🙏రుద్రనమకం🙏
ఇప్పుడు 'మహన్యాసం' అనే ప్రక్రియ గురించి చెప్పుకోవాలి.
'న్యాసం' అంటే 'ఉంచుట', 'నిలుపుట' అని అర్థం. 'మహన్యాసం' అంటే 'గొప్పగా నిలుపుట'.
'నారుద్రో రుద్ర మర్చయేత్' అని శాస్త్రం. 'రుద్రుడు కానివాడు రుద్రుని పూజించరాదు'. రుద్రమంత్రాలతో నిన్ను నీవు మంగళకరం చేసుకోవాలి. మంత్రాలతో శరీరమంతా రుద్రమయమై పోతుంది. అందుకు మహన్యాసమనే ప్రక్రియ ఉన్నది. మంత్రశక్తి ప్రవేశించి 'మాంస'మయమైన శరీరం 'మంత్ర'మయమైన శరీరంగా మారుతుంది.
ముందు మనచుట్టూ శివుడు, తర్వాత మనతో శివుడు, చివర మనలో శివుడు, అంతిమంగా మనమే శివుడు ..... అనే స్థితికి తీసుకు వెళుతుంది మహన్యాసం.
ఇక్కడ మనం చెప్పుకొనేది కేవలం మంత్రానుష్ఠానము కాదు. ఆ మంత్రముల యందు చెప్పబడ్డ రుద్ర వైభవాన్ని స్మరించుకోబోతున్నాము.
"తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకినీ డాకినీ సర్వ శ్వాపద తస్కర జ్వారాత్ ఉపద్రవాత్"
అని మహన్యాసంలో చెప్పబడింది. నిరంతరం ఆ శివుడుని ఎవరు ఆరాధన చేస్తున్నారో వారిని చూసి రోగాలూ, పాపాలూ, ఉపద్రవాలూ, భూత ప్రేత పిశాచాలూ, అన్నీ దూరం నుండి భయపడుతాయి, "సర్వే జ్వలంతం పశ్యంతు" వాటికి వీడు 'అగ్నిశిఖ'లాగా కనపడతాడు.
ఇక్కడ ఈ 'రుద్ర' శబ్దానికి ఎన్ని అర్థములు ఉన్నాయో 'నిరుక్తం' అనే శాస్త్ర ఆధారంగా తెలుసుకుందాము.
**రోదమును కలిగించువాడు 'రుద్రుడు'.
అంతకాలంలో అందరినీ దుఃఖింప జేయువాడు. మహాప్రళయంలో అందరినీ భయవిహ్వలులని చేసే ప్రళయ కారకుడు పరమేశ్వరుడు.
**రుత్తుని ద్రవింపజేయువాడు 'రుద్రుడు'.
దుఃఖాన్నీ, దుఃఖ కారకాన్నీ ద్రవింప జేయువాడు, అంటే నశింప జేయువాడు. ప్రభువే ఏడిపిస్తాడు, ప్రభువే ఆనందిం జేస్తాడు. ఆనందదాయకుడు, దుఃఖ విమోచకుడు. దుఃఖ మూలం 'అవిద్య'. అవిద్యను నశింపజేయువాడు. గురు స్వరూపంగా బ్రహ్మవిద్యను ప్రసాదించి, అవిద్యానాశనంతో కైవల్యాన్ని ఇచ్చేవాడు 'రుద్రుడు'.
**రుతం సంసార దుఃఖం ద్రావయతి.
'రుత్' అంటే దుఃఖము. సంసార దుఃఖాన్ని నశింపజేయువాడు.
**రుతౌ నాదాంతే ద్రవతి - ద్రావయతీతి రుద్రః.
ఇది వైదిక పరమైన, యోగ పరమైన అర్థం. 'రుతం' అనే శబ్దానికి 'నాదం' అనే అర్థం ఉంది. నాదమునకు పైన స్థితి 'అమృతం', ఆ రూపంలో ప్రవహించువాడు.
'ఓం'కారంలో వ్యక్తమయ్యేది 'అ'కార, 'ఉ'కార, 'మ'కారములనే మూడు; అవ్యక్తమయ్యేవి అర్ధచంద్ర, రోధినీ, నాద, నాదాంత, శక్తి, వ్యాపికా, సమనా, ఉన్మనీ అనే ఎనిమిది ఉన్నాయి. మొత్తం కలిపి పదకొండు. ఈ పదకొండు స్థానములే 'ఏకాదశ రుద్రులు', ప్రణవం ఒకటే కనుక ఏకాదశ రుద్రులు కలిపి ఒకడే 'రుద్రుడు', అందుకే ఓంకారమే రుద్రుడు. మనలో పదకొండు రూపాలుగా ఉన్న ప్రాణశక్తి రుద్రుడే. ఈ రుద్ర శబ్దానికి 'ప్రాణశక్తి స్వరూపుడు అని అర్థం చెప్పారు.
**రుత్యా వేదరూపయా ధర్మాదీ నవలోకయతి ప్రాపయతి వా రుద్రః.
వేదస్వరూపుడై ఏది ధర్మమో తెలియజేస్తూ, దాన్ని కలిగించేవాడు ఎవడో అతడు రుద్రుడు.
**రుత్యా వాగ్రూపయా వాచ్యం ప్రాపయతీతి రుద్రః.
అని కూడా నిర్వచనం చెప్పారు.
**రుత్యా ప్రణవరూపయా స్వాత్మానాం ప్రాపయతి ఇతి రుద్రః.
ప్రణవనాదం ద్వారా ఆత్మతత్త్వాన్ని పొందింప జేసేవాడు రుద్రుడు.
**రుజాం ద్రావయతీ రుద్రః.
రోగాలను నశింప జేయువాడు
ఇన్ని అర్థములు రుద్ర నామానికి, ఇది అన్ని 'అర్థము'లను ప్రసాదించే నామము.
ఈ రుద్రునికి నమస్కారము
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి