14, జూన్ 2025, శనివారం

జీవితమొక అద్భుతం🌻

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


*🌻జీవితమొక అద్భుతం🌻*


వైవిధ్యభరితమైన సకల జీవరాశి, ప్రకృతి, గ్రహరాశులు... ఇవి- విశ్వంలోని మహాద్భుతాలు. ఆకాశంలో ఏర్పడే హరివిల్లు, చెలియలికట్ట దాటి రాని సముద్రజలాలు, సూర్యకిరణంలోని ఏడు రంగులు... సాటిలేని అందమైన అద్భుత దృశ్యాలు.


మానవ శరీరం పంచభూత సమన్వితం. పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణవాయువులు, మనోబుద్ధి చిత్తాహంకారాలు, అవయవ నిర్మాణాకృతులు... ఇవన్నీ మహాద్భుత సృష్టిలోని అత్యద్భుతాలే.


మనిషి తనలోని శక్తిని పూర్తిగా వినియోగించుకుంటే అద్భుతాలను సృష్టించగలడు. ఆనందంగా నూరేళ్లు జీవించే నైపుణ్యాలు జీవన వికాసానికి అద్దం పడతాయి. చీకటినుంచి వెలుగులోకి ప్రయాణించే అద్భుత జీవనం అంటే అదేనని ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడతారు.


ఎవరూ పుట్టుకతోనే ప్రతిభా సంపన్నులు కారు. ఎదిగేకొద్దీ మానసిక పరిణతి, వివేకం, విచక్షణాజ్ఞానం అద్భుతాలు సృష్టిస్తాయి. అణువులో బ్రహ్మాండాన్ని చూడటమే అద్భుతం.


సంకల్పశక్తి, విశ్లేషణాశక్తి, సాధనాశక్తి- ఈ త్రిశక్తిధారణమే అద్భుతాలను సృష్టిస్తుంది. అద్భుతాలను సృష్టించేందుకు మాయలు, మంత్రాలు లేవు. కళ్లు మూసుకు కూర్చున్నంత మాత్రాన అద్భుతాలు జరిగిపోవు. కార్యరంగంలోకి యోధులై కదలనిదే అద్భుతాలు ఆవిష్కృతం కావు.


శ్రీమద్రామాయణంలోని సముద్రోల్లంఘన ఘట్టంలో చేష్టలుడిగి మిన్నకుండిపోయిన ఆంజనేయుడికి, అతడి నిజశక్తిని తెలిపారు వానర ప్రముఖులు. మారుతి సముద్రాన్ని దాటి సీతమ్మ జాడను కనుగొనడం, లంకాదహనం చేసి జానకి ఇచ్చిన చూడామణిని శ్రీరాముడికి సమర్పించడం, ప్రభు ఆలింగనాభాగ్యాన్ని పొందడం, సేతు నిర్మాణం చేయడం... తదితరాలన్నీ అద్భుత రస ఘట్టాలుగా నిలిచిపోయాయి.


తల్లిప్రేమతో తనను తరింపజేసిన యశోదమ్మకు, అంధుడైన ధృతరాష్ట్రుడికి తన అద్భుత విశ్వరూపాన్ని చూపి సౌజన్యమూర్తిగా భాసిల్లాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో తన విశ్వరూప ప్రదర్శనతో కిరీటిలోని అజ్ఞానాన్ని పోగొట్టి కర్తవ్యోన్ముఖుణ్ని చేశాడు.


ఆకాశంలో ఎక్కడో దూరంగా గిరికీలు కొడుతూ తిరిగే గరుడపక్షి భూమిపై తిరిగే కీటకాలను, పక్షి సంతతికి చెందిన అల్పజీవులను స్పష్టంగా చూడగలగడం- అద్భుతమైన దృష్టికి నిదర్శనం. ప్రగతి సాధకుడై మనిషి అంతరిక్ష రహస్యాలను శోధించడం, విజయాలు పొందడం- అత్యద్భుత మేధాసంపత్తికి సంకేతం.


జీవన గమనంలో కష్టనష్టాలను మౌనంగా, గంభీరంగా భరించడం, ఓటమిని హుందాగా స్వీకరించడం, అవమాన భారాలను సహించడం, కన్నీరు ఉబికి వస్తున్నా చిరునవ్వులు చిందించే మనోస్థైర్యాన్ని చూపడం- కోపతాపాలను జయించడం, కష్టమని తెలిసినా ప్రయత్నమే విజయానికి నాంది అంటూ సంకల్ప సిద్ధులు కావడం వంటివి ధీరగంభీరమైన వ్యక్తిత్వానికి నిదర్శనాలు. అవి జీవితాన్ని పండించే అద్భుత రసగుళికలు.


చిన్న విత్తనం మొలకెత్తి వటవృక్షమై శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. అల్పజీవి చీమ- తలకు మించిన భారాన్ని ఎప్పుడూ మోస్తూ శ్రమిస్తూ ఉంటుంది. అద్భుత రస సాకారాలకు ఇవి మంచి ఉదాహరణలు. ఎవరో ఫలానా రంగంలో అద్భుతాలు సృష్టించారంటూ చెప్పుకొని మురిసిపోవడం కాదు- తానే అద్భుతాల సృష్టికి కేంద్రమని ప్రతి మనిషీ గ్రహించాలి. ఏదీ అద్భుతం కానట్లు యాంత్రికంగా జీవించడం జీవితం అనిపించుకోదు. సృష్టి యావత్తు చైతన్య స్వరూపమే అన్న జ్ఞానంతో ప్రతి విషయమూ ఓ అద్భుతమే అన్నట్లు జీవించడమే జీవితం అని అందరూ తెలుసుకోవాలి.


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

కామెంట్‌లు లేవు: