🍁పండుగలప్పుడో, పర్వదినాల్లోనో, లేకపోతే తమకు ప్రత్యేకమైన పెళ్లి రోజో, పుట్టిన రోజో... గుడికి వెళ్తుంటారు చాలామంది. ముందుగా అనుకుని ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు వెళ్లడమూ చేస్తుంటారు. అలా వెళ్లొచ్చాక తమ సన్నిహితులతో అక్కడి విషయాలను పంచుకుంటూ ఫలానా సందర్భంలో మేం అక్కడికి వెళ్లాం, ఆ దేవుణ్ని దర్శించుకున్నాం, ఆయనకి కిరీటాన్ని సమర్పించాం, అమ్మవారికి బంగారు నగలు చేయించాం లేకపోతే అన్నదాన నివేదన చేశాం, మొక్కు చెల్లించాం... అంటూ చెబుతుంటారు. తమ స్వయంకృషితో సంపాదించిన సంపదనుంచి ఇవన్నీ చేస్తున్నట్లుగా భావిస్తారు భక్తులు. నిజానికి ఇదంతా భగవంతుడి అనుగ్రహంతో తమకు కలిగిందనీ, ఆయన సృష్టించిన సంపదేననీ తెలుసుకోలేరు.
🍁అసలు నివేదన అంటే ఏంటి? దేనిని అంటారు? సాధారణంగా భక్తులు భగవంతుడికి సమర్పించే వాటిలో పాలు, పండ్లు, చక్కెర మొదలైన ద్రవ్యాలు ఉంటే దాన్ని సామాన్య నివేదన అంటారు. పంచ భక్ష్య పరమాన్నాలు నైవేద్యంగా సమర్పిస్తే దాన్ని మహానివేదన అంటారు. కానీ ఈ ద్రవ్యాలన్నీ ప్రకృతి ద్వారా భగవంతుడు మనకిచ్చినవే, అవే తిరిగి మనం ఆయనకే సమర్పిస్తున్నాం. వాస్తవానికి నివేదన అంటే భక్తితో, ప్రీతితో భగవంతుడికి సమర్పించడం లేదా అర్పించడం. భగవంతుడికి ఏం సమర్పించాలి? ఏం అర్పించాలి? అని మళ్లీ ప్రశ్నించుకుంటే... నీ దగ్గర ఉన్నది, నీకు మాత్రమే చెందినది నివేదన చెయ్యాలి. మరి మన దగ్గర ఉన్నది అంతా ఆ పరమాత్ముడికి చెందిందే, ఆయన ఇచ్చిందే అయినప్పుడు ఇక నివేదన చెయ్యడానికి మన దగ్గర ఏం మిగిలింది... అన్న ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానమే ఆత్మనివేదన.
🍁నవవిధ భక్తి మార్గాల్లో తొమ్మిదోది, చివరిది, పవిత్రతను కలిగించేది... ఆత్మనివేదనా భక్తి. అంటే, భక్తుడు భగవంతుడి దారిలో నడవడం. తనని తాను భగవంతుడికి సమర్పించుకోవడం. మిగిలిన ప్రాణం లేని పదార్థాల మాదిరిగా మనిషి శరీరం ఒక జడపదార్థం కాదు కదా. పంచేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో నిర్మితమైన ఈ శరీరాన్ని భగవంతుడికి సమర్పించుకోవడం ఎలా సాధ్యం అంటే... 'నాదేమీ లేదు... అంతా నీదే, అన్నింటా నువ్వే, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ని.... నువ్వు ఇచ్చిన ఈ శరీరంతో నువ్వు సూచించిన మార్గంలో నడుస్తూ నీ సేవ చేస్తాను...' అనుకోవాలి. శారీరక మానసిక వాంఛలను, ఆకాంక్షలను, బంధాలను తృణప్రాయంగా భావించాలి. ఎటువంటి కర్మఫలాపేక్ష లేకుండా త్రికరణశుద్ధిగా కర్మలను ఆచరించాలి. నిరంతరం పరమాత్ముణ్నే స్మరిస్తూ, సేవిస్తూ, తనని తాను తెలుసుకుంటూ తనలోని ఆత్మను తెలుసుకోవాలి. ఆ ఆత్మ ద్వారా పరమాత్మ ఉనికిని గ్రహిస్తూ, ఆయనకు దగ్గరవుతూ, సకల చరాచర సృష్టిలో దైవాన్ని దర్శిస్తూ అందరి హితాన్ని కోరుతూ జీవించడమే భక్తుడు భగవంతుడికి సమర్పించే ఆత్మనివేదన.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి