15, జులై 2025, మంగళవారం

18-47-గీతా మకరందము

 18-47-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అII స్వధర్మాచరణము చాల ఉత్తమమైనదని వచించుచున్నారు -


శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ | 

స్వభావనియతం కర్మ 

కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ || 


తా:- తనయొక్క ధర్మము (తన అవివేకముచే) గుణములేనిదిగ కనబడినను (లేక, అసంపూర్ణముగ అనుష్ఠింపబడినను) చక్కగా అనుష్ఠింపబడిన ఇతరుల ధర్మముకంటె (లేక, ఇతర ధర్మములకంటె) శ్రేష్ఠమైనదే యగును. స్వభావముచే ఏర్పడిన (తన ధర్మమునకు తగిన) కర్మమును చేయుచున్నయెడల మనుజుడు పాపమును పొందనేరడు.


వ్యాఖ్య:- స్వకీయకర్మ, లేక తన ధర్మము ఆచరించుట ఒకింత కఠినమైనను, తేలికగా ఆచరింపబడినట్టి ఇతరుల కర్మను గ్రహించుటకంటె అది ఎంతయో మేలని చెప్పబడినది. కావున నిజధర్మమును ఒకింత కష్టమైనను వదలరాదు. స్వకీయకర్మను పైశ్లోకమందు తెలుపబడిన చందమున ఈశ్వరార్పణబుద్ధితో చేసినచో మనుజుడు పాపమును బొందకుండును.

(లేక, ఇచట స్వధర్మమనగా ఆత్మకు సంబంధించిన ధర్మమనియు చెప్పవచ్చును. ఆత్మచింతనాదులు, ఆత్మధ్యానాదులు ఒకింత ప్రయాసముగా తోచినను, పరధర్మములైన దృశ్యవస్తుధర్మములను, లేక, దృశ్యవస్తుచింతనమును గ్రహించుటకంటె ఎంతయో మేలైనవి. ఆత్మచింతనాదులు (స్వధర్మము) ప్రారంభమున ఒకింత కష్టముగ తోచినను తుదకు అనంత సౌఖ్యమును ప్రసాదించును. దృశ్యవస్తువులు (పరధర్మము) ప్రారంభమున సుఖవంతములుగ తోచినను తుదకు పరమదుఃఖమునే కలుగజేయును. కావున పరధర్మముకంటె స్వధర్మమే మేలని చెప్పబడినది).


ప్ర:- జీవునకు ఏ కర్మము, ఏ ధర్మము శ్రేష్ఠమైనది?

ఉ:- ఒకింతకష్టముగా తోచినను స్వకీయకర్మమే శ్రేష్ఠమైనది.

ప్ర:- దేనిచే మనుజుడు పాపమును బొందకుండును?

ఉ:- స్వభావముచే ఏర్పడిన కర్మమును, స్వధర్మమును (ఈశ్వరార్పణబుద్ధితో) చక్కగ నాచరించినపుడు పాపమును బొందకుండును.

కామెంట్‌లు లేవు: