ్వడం కోసం *'శ్రవణం'* అనే ప్రాజెక్టును తి.తి.దే. చేపట్టింది. కుష్టువ్యాధి గ్రస్తులకు వైద్యసహాయం అందించడానికి, *'శ్రీవేంకటేశ్వర పేదల గృహం'* అనే పేరుతో, ఒక ఆసుపత్రితో కూడుకున్న పునరావాస కేంద్రాన్ని కూడా నడుపుతోంది. అలాగే కొండ పైన, భక్తులకు అత్యవసర వైద్యసేవలు అందించడం కోసం *'అశ్విని'* అనే వైద్యశాలను నిర్వహిస్తోంది.


 ఇవన్నీ ఒక ఎత్తైతే, కరోనా కష్టకాలంలో తి.తి.దే. అందిస్తున్న వైద్యసేవలు చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇప్పుడు తి.తి.దే. చేపడుతున్న మరికొన్ని సేవలను పరికిద్దాం.


 *శ్రీవేంకటేశ్వర ట్రైనింగ్ సెంటర్ ఫర్ హాండికాప్డ్*


 ఈ కేంద్రం ద్వారా దివ్యాంగులకు, దృష్టిలోపం ఉన్నవారికి, బధిరులకు వృత్తివిద్యలలో శిక్షణనిచ్చి, వారికి ఉపాధి కల్పించబడుతుంది.


 *శ్రీవేంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం మరియు పరిశోధనా కేంద్రం* 


 1993వ సంవత్సరం లో స్థాపించబడిన ఈ కేంద్రంలో, లక్షకు పైగా పురాతన గ్రంథాలు, వ్రాతప్రతులు, తాళపత్రాలు, శిలాశాసనాలు భద్రపరిచారు. యుజిసీ ఈ పరిశోధనా కేంద్రానికి చరిత్రలో డాక్టరేట్ చేస్తున్న విద్యార్థులకు పరిశోధనా కేంద్రంగా గుర్తింపునిచ్చింది. ఈ కేంద్రంలో ఉన్న పత్రాలన్నింటినీ డిజిటలీకరించే ప్రక్రియ చేపట్టబడింది.


 *శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు* 


 దీని ద్వారా చేపట్టే ఉచిత అన్నదాన పథకం వివరాలను ఇంతకుముందే తెలుసుకున్నాం. ఒక రోజుకు సరిపడా ఉదయపు అల్పాహారం గానీ, మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం గానీ తమకు కావలసిన తిథిలో అందజేయడానికి సరిపడే మొత్తాన్ని ఈ ట్రస్ట్‌కు విరాళంగా అందించవచ్చు. ఆ రోజు ఉభయదాతలుగా వారి పేరును అన్నప్రసాద సముదాయంలో ప్రకటిస్తారు.


‌ *శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్ట్* 


 1963వ సంవత్సరంలో స్థాపించబడిన *'శ్రీవేంకటేశ్వర బాలమందిరం ట్రస్ట్',* పేరు మార్చుకుని, *'శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్ట్'* గా రూపాంతరం చెందింది. దీని ద్వారా అనాథలైన బాలబాలికలకు, నిరుపేద తల్లిదండ్రుల పిల్లలకు ఉచితంగా విద్యాదానం చేయబడుతుంది. ఎందరెందరో పేదవర్గాల పిల్లలు దీనిలో ప్రాథమిక విద్యనభ్యసించి, జీవితంలో ఉన్నతశిఖరాలకెదిగారు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: