*సంపూర్ణ మహాభారతము* *సరళ వ్యావహారిక భాషలో...!*
*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము*
387 వ రోజు
* వనకులసహదేవులు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి ఒక్కుమ్మడిగా కర్ణుడిని చుట్టుముట్టారు. మరొక పక్క భీమసేనుడు కౌరవసేనలను నిర్ధాక్షిణ్యంగా సంహరిస్తున్నాడు. అతడి వీరవిహారానికి మారణహోమానికి భయపడి కౌరవయోధులు అతడి ఎదుటకు రావడానికి సాహసించ లేకపోతున్నారు. అర్జునుడు సంశక్తులను సంహరించి మిగిలిన త్రిగర్త సైనికులను తరుముతున్నాడు. త్రిగర్త సైనిలుకు అర్జునుడి ధాటికి పారిపోయారు. అర్జునుడు కర్ణుడి వైపు రథము తోలమన్నాడు. అది చూసిన సుయోధనుడు త్రిగర్త సైనికులను యుద్ధోన్ముఖులను చేసి అర్జునుడితో యుద్ధానికి పంపాడు. కాంభోజసైనికులను తోడు చేసుకుని త్రిగర్తులు అర్జునుడిని ఎదుర్కొని చుట్టుముట్టారు. అర్జునుడు కాంబోజసేనలతో సహా త్రిగర్తల తలలను నరికాడు. రణభూమి అంతా వారి మొండెములతో నిండింది. తనను ఎదుర్కొన్న కాంభోజరాజు సోదరుడిని అర్జునుడు ఒకే బాణంతో అతడి చేతులు నరికాడు. అది చూసి అర్జునుడిని చుట్టుముట్టిన యవనసేనలు అతడి చేతిలో హతమయ్యాయి.
*అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొనుట*
శ్రీకృష్ణుడి రథ సారథ్యంలో అంతటాతానే అయి యుద్ధము చేస్తున్న అర్జునుడిని అశ్వత్థామ ఎదుర్కొని " అర్జునా ! నువ్వు నాతో యుద్ధము చేయుట లేదు నన్ను నీ అతిధిగా స్వీకరించి యుద్ధమును ఆతిధ్యముగా ఇవ్వు " అన్నాడు. అర్జునుడు కృష్ణుడి వంక చూసాడు. కృష్ణుడు అర్జునుడితో " అశ్వత్థామా ! అర్జునుడితో తనివి తీరా యుద్ధము చేసి సుయోధనుడి రుణం తీర్చుకో " అన్నాడు. వెంటనే అశ్వత్థామ కృష్ణుడి మీద అరవై బాణములు వేసి అర్జునుడి మీద మూడు బాణములు వేసాడు. అర్జునుడు అశ్వత్థామ ధనస్సు విరిచాడు. అశ్వత్థామ మరొక విల్లందుకుని అర్జునుడి శరీరం అంతా శరములు నాటి కృషార్జునులను రథంతో సహా బాణవర్షంలో ముంచాడు. కృష్ణార్జునులకు ఏమైందో తెలియక సైనికులు హాహాకారాలు చేసారు. కృష్ణుడు అర్జునుడి వంక చూసి " అర్జునా ! ఇదేమి వింత అశ్వత్థామ నిన్ను గెలువడమా ! నీ పరాక్రమం నశించిందా ! నీలో అధైర్యం ప్రవేశించిందా ! నీ గాండీవం బలం నశించిందా ! లేక గురుపుత్రుడని జాలి చూపుతున్నావా ! " అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలకు రోషం తెచ్చుకుని అర్జునుడు కోపంతో అశ్వత్థామ విల్లు విరిచి, కేతనము విరిచాడు. అశ్వత్థామ వెంటనే ఒక బల్లెము తీసుకున్నాడు. అర్జునుడు దానిని కూడా విరిచాడు. ఇది చూసిన సంశక్తులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు వారిని అందరిని క్షణకాలంలో చంపాడు. వారి రథము విరిచి, గజములను అశ్వములను చంపాడు. సంశక్తులకు తోడుగా అంగ, వంగ, కళింగ, నిషాద దేశ సేనలు అర్జునుడిని చుట్టుముట్టాయి. ఇంతలో అశ్వత్థామ మరొక విల్లు రథము సమకూర్చుకుని అర్జునుడిని ఎదుర్కొని కృష్ణార్జునుల మీద అత్యంత క్రూరశరములు ప్రయోగించాడు. అర్జునుడు అశ్వత్థామ శిరము మీద, కంఠము మీద, చేతుల మీద, గుండెల మీద పాదముల మీద శరప్రయోగము చేసాడు. అశ్వత్థామ రథాశ్వముల పగ్గములు ఖండించాడు. రథాశ్వములు అదుపు తప్పి రథమును ఎటో తీసుకు వెళ్ళాయి. అశ్వత్థామ తన రథమును అదుపు చేసుకుంటూ కర్ణుడి వైపు వెళ్ళాడు. అర్జునుడు మిగిలిన సంశక్తుల గర్వము అణచడానికి వెళ్ళాడు. ఇంతలో మగధరాజు దండధారుడు గజమును ఎక్కి పాండవ సైన్యంలో జొరబడి సైన్యమును నాశనం చేయసాగాడు. కృష్ణుడు " అర్జునా ! ముందు వాడి పని పట్టు " అని రథమును దండధారుని వైపు పోనిచ్చాడు. దండధారుడు కూడా అర్జునుడి ఎదురుగా గజమును ఎక్కి నిలిచి వారిపై పదునైన బాణము ప్రయోగించి కృష్ణార్జునుల మీద శరములు గుప్పించాడు. అర్జునుడు ఒకే బాణంతో దండ ధారుని చేతులు రెండు నరికి మరొక బాణంతో అతడి గజమును వధించి అతడి సైన్యములను చెల్లాచెదురు చేసాడు.
రోజు*
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి