15, ఏప్రిల్ 2025, మంగళవారం

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(105వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం*

*అక్రూరుడితో బలరామకృష్ణుల ప్రయాణం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*అక్రూరుడు రథాన్ని సిద్ధం చేశాడు. బలరామకృష్ణులను ఆహ్వానించాడు. వారొచ్చి, రథాన్ని అధిరోహించారు. అధిరోహించి, పక్కపక్కన కూర్చున్న ఆ ఇద్దరూ బుధ, శుక్రుల వలె మహాతేజస్సుతో వెలిగిపోసాగారు. అక్రూరుడు సారథి అయి, రథాన్ని ముందుకు పోనిచ్చాడు. నందుడు మొదలయిన యాదవ ప్రముఖులు అతన్ని అనుసరించారు. రథాలు మెల్లగా నడుస్తున్నాయి. బలరామకృష్ణులు మధురకు ప్రయాణ మయ్యారని తెలిసి, గోపికలు పరుగు పరుగున వచ్చారక్కడకి. ప్రయాణిస్తున్న రథానికి అడ్డుగా నిలిచారు. కన్నీరు పెట్టుకుని, కన్నయ్యను చూశారు. నిన్ను వదలి క్షణం కూడా ఉండలేమన్నారు. వద్దువద్దన్నట్టుగా కూలబడ్డారు. వారిని సముదాయించడం ఎవరి వల్లా కాలేదు.*


*‘‘నిన్ను చూడకుండా నిముషం కూడా ఉండలేం. నీతోపాటు మమ్మల్ని కూడా తీసుకునిపో కృష్ణా’’ ప్రార్థించారు గోపికలు. రథం దిగిరమ్మనట్టుగా అతని చేయిపట్టుకున్నారు.*


*సున్నితంగా విదలించుకున్నాడు కృష్ణుడు. ‘‘త్వరలో వచ్చేస్తాను. మధురకు నా దేహమే ప్రయాణిస్తోంది. నా మనసు ఇక్కడే ఈ వ్రేపల్లెలోనే ఉంది.’’ అన్నాడు. పేరు పేరునా గోపికలను బుజ్జగించి, బయల్దేరాడు.*


*అంతలో యశోద, రోహిణి వచ్చారక్కడకి. బలరామకృష్ణుల నొసట తిలకాలు దిద్ది, హారతులిచ్చారు. పిల్లలకు ఏ ఆపదా రాకూడదని దేవుళ్ళను ప్రార్థించారు. వారిని ముద్దిడి దీవెనలిచ్చారు. అంతా ఊరి సరిహద్దుల దాకా వచ్చి, బలరామకృష్ణులను సాగనంపి, వెను తిరిగారు. రథం వేగం పుంజుకుంది. అక్రూరుడు రథాన్ని వాయువేగంతో నడపసాగాడు. మధ్యాహ్నం వేళకు యమునాతీరం చేరుకున్నారంతా. దాహం తీర్చుకోదలచి, బలరామకృష్ణుల సహా యమునలోకి దిగారు. కాళ్ళూ చేతులూ కడుక్కున్నారు. దోసిటపట్టి నీరు తాగి దాహం తీర్చుకున్నారు. కాస్సేపు నదీతీరాన చెట్లనీడల్లో విశ్రమించి, సేదదీరారు. బలరామకృష్ణుల్ని రథం మీద కూర్చోబెట్టి, తానూ దాహం తీర్చుకునేందుకు యమునలోకి దిగాడు అక్రూరుడు.*


*నీరు దోసిట పట్టి తీయబోతున్నంతలో బలరామకృష్ణులు నీళ్ళలో కనిపించారు. రథంలో కూర్చున్న బలరామకృష్ణులు నీళ్ళలోకి ఎప్పుడొచ్చారా? అని ఆశ్చర్యపోయాడు అక్రూరుడు.*


*తల తిప్పి, తీరాన ఉన్న రథం కేసి చూశాడు. రథం మీద బలరామకృష్ణులు కూర్చుని కనిపించారు. నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కనిపించారిద్దరూ. మరి నీళ్ళలో ఉన్నదెవరు? నీటిలోకి తేరిపార చూశాడు అక్రూరుడు. నీటిలో కూడా బలరామకృష్ణులు ఉన్నారు. నిజరూపాలతో కనిపించసాగారు.*


*శ్రీదేవిసహా శ్రీమహావిష్ణువు శేషపాన్పుపై పవళించి కనిపించాడు. సమస్త దేవతలూ, మునులూ విష్ణువును పరివేష్టించి ఉన్నారు. వేదసూక్తాలతో స్తోత్రాలు చేస్తున్నారతన్ని. మహావిష్ణువుని చూసిన మరుక్షణం అక్రూరుని ఆనందానికి అంతులేకుండాపోయింది. పులకించిపోయాడతను. భవబంధాలనుండి విముక్తి లభించినట్టుగా సంతోషించాడు. మహాయోగులకు కూడా అందని బ్రహ్మజ్ఞానం, ఆత్మచైతన్యం కలిగాయి అతనికి. పరతత్త్వం బోధపడింది. మరింతగా భగవంతునిపై భక్తి కుదిరింది. అంతా జన్మజన్మల పుణ్యఫలం అనుకున్నాడు అక్రూరుడు. చేతులు జోడించి నమస్కరించాడు. గద్గదంగా శ్రీహరిని స్తోత్రం చేశాడు. అక్రూరుణ్ణి అనుగ్రహించాడు కృష్ణుడు. తాను శ్రీమహావిష్ణువునని తెలియజేసేందుకే అలా కనిపించాడతనికి.*


*జపతపాలు లేవు. నియమనిష్టలు లేవు. కేవలం భక్తితత్పరతే...అక్రూరుని భక్తితత్పరతే భగవంతుని సాక్షాత్కారానికి కారణమయింది.*


*భగవదనుగ్రహం పొంది, దాహాన్ని తీర్చుకుని వచ్చాడు అక్రూరుడు. రథాన్ని అధిరోహించాడు. ముందుకుపోనిచ్చాడు. రథం నడుస్తోంటే అతని దగ్గరగా వచ్చి అడిగాడు కృష్ణుడు.*


*‘‘నదిలో నీకేమయినా కనిపించిందా అక్రూరా?’’*


*‘‘కనిపించింది కృష్ణా! సర్వం శ్రీహరిమయం అనిపించింది. ఈ జన్మకి ఇది చాలు.’’ అన్నాడు అక్రూరుడు.*


*వారలా మాట్లాడుకుంటూ మధురాపురం పొలిమేరలకు చేరుకున్నారు. అప్పటికి సూర్యాస్తమయం అయింది. ఓ ఉద్యానవనం ముందు రథాన్ని నిలిపాడు అక్రూరుడు. అప్పటికే అక్కడకి చేరుకున్న నందుడు మొదలయిన యాదవప్రముఖులంతా బలరామకృష్ణులను చుట్టుముట్టారు. అన్నతో సహా రథాన్ని దిగాడు కృష్ణుడు.‘‘అక్రూరా! ఈ రాత్రి ఇక్కడే ఈ ఉద్యానవనంలో విడిది చేస్తాం. రేపు పట్టణంలోకి ప్రవేశిస్తాం. మీరిక వెళ్ళొచ్చు.’’ చెప్పాడు.*


*‘‘నిన్ను విడచి వెళ్ళలేను కృష్ణా! నువ్వు లేకుండా మధురాపురంలో అడుగుపెట్టలేను. నేను నీ భక్తుణ్ణి. ఈ రాత్రి నా ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించు. దయచేసి నన్ను కరుణించు.’’ ప్రార్థించాడు అక్రూరుడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: