25, ఏప్రిల్ 2025, శుక్రవారం

బాలశంకరుని మేనిపై చిహ్నాలు`

 `బాలశంకరుని మేనిపై చిహ్నాలు`


శ్లో.  

*మూర్ధని హిమకరచిహ్నం నిటలే నయనాంక మంసయో శ్శూలం*  

       *వపుషి స్పటికాసువర్ణం ప్రాజ్ఞాస్తాం మేనిరే శంభుమ్*  


బాలశంకరుని తలపై చంద్రరేఖ, నుదిటిమీద మూడవకన్ను, భుజాలమీద శూలముల గుర్తులు, శరీరంమీద స్పటికం లాంటి తెల్లనికాంతులు వుండడం చూసి ఆ బాలుని దర్శించిన పండితులంతా అతడిని శంకరుని అవతరంగానే భావించారు. 

శ్లో.  

*నాగేనోరసి చామరేణ చరణే బాలేందునా ఫాలకే*

*పాణ్యోశ్చక్ర గదాధను ర్డమరుకై ర్మూర్ధ్ని త్రిశూలేనచ*  

       *తత్తస్యాద్భుత మాకలయ్య లలితం లేఖాకృతే లాంఛితం* 

       *చిత్రంగాత్రమమంస్త తత్ర జనతా నేత్రై ర్నిమేషోఘితైః* 


పైచెప్పిన గుర్తులేగాక, బాలశంకరునికి ఎదురురొమ్మున నాగరేఖ, పాదాలమీద చామరం, నొసటన చంద్రరేఖతో బాటు రెండుచేతులందూ చక్రము, గదా, ధనుస్సు, ఢమరుకం, తలపై త్రిశూలరేఖ, అర్ధశరీరభాగమున దేవీ స్వరూపం వుండడం గ్రహించిన జనులంతా ఆ బాలుడిని కళ్లప్పగించి చూస్తూ ఉండిపోతున్నారు.  


ఆ విధంగా బ్రహ్మసృష్టి కలుషితం అవుతున్న సమయంలో, ఎవ్వరూ మోక్షంపొందడానికి అర్హులుగా లేని దుర్భర తరుణంలో, అనేకమతాల ప్రభావంలో అయోమయంలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్న కాలంలో….


కరుణామయుడైన పరమశివుడు సాధువులను, ధర్మముల ను కాపాడడానికి అద్వైతజ్ఞానమును తిరిగి భూమండలం మీద ప్రకాశింప జేయడానికి, తానే స్వయంగా బాల శంకరుని రూపంలో తొలుత ఎనిమిది సంవత్సరాల ఆయుష్షుతో అవతరించాడు.    

కాబట్టి తరువాత ఆ ‘ బాలశంకరుడే ఆదిశంకరుడు ‘ గా రూపొంది తన జ్ఞానంతో మనలను కరుణించి ‘ జగద్గురువు ‘ అయినాడు అని చెప్పడంలో సందేహం ఏమి వున్నది.


*జయజయ శంకర హరహర శంకర హరహర శంకర జయజయ శంకర*.

కామెంట్‌లు లేవు: