25, మే 2025, ఆదివారం

17-21-గీతా మకరందము

 17-21-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - రాజసదానమును పేర్కొనుచున్నారు- 


యత్తు ప్రత్యుపకారార్థం 

ఫలముద్దిశ్య వా పునః | 

దీయతే చ పరిక్లిష్టం 

తద్దానం రాజసం స్మృతమ్* || 


తాత్పర్యము:- ప్రత్యుపకారము కొఱకుగాని, లేక ఫలము నుద్దేశించిగాని మనఃక్లేశముతో (అతికష్టముతో) గాని ఇవ్వబడు దానము రాజసదానమని చెప్పబడుచున్నది.


వ్యాఖ్య:- ప్రత్యుపకారము కోరి చేయు దానము ఉత్తమమైనదికాదని నుడువుచున్నారు. ప్రత్యుపకార మభిలషించి చేయు దానము బజారులోని వ్యాపారవిధానమే (Shop - keeping) కాగలదు. ఇచ్చిపుచ్చుకొను పద్ధతి అంత శ్రేష్ఠమైనదికాదు. అది రాజసదానపద్ధతియే యగును. మఱియు తనకేదియో మున్ముందు పరలోకాదులందు ఫలము కలుగునని ఆశించి చేయుదానము, అనగా ఫలాపేక్షతో చేయు దానమున్ను ఉత్తమమైనదికాదు. నిష్కామముగా, భగవత్ప్రీత్యర్థముగా చేయుదానమే మహోన్నతమైనది.


" పరిక్లిష్టమ్ “ - కొందఱు దానము చేయునపుడు " అయ్యో! ఈ వస్తువు పోవుచున్నదే ” యని మనస్సులో బాధపడుచుందురు. మఱికొందఱు ఇతరుల బలవంతముచే దానము చేయుచుందురు. అట్లు క్షేశముతో దానమొసంగుట ఉత్తమపద్ధతికాదు. అట్టిది సత్ప్రయోజనమున్ను గలుగజేయజాలదు. దానముచేయుట తనకర్తవ్యమని, (ధర్మమని) భావించి ఐచ్ఛికముగ, అనందముతో ఒకరికిచ్చుటయే సాత్త్వికదానము. తదితరము రాజస, తామస, దానములే యగును. కావున విజ్ఞుడు సాత్త్వికదానమునే అవలంబించవలెను.


ప్రశ్న:- రాజసదాన మెట్టిది?

ఉత్తరము:- (1) ప్రత్యుపకారముకొఱకుగాని (2) ఫలమునుగోరికాని (3) మనస్సునందు బాధపడుచుగాని చేయబడు దానము రాజసదానమనబడును.

~~~~

* తద్రాజసముదాహృతమ్ - పాఠాన్తరము.

కామెంట్‌లు లేవు: