*కంచి పరమాచార్య వైభవం.232*
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*
*🌹అంబాసిడర్ కారు - ఫియట్ కారు🌹*
గోవిందపురం శ్రీ నటరాజ అయ్యర్ పరమాచార్య స్వామివారి అనుగ్రహానికి, కరుణకు పాత్రులు. జి ఆర్ ఎన్ బిల్డర్స్ పేరుతో జనాలకు నిర్మాణ సేవలను అందించేవారు. మహాస్వామి వారిపై అచంచలమైన భక్తితో శ్రీమఠానికి ఎంతగానో సేవ చేశారు. స్వామివారు శ్రీశైలంలో ఉన్నప్పుడు తన స్నేహితునితో కలిసి ఒక అంబాసిడర్ కారులో దర్శనానికి వెళ్లారు.
స్వామివారిని దర్శించుకుని, తిరిగివెళ్లడానికి అనుమతి తీసుకుని చెన్నైకు వస్తుండగా; కారు ఫ్యాను బెల్టు తెగిపోయి కారు ఆగిపోయింది. తెలియని ప్రదేశంలో ఇలా జరగడంతో కాస్త కంగారు పడ్డారు. ఏమి చెయ్యాలో తోచక నిదానంగా దగ్గర్లోనే ఉన్న పెట్రోలు బాంకు దాకా వచ్చి కారును ఆపారు.
మహాస్వామి వారి వద్ద నుండి ప్రసాదం తీసుకుని స్వామివారి అనుమతితోనే బయలుదేరినా ఈ అర్ధరాత్రిలో ఎందుకు ఇలా జరిగిందా అని ఇద్దరూ ఆలోచిస్తున్నారు. ఇలా జరిగేలాగా ఉంటే ఎందుకు స్వామివారు మేము వెళ్లడానికి అనుమతిచ్చారు? భక్తితో స్వామివారిని ప్రార్థిస్తున్నారు. అప్పుడు ఆ పెట్రోలు బంకుకి ఒక ఫియట్ కారు వచ్చి ఆగింది. అందులో ఉన్నవారు పెట్రోలు పొయ్యమని బాంకు సిబ్బందిని అడిగారు. ఈ సమయంలో ఎందుకు ఇక్కడ ఉన్నారని వీరిని అడిగారు. కారు బెల్టు తెగిపోవడంతో కారు నడపడానికి కుదరక ఇక్కడున్నామని నటరాజ అయ్యర్ చెప్పాడు.
దాంతో ఆ ఫియట్ కారు వ్యక్తి తను ఎప్పుడు కారులో బయటకు వెళ్ళినా ముందుజాగ్రత్తగా అవసరమైన కొన్ని కారు వీడిభాగాలను వెంట తెచ్చుకుంటానని, తనవద్ద ఉన్న బెల్టును తీసుకుని క్షేమంగా ఇంటికి చేరమని చెప్పాడు. నటరాజ అయ్యర్ కు ఆశ్చర్యం కలిగింది. అంత రాత్రిలో ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి, కారు ఫ్యాను బెల్టు ఇచ్చి సహాయం చెయ్యడం కేవలం పరమాచార్య స్వామివారి కృప అని హృదయం ద్రవించింది. మనస్సులోనే స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
ఇందులో మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఆ అజ్ఞాత వ్యక్తి ఫియట్ కారులో వచ్చాడు. దూరప్రయాణాలకు వెళ్ళేటప్పుడు తన కారుకు సంబంధించిన విడిభాగాలనే పెట్టుకుంటాడు. కానీ ఆ ఫ్యాను బెల్టు మాత్రం తన ఫియట్ కారుది కాకుండా అంబాసిడర్ కారుది తెచ్చుకున్నాడు. ఎందుకు ఆ తప్పు చేశాడు? అతను తప్పు చేయలేదు. నటరాజ అయ్యర్ ని కాపాడడానికి మహాస్వామి వారు చేసిన దివ్యలీల ఇది. ఇలాంటి లీలలు చేసి భక్తులను కాపాడడం మహాస్వామి వారి సిద్ధులకు తార్కాణం.
*--- పరంథమన్ వి. నారాయణన్, “పరమాచార్యర్” నుండి*
*#Kanchiparamacharya vaibhavam* *#కంచిపరమాచార్యవైభవం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి