🙏 శ్రీ రుద్రనమక వైభవము 🙏
మొదటి భాగం
ఇది పరమేశ్వర సంబంధ జ్ఞానము.
"వేదః శ్శివః శివో వేదః" అన్నారు మహర్షులు.
వేదం 'గ్రంథం' కాదు. వేదం శబ్ద స్వరూపుడైన ఈశ్వరుడు. ఈశ్వర నిర్మితమైన శబ్ద ప్రపంచమే వేదమంటే. ఋషులు వేద మంత్రరాశిని దర్శించారు. అంటే మంత్రంతో పాటు మంత్ర సంబంధమైన 'తేజస్సు'ను దర్శించారు.
ఏ శబ్దానికి 'శక్తి' ఉంటుందో ఆ శబ్దానికి మంత్రమని పేరు.
ఇప్పుడు చెప్పుకోబోతున్న 'రుద్రనమకం' అనే భాగానికి మరొక పేరు ఉంది, 'శత రుద్రీయం'. ఇంకోపేరు 'రుద్రోపనిషత్'.
వేదమునకు హృదయ స్థానంలో యజుర్వేదముందట, యజుర్వేదానికి హృదయ స్థానంలో రుద్రముందట. అందుకు దీన్ని వేదానికి హృదయం అన్నారు. రుద్రం చెప్తూవుంటే పరమేశ్వరుడు సంతోషిస్తాడట.
రుద్రంలో పదకొండు అనువాకాలున్నాయి. వీటిలో ఎన్నో మంత్రాలున్నాయి. ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క ప్రయోజనం సాధించవచ్చు. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ఓషధి.
రుద్రనమకం యజుర్వేదంలో 'పంచమ ప్రపాఠకం' లో ఉన్నది, సప్తమ ప్రపాఠకంలో 'చమకం' వస్తుంది. 'చమే' అనే శబ్దం ఆవృత్తి జరుగుతూ మూడువందల యాభైమార్లు వస్తుంది. ఈ 'చమే' బాహుళ్యం చేత 'చమకం' అని పేరు వచ్చింది.
మొత్తం రుద్రానికి ఒకటే అర్థం; "పరమేశ్వరునికి నమస్కారము".
"ఏతానిహవా అమృతస్య నామధేయాని" -- ఏ అమృతత్వం మీరు పొంద దలుచుకొన్నారో, ఆ అమృతత్వం పేరు 'శతరుద్రీయం'. ఆ అమృతమే పరమేశ్వరుడు, అయనే అమృతేశ్వరుడు.
'శతరుద్రీయం' అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇందులో 'శత'రుద్రుల గురించి చెప్పారు. "శతం అనంతం భవతి" -- పరమేశ్వరుని యొక్క అనంతమైన విభూతుల గురించి, అనంతమైన స్వరూపాలు గురించి ఇందులో చెప్తున్నారు.
"బ్రహ్మచారీ మితాహారో భస్మనిష్ఠః సమాహితః ౹
జపేద్ ఆమరణాత్ రుద్రం సయాతి పరమాంగతిమ్ ॥"
శతరుద్రీయాధ్యాయాన్ని అనన్య చిత్తంతో, పరమేశ్వరునిపై ఆసక్తి గల మనస్సుతో, బ్రహ్మచారిగా, మితాహారంతో, భస్మధారణ నిష్ఠుడై మరణ పర్యంతం జపించువాడు పరమగతిని పొందుతాడు.
"అవిముక్తం మమ క్షేత్రం మన్నామ పరమం శుభం ౹
శతరుద్రీయ జాపిత్వం తథా సన్యాస ముత్తమం ॥"
అని మరొక స్మృతివాక్యం.
అవిముక్తం (కాశీక్షేత్రం)లో మరణించిన వాడు. సన్యాసం స్వీకరించిన వాడు, శతరుద్రీయం జపించిన వాడు మోక్షం పొందుతాడు. వేదంలో 'కాశీక్షేత్రం' ఈ శతరుద్రీయం.
"శతరుద్రీయ మధీతే అగ్నిపూతో భవతి" -- శతరుద్రీయం జపం సర్వపాపములను భస్మీపటలం చేస్తుంది.
"రుద్రాధ్యాయీ వసేత్ యత్ర గ్రామేవా నగరేపివా
న తత్ర క్షుత్పిపిపాసాధ్యా దుర్భిక్షం వ్యాధ యోపిచ"
రుద్రాధ్యాయము జపించే వాడు ఏ ఊళ్ళో ఉంటే, ఆ ఊళ్ళో ఉపద్రవాలుండవు.
"ప్రయతః ప్రాత రుత్థాయ యదధీతే విశాంపతే
ప్రాంజలిః శతరుద్రీయం నాస్య కించన దుర్లభమ్"
ప్రాతఃకాలంలో నిద్ర లేచి ఎవరైతే రెండు చేతులు దోయిలించి, ఈ శతరుద్రీయాన్ని చదువుతారో, వాళ్ళకు దుర్లభమైనది లేదు సుమా!
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి