శ్లో𝕝𝕝 *షడ్ దోషాః పురుషేణేహ*
*హతవ్యా భూతిమిచ్ఛతా!*
*నిద్రా తన్ద్రా భయం క్రోధః*
*ఆలస్యం దీర్ఘసూత్రతా!!*
*నీతిశాస్త్రమ్*
*భావము* : ఏ మనిషైనా తాను ప్రతిపనిలోనూ సిద్ధిని సాధించి సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపుని పొందాలంటే సహజంగా తనని పట్టి ఉన్న ఆరు దోషాలను విడిచిపెట్టాలి. అవి:
1. *నిద్ర* : యుక్తసమయములలో కాకుండా అయుక్తసమయములలో నిద్రను పొందడం లేదా తనకి వినోదాన్ని కలిగించే విషయాలలో నిద్రను విడిచిపెట్టి తన జీవితాన్ని బాగుపరచే విషయాలలో నిద్రను పొందడం లాంటి దుఃస్వభావం ఒకదోషం.
2. *తంద్ర* : తంద్ర అంటే చేయవలసిన పనులను వాయిదా వేసుకుంటే ఆపనిని సాధించలేని స్థితికి దిగజారడం.
3. *భయం* : చేయవలసిన పనిని ఆశతో చేపట్టి ఇది నాకు సాధ్యమౌతుందా? నన్నెవరైనా దీనివిషయంలో తప్పు పడతారేమో? అనే శంకలతో ఏర్పడేది భయం. అటువంటి భయం మనలోని ధైర్యాన్ని ఉత్సాహాన్ని నాశనం చేసి మనకి వైఫల్యాలనే మిగిల్చి పెడుతుంది.
4. *క్రోధః* : మనం అనుకున్న పనులన్నీ మనం అనుకున్నట్లే జరగాలి అనేది మూర్ఖభావం. ఈ స్వభావం గలవారు తాము చేపట్టే పనుల విషయంలో అత్యాశకు లోనౌతారు. ఒకవేళ ఆ పని తామనుకున్నట్లు జరగకపోతే కోపాన్ని పెంచుకుని ఆలోచించకూడని ఆలోచనలతో చేయకూడని పనులతో తమని తామే అన్నివిధాలుగా నాశనం చేసుకుంటారు. (క్రోధస్వభావులకు సహనమే పరిష్కారం)
5. *ఆలస్యం* : ఆలస్యం అంటే సోమరితనం. తనలో శక్తీ ఉన్నా దానిని దాచుకుని శక్తిహీనునివలె తనను ప్రకటించుకుంటూ చేయవలసిన పనులను విడిచిపెట్టడం ఒకదోషం.
6. *దీర్ఘసూత్రత* : ఒక పనిమీదే నిరంతరం దృష్టిపెట్టి చేయవలసిన ఇతర ఆలోచనలపై గాని ఇతరకార్యములపై గాని దృష్టి పెట్టకపోవడం ఒక దోషం. ఇలా ఒకే విషయాన్ని పొడిగించి పొడిగించి ఆలోచించేవాడు ఏ సిద్ధిని సాధించలేడు.
*ఈ ఆరుదోషాలను ఎవరైతే సద్విచారణతో తొలగించుకుని కర్తవ్యోన్ముఖులౌతారో వారినే లక్ష్మీదేవి వరించి సకలసిద్ధులను ప్రసాదిస్తుంది*...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి