*తిరుమల సర్వస్వం 249-*
*ద్వాదశ ఆళ్వారులు-14*
*శ్రీరామచంద్రుని సాక్షాత్కారం*
మరో సందర్భంలో అరణ్యకాండ పారాయణం జరుగుతున్నప్పుడు, పౌరాణికులు సీతాపహరణ ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తున్నారు. సీతమ్మ తల్లి దురవస్థను విన్న కులశేఖరుని రక్తం సలసలా మరిగిపోయింది. ప్రాణాలకు తెగించి రావణునితో తలపడడానికి సిద్ధమై, సర్వసైన్యాలను తోడ్కొని; ముందువెనుకలు, పూర్వాపరాలు ఆలోచించకుండా; లంకానగరాన్ని ముట్టడించే లక్ష్యంతో సముద్రంలోనికి ప్రవేశించాడు. మంత్రులు, వీరావేశంతో నున్న మహారాజును అడ్డగించే సాహసం చేయలేక పోయారు. చితాక్రాంతులై, చేష్టలుడిగి రాజుగారి దుస్సాహసాన్ని చూస్తుండి పోయారు. సరిగ్గా ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది. కులశేఖరుని అకుంఠిత భక్తికి సంతసించిన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా ప్రత్యక్షమై ప్రసన్నవదనంతో, తాను అప్పటికే రావణుణ్ణి నిర్జించి ఆతని చెర నుండి సీతమ్మను విడిపించానని విశదపరిచాడు. దానితో సంతృప్తి నొందిన కులశేఖరుడు తన సంకల్పాన్ని విరమించుకున్నాడు.
*మరో పన్నాగానికి శ్రీకారం*
పై సంఘటనలతో, శ్రీవైష్ణవుల పట్ల కులశేఖరుని భక్తిభావం మరింతగా బలపడింది. ఎల్లవేళలా వారి సాహచర్యంలోనే కాలం గడపసాగాడు. రాజమహలుకు భాగవతుల తాకిడి పెరిగి పోయింది. రాజు గారిచ్చిన చనువుతో శ్రీవైష్ణవులు సభామండపం లోను, రాజభవనం లోనూ చివరికి అభ్యంతర మందిరము మరియు ఇతర రహస్యప్రదేశాలతో సహా యథేచ్ఛగా తిరుగసాగారు. ఈ విషయంపై మంత్రులు ఆందోళన చెందారు. అపరిచితులను రాజమందిరం లోకి అనుమతించడం శ్రేయస్కరం కాదు. సున్నితమైన సమాచారం శత్రురాజుల పరమయ్యే ప్రమాదముంది. ఎలాగైనా సరే, మహారాజు మదిలో శ్రీవైష్ణవుల పట్ల ఏహ్యభావం కలిగించి, వారిని రాజమహలుకు దూరం చేసే పన్నాగం పన్నారు.
*మాయమైన కళ్యాణహారం*
ఒకానొక నాడు, నవమి పుణ్యతిథి యందు రాజమహలు లోని రామమందిరంలో సీతారామకళ్యాణం కన్నుల పండువగా జరుగుతోంది. మంత్రుల పథకం ప్రకారం సీతమ్మకు అర్పించవలసిన కళ్యాణహారం మాయమైంది. దాన్ని తీవ్ర అమంగళకరంగా భావించిన కులశేఖరుడు చోరులను తక్షణమే బంధించవలసిందిగా, మంత్రులను ఆజ్ఞాపించాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మంత్రిమండలి సభ్యులు, సభామందిరంలో లెక్కకు మిక్కిలిగా నున్న శ్రీవైష్ణవులే చోరత్వానికి పాల్పడి ఉంటారని, మరెవ్వరికీ ఆ అవకాశం లేదని ముక్తకంఠంతో బదులిచ్చారు. వైష్ఠవులపై నేరారోపణను మహారాజు సహించలేక పోయాడు. కానీ విశ్వాసపాత్రులైన మంత్రులందరూ ఒక్కుమ్మడిగా శ్రీవైష్ణవులపై నేరం మోపడంతో నిస్సహాయుడయ్యాడు. ఏది ఏమైనా సరే శ్రీవైష్ణవులను నిర్దోషులుగా నిరూపించ దలచుకున్నాడు.
*నిగ్గు తేల్చిన నాగరాజు*
కులశేఖరుడు శ్రీహరిపై భారం వేసి, బుసలు కొట్టే కాలసర్పాన్ని సభామందిరానికి తెప్పించాడు. ఆ నాగరాజును తన రెండు హస్తాలతో ఒదిమి పట్టుకొని, శ్రీవైష్ణవులు నిర్దోషులైతే తనను కరవ వద్దని సర్పాన్ని ఆదేశించాడు. అంతే! ఆ కోడెత్రాచు, తన సహజ ప్రవృత్తికి భిన్నంగా కాటు వేయడానికి బదులుగా, తన పడగతో కులశేఖరుణ్ణి ఆశీర్వదించి, మంత్రివర్గ సభ్యుల సమక్షంలోనే సభాగృహం నుండి చరచరా నిష్క్రమించింది. దాంతో మహారాజుకు శ్రీవైష్ణవులపై విశ్వాసం మరింతగా పెరిగిపోయింది. ఆగ్రహోదగ్రుడైన మహారాజు హెచ్చరించడంతో, మంత్రులు అసలు విషయాన్ని విన్నవించు కున్నారు.
*శ్రీరంగం ప్రయాణం*
రాజ్యక్షేమం, ప్రజాక్షేమం కోరి మంత్రులు పన్నిన పన్నాగాన్ని రాజుగారు క్షమించారు కానీ కుట్రలు, కుతంత్రాలతో నిండిన రాజ్యపాలనా భారాన్ని శాశ్వతంగా వదులుకోదలచి, తన కుమారుడైన 'రెండవ దృఢవ్రతుణ్ణి' రాజుగా పట్టాభిషిక్తుని గావించాడు. వెనువెంటనే, అతికొద్ది పరివారంతో శ్రీరంగం చేరుకుని, తన చిరకాల వాంఛ నెరవేర్చుకున్నాడు.
*కులశేఖరుని ఆకాంక్ష*
అప్పటి నుండే వారి సాహిత్యసాధన మొదలైంది. వీరు తమ పాశురాల్లో స్వామిపుష్కరిణిలో హంసగానైనా జన్మించాలని; ఇంద్రలోకంలో రంభాది అప్సరసల సరసన ఉండే సుఖం కంటే, భూమండలాన్ని ఏలే చక్రవర్తిత్వం కంటే, స్వామిసన్నిధే శ్రేయోదాయకమని; వేంకటాచల క్షేత్రంలో చంపకవృక్షంగా నైనా జన్మించాలని; మత్తగజాలను అధిరోహించే రాచరికపు జన్మ కంటే తిరుమల క్షేత్రంలో పూపొదగా జన్మించడమే ఇష్టపడతానని తెలియపరిచాడు.
మరుక్షణమే మనసు మార్చుకుని తిరుమలలో పక్షిగా జన్మిస్తే, కొంత కాలానికి మనసు మారి ఎగిరిపోయే ఆలోచన రావచ్చని; చెట్టుగా పుడితే కొన్నేళ్ళ తరువాత తనను వంట చెరకుగా వాడుకుంటారని; పుష్కరిణిలో చేపగా పుడితే పక్షులకు ఆహారమవుతానని; అలా కొంతకాలానికి స్వామివారికి దూరమవుతానని; వీటన్నింటి కంటే, స్వామివారి ఎదుట బండశిలలా పడివుంటే అనుక్షణము వారి ముగ్ధమనోహర రూపాన్ని గాంచుతూ ఉండవచ్చని; స్వామివారి నుండి విరహమేర్పడదని అభిలషించాడు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి