15, ఏప్రిల్ 2025, మంగళవారం

సుందోపసుందులు కథ🙏

 🙏సుందోపసుందులు కథ🙏

   అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు లక్షాగృహంలో ఉండగా కౌరవులు లక్షాగృహాన్ని (లక్క ఇంటిని) తగులబెట్టారు. అది చూసి పాండవులు అయిదుగురూ ద్రౌపదితో సహా ఆ ఇంటిలోనే కాలి బూడిదై పోయారని ప్రజలు అనుకున్నారు.

   కాని, పాండవులు కాలి బూడిదవడం నిజం కాదు. వాళ్ళందరూ బ్రతికే ఉన్నారు. స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని పడగొట్టి ద్రౌపదిని తీసుకుని వెళ్ళినవాడు బ్రాహ్మణ కుమారుడు కాదు. బ్రాహ్మణ వేషంలో ఉన్న పాండవ మధ్యముడు అర్జునుడే.

   తల్లి మాటని జవదాటని అయిదుగురు అన్నదమ్ములు ద్రౌపదిని పెళ్ళిచేసుకుని పాండవ పట్టమహిషిని చేశారు. ఈ విషయం నెమ్మది నెమ్మదిగా ప్రజలకి తెలిసింది.

   కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడి వరకూ ఈ విషయం వెళ్ళింది. ఎంతో సంతోషంతో విదురుణ్ణి పంపించి పాండవుల్ని, పట్టమహిషి పాంచాలిని, తల్లి కుంతీదేవితో సహా తన రాజ్యానికి రప్పించుకున్నాడు.

   వాళ్ళకి అర్ధరాజ్యాన్ని ఇచ్చి ఆదరించాడు. దేవశిల్పి విశ్వకర్మని రప్పించి అలకాపురంలో అందమైన ఒక భవనాన్ని కట్టించాడు. ఇంద్రప్రస్థపురాన్ని రాజధానిగా చేసుకుని పాండవులు ధర్మపరంగా రాజ్యపాలన చేస్తున్నారు.

   ఒకరోజు నారదమహర్షి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజు నారదమహర్షిని ఆదరంగా లోపలికి తీసుకుని వెళ్ళి ఆసనం మీద కూర్చోబెట్టి భక్తితో పూజచేశాడు. నారదుడు వాళ్ళని ఆశీర్వదించి“ “ధర్మరాజా! మీకు ఒక కథ చెప్తాను. నువ్వు, నీ తమ్ముళ్ళు ద్రౌపదితో సహా ఇక్కడ కూర్చుని వినండి!” అన్నాడు.

   “ సుందోపసుందులు అనే అన్నదమ్ములు ఒక పడతి కారణంగా ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుని జీవితాన్నే పోగొట్టుకున్న కథ. దీన్ని వినడం మీకు చాలా అవసరం. పూర్వం దితికి హిరణ్యకశిపుడు అనే పేరుగల కొడుకు ఉండేవాడు. అతడి వంశంలో పుట్టిన నికుంభుడి కొడుకులే సుందోపసుందులు.

   ఒకసారి అన్నదమ్ములు సుందోపసుందులు అలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. బాగా తపస్సు చేసి తమ కోరికలన్నీ తీర్చుకోవాలి అనుకున్నారు. వింధ్య పర్వతాలు ఉన్న చోటికి వెళ్ళి బ్రహ్మని గురించి తపస్సు చెయ్యడం ప్రారంభించారు. ఎండాకాలంలో నిప్పుల్లో కూర్చుని, వర్షాకాలం, శీతకాలం నీళ్ళల్లో కూర్చుని ఏదీ తినకుండా దీక్షగా తపస్సు చేస్తున్నారు.

  వాళ్ళు చేస్తున్న తపస్సు తీవ్రతకి వేడి పెరిగిపోయి ఆకాశమంతా నల్లగా పొగ కప్పేసింది. దాన్ని చూసి లోకాలన్నీ భయంతో వణికి పోయాయి. దేవతలు బ్రహ్మ దగ్గరికి పరుగెత్తి సుందోపసుందులు చేస్తున్న తపస్సు వల్ల చాలా అనర్ధాలు కలుగుతున్నాయని చెప్పారు.

  దేవతల భయాన్నిఅర్ధం చేసుకుని వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు భయపడకండి అని ధైర్యం చెప్పి పంపించాడు బ్రహ్మ.

   ఆలస్యం చెయ్యకుండా వెంటనే దేవతల భయాన్ని పోగొట్టాలనుకున్నాడు. సుందోపసుందులకి ప్రత్యక్షమయ్యి “నాయనలారా! మీరు దేనికోసం ఇంత దీక్షగా తపస్సు చేస్తున్నారు?” అని అడిగాడు.

   సుందోపసుందులు బ్రహ్మగార్ని చూసి ఆనందంతో రెండు చేతులు జోడించి “అయ్యా బ్రహ్మగారూ! మా కోరికలు మీరు తీరుస్తాను అంటేనే మీకు చెప్తాము!” అన్నారు.

   వాళ్ళ మాటలు విని బ్రహ్మగారు వీళ్ళకి ఉన్నది ఒక కోరిక కాదన్నమాట! ఇప్పుడు వాళ్ళు కోరుకున్నది ఇవ్వకపోతే మళ్ళీ తపస్సు మొదలెడతారు. దేవతలు మళ్ళీ భయంతో నా దగ్గరకి వచ్చేస్తారు. ముందు వీళ్ళ కోరికల్ని తెలుసుకుందాం అని మనస్సులో అనుకుని “ ఏం కావాలో అడగండి నాయనా! నేను వచ్చిందే అందుకు కదా!” అన్నాడు.

   సుందోపసుందులు అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. వెంటనే ”మహనుభావా! మా రూపాలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మార్చకోగలగాలి. ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి అనుకోగానే వెళ్ళిపో గలగాలి. మాయలు మొత్తం మాకు తెలియాలి. ఎవరి వల్లా కూడా మాకు చావు ఉండకూడదు. అసలు చావే ఉండకూడదు!” అని చాలా వినయంగా అడిగారు.

   బ్రహ్మ వాళ్ళు అడిగిన కోరికల వరుసని విన్నాడు. “నాయనా! మీరు అడిగినవన్నీ ఇస్తున్నాను. కాని ఆ ఒక్కటీ మాత్రం ఇవ్వను. చావులేని వాళ్ళు ఎవరూ ఉండరు. ఆ వరం తప్ప మిగిలినవన్నీ ఇస్తున్నాను” అని చెప్పి ఎందుకయినా మంచిదని వెంటనే అంతర్ధాన మయ్యాడు.

   వరాలు పొందిన ఆనందంతోను, గర్వంతోను రాక్షసులయిన సుందోపసుందులు తమ ప్రతాపం చూపించడం మొదలు పెట్టారు. దేవతల నగరాలన్నీ పడగొట్టారు. భూలోకంలో ఉన్న మహర్షుల్ని బాధపెట్టారు. బ్రాహ్మణులు చేసుకునే యాగాలన్నింటికీ అడ్డుపడ్డారు. సింహం, పులి, ఏనుగు వంటి అడవి జంతువులుగా మారి ఆశ్రమాల్లోకి వెళ్ళి మునుల్ని భయపెట్టారు.

   కౄరంగా ప్రవర్తిస్తున్న సుందోపసుందుల ప్రవర్తనకి భయపడి దేవతలు, మహర్షులు మళ్ళీ బ్రహ్మ దగ్గరికి పరుగెత్తారు. “బ్రహ్మదేవా! సుందోపసుందులకి మీరు ఇచ్చిన వరాలు ఏమిటో మాకు తెలియదు కాని, వాళ్ళు పెట్టే బాధల్ని మేం భరించలేక పోతున్నాం” అన్నారు బాధగా.

  వాళ్ళు చెప్పింది విని బ్రహ్మ బాగా ఆలోచించారు. ఈ రాక్షసులు ఎవరితోను చావు ఉండకూడదని వరం తీసుకున్నారు. వీళ్లని వదిలించుకోవాలంటే వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని చావాలి. అంతకంటే వేరే మార్గం లేదు అనుకున్నాడు.

   వెంటనే విశ్వకర్మని రప్పించాడు. అందమైన ఒక స్త్రీని సృష్టించమన్నాడు. రూపక్రియకళా విశారదుడైన విశ్వకర్మ ఇంతకు ముందు ఎవరికీ లేనంత సౌదర్యంతో ఒక స్త్రీని దేవతా రూపంతో సృష్టించి, ఆమెకి ’తిలోత్తమ’ అని పేరు కూడా పెట్టాడు.

   ఇంద్రుడు మొదలైన దేవతలతోను మహర్షులతోను కలిసి కూర్చున్న బ్రహ్మకి నమస్కారం చేసి “నేను చెయ్యవలసిన పని ఏమిటి?” అని వినయంగా అడిగింది తిలోత్తమ.

   అపురూపమైన సౌందర్యంతో వెలిగిపోతున్న తిలోత్తమని చూసి బ్రహ్మ“తిలోత్తమా! వింధ్య పర్వత ప్రాంతంలో సుందోపసుందులు అనే ఇద్దరు రాక్షసులు ఉన్నారు. వాళ్ళిద్దరు పరమ దుర్మార్గులు. ఎవరితోను చావు లేకుండా వరం తీసుకున్నారు. వాళ్ళు బ్రతికి ఉంటే మిగిలిన వాళ్ళందరు చచ్చిపోతారు. నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుని వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని చచ్చి పోయేలా చెయ్యాలి” అని చెప్పాడు.

   దేవసభకి ప్రదక్షిణం చేసి, దేవతలందరు తన సౌందర్యాన్ని పొగుడుతుంటే వయ్యారంగా బయల్దేరి భూలోకం చేరుకుంది తిలోత్తమ.

  వింధ్యాచలం చేరుకుని ఆ చుట్టుపక్క ప్రదేశాల్లో సుందోపసుందుల్ని వెతుక్కుంటూ తిరుగుతోంది. చివరికి సుందోపసుందులు అమెను చూశారు. అన్నదమ్ములు ఇద్దరూ చాలా సఖ్యంగా ఉండేవాళ్ళు. ఒకే చోట ఉండి, ఒక మంచం మీదే పడుక్కుని, ఒకే పళ్ళెంలో భోజనం చేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు. అంత సఖ్యంగా ఉన్న అన్నదమ్ములు తిలోత్తమ కనిపించగానే అమె అందానికి ముగ్ధులై ఇద్దరూ ఒకేసారి ఆమెను ఇష్టపడ్డారు.

   తిలోత్తమని చూడగానే ఒకడు ఈ అందలరాశి నా హృదయేశ్వరి అన్నాడు. రెండో వాడు కాదు ఈమె నా ప్రాణేశ్వరి అన్నాడు. ఇద్దరూ వేగంగా వెళ్ళి ఆమె రెండు చేతులూ చెరొకళ్ళూ పట్టుకుని లాగుతూ నేను పెళ్ళి చేసుకుంటాను అంటే కాదు నేనే చేసుకుంటాను అని వాదించుకున్నారు.

   తిలోత్తమ మరింత అందంగా నవ్వుతూ “నేను ఒక్కర్తిని, మీరు ఇద్దరు. నన్నెల్లా పెళ్ళిచేసుకుంటారు?” అని కొంటెగా అడిగింది.

   వాళ్ళిద్దరు ఒకళ్ళ మొహం మరొకళ్ళు చూసుకున్నారు. అంతలోనే తిలోత్తమ “ మీరిద్దరూ యుద్ధం చెయ్యండి మీలో ఎవరు గెలుస్తారో వాళ్ళని నేను పెళ్ళి చేసుకుంటాను” అంది.

   ప్రేమమత్తులో ఉన్న వాళ్ళిద్దరికీ అమె చెప్పింది నచ్చింది. గెలిస్తే అమెని పెళ్ళి చేసుకోవచ్చు కదా అనుకున్నారు. కాని, ఈ యుద్ధం వల్ల తమ ఇద్దరి మధ్య అంతవరకు ఉన్న ప్రేమ, స్నేహం, బంధుత్వం అన్నీ పోతాయి అనే విషయం వాళ్ళకి తట్టలేదు.

   ఇద్దరి మధ్య పోరు మొదలయింది. పట్టుదలతో ఒకళ్ళ నొకళ్ళు కొట్టుకుని చివరికి ఇద్దరూ చచ్చిపోయారు. ఇప్పటి వరకు మీ అయిదుగురి మధ్య ఉన్న స్నేహ సంబంధాలు ద్రౌపది కారణంగా పోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పడం కోసమే ఈ కథ చెప్పాను “ అన్నాడు నారదుడు.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: