*తిరుమల సర్వస్వం -301*
చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-16
ఆలయాన్ని కంఠహారం లా చుట్టి ఉన్న శేషాచల పర్వతసానువుల్లో- సుమారు లక్ష మంది యానాదులుగా పిలువబడే ఆటవిక తెగ వారు సంచారం జీవనం సాగించేవారు. వారు పోడు వ్యవసాయం, పశుపోషణ చేస్తూ లక్క, ఎర్రచందనం, తుమ్మబంక, కందమూలఫలాలు, వనమూలికలు, కుంకుడు కాయలు, తేనె, ఏనుగు దంతాలు, పులిగోర్లు, జింకచర్మాలు, కొమ్ములు వంటి ఆటవిక ఉత్పత్తులను భక్తులకు, మైదాన ప్రాంతవాసులకు నగదు మరియు వస్తుమార్పిడి రూపంలో అమ్మడం ద్వారా జీవనం సాగించేవారు. వారు కూడా శ్రీనివాసుణ్ణి తమ ఇలవేల్పుగా, పెరట్లోని పెన్నిధిగా భావించి, తరచూ దర్శించు కునేవారు. కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో సమూహాలుగా ఆలయానికి వచ్చి - తమదైన శైలిలో నృత్యగానాలతో అర్చనాదికాలు గావించి, అటవీ ఉత్పత్తులను కానుకలుగా సమర్పించుకునే వారు. కాలక్రమేణా రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందడం, కొండవాలుల్లో జనావాసాలు ఏర్పడడం, ఆలయ నిర్మాణాలు అనూహ్యస్థాయిలో విస్తరించడం, అటవీ ఉత్పత్తులకు గిరాకీ సన్నగిల్లడం, ప్రత్యామ్నాయ జీవనోపాధి సులభంగా లభించడం మొదలగు కారణాలు వల్ల ఆ సంచార జాతులవారు సుదూర ప్రాంతాలకు తరలి పోయారు. ప్రస్తుతం శేషాచల శ్రేణులపై గిరిజనుల ఉనికి నామమాత్రం గానే ఉంది.
గగనాన్ని చుంబించే పర్వత పంక్తులన్నీ కఠిన శిలలతో, అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులతో, జలజలా పారే సెలయేళ్ళతో, శరవేగంగా దుమికే జలపాతాలతో, అంతు చిక్కని అగాధాలతో, గుంపులు గుంపులుగా తిరుగుతూ ఘీంకరించే గజరాజులతో, అంధకార బంధురంగా ఉండే గుహలతో నిండి ఉండేవి. మానవమాత్రులకు దుర్భేద్యంగా ఉండే ఆ గుహల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, సివంగులు వంటి క్రూరమృగాలు నివసించేవి. కొన్నింటిలో కొండజాతి ప్రజలు తమ పెంపుడు జంతువులతో సహజీవనం చేసేవారు. అలాంటి ఒకానొక గుహ నుండి శ్రీశైలం, అహోబిలం క్షేత్రాలకు బిలమార్గం ఉండేదని ప్రతీతి. కానీ ఎవరూ ఆ మార్గం ద్వారా ప్రయాణించే సాహసానికి పూనుకోలేదు.
ఆ రోజుల్లో నాగపాతాళ నాయకుడనే ఔత్సాహికుడు బ్రాహ్మణబృందం తోనూ, రక్షకదళం తోనూ వచ్చి శేషాచల పర్వతాల నడుమ నున్న లోయల్లోనూ, దట్టంగా అలుముకున్న కీకారణ్యాల లోనూ యుగాల పర్యంతం అలరారుతున్న తీర్థాలను అన్వేషించే సాహసానికి ఒడిగట్టగా - వారిని దేవభటులు అడ్డగించారని, దాంతో వారందరూ విగతజీవులై పోయారని ఒక కథనం జనబాహుళ్యంలో విస్తృతంగా ప్రచారంలో ఉండేది. ఈ వృత్తాంతం - దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అత్యుత్సాహంతో కొండకోనల్లోకి వెళ్ళే దుస్సాహసం చేసి, ప్రాణాంతకమైన ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా నివారించడంలో సహాయపడేది.
దాదాపు అర్ధశతాబ్దం పాటు క్రైస్తవ పాలకుల అధీనంలో ఉన్న తిరుమలక్షేత్ర పాలనాపగ్గాలు - శ్రీవారి పరమభక్తుడైన హాథీరామ్ బావాజీ వారసులైన మహంతులకు దఖలు పడ్డాయి.
మహంతుల నిర్వహణలో తిరుమల ఆలయం
--------------------------------------
ఈ విషయాన్ని చెప్పుకునే ముందు, ఆలయ అజమాయిషీ - ఈష్ట్ ఇండియా కంపెనీ వారి నుండి మహంతుల చేతిలోకి ఎందుకు, ఎలా వచ్చిందో పరిశీలిద్దాం...
పరాయి చెరనుండి ఆలయానికి విముక్తి
------------------------------
హిందూ దేవాలయాల, ధార్మిక సంస్థల - మరీ ముఖ్యంగా, కుల వర్గ ప్రాంతీయ బేధాల కతీతంగా హిందువులందరూ ఆరాధించే తిరుమల ఆలయ - వ్యవహారాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి జోక్యం మితిమీరడంతో; హిందూ సాంప్రదాయ వాదుల్లో తీవ్రమైన అసంతృప్తి ప్రబలింది. క్రమంగా - వారి సహనం హద్దులు దాటి, బ్రిటీష్ ప్రభుత్వంపై వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా వేగంగా విస్తరించడంతో; ముందుచూపు కలిగిన, వివేకవంతులైన కొందరు బ్రిటిష్ అధికారులు కళ్ళు తెరిచారు. లండన్ లోనూ, కలకత్తా లోనూ ఉన్న ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారులకు అనేక రహస్య నివేదికలు పంపారు. ఈ వ్యవహారాన్ని తెగే వరకు లాగవద్దని, తిరుమల ఆలయ వ్యవహారాలలో అలవి మాలిన జోక్యం పనికిరాదని సందేశాలు ఇచ్చారు. ఇండియా లోని గవర్నర్ జనరల్ కు - దాదాపుగా అన్ని హిందూ మరియు మహమ్మదీయ ధార్మిక సంస్థలకు సంబంధించి ఇలాంటి నివేదికలే అందాయి. వాటన్నింటిని సమీక్షించిన ఆంగ్లేయ పాలకవర్గం - భారతదేశంలోని అన్ని మతపరమైన సంస్థలలో క్రమంగా జోక్యం తగ్గించుకోవాలని తీర్మానించింది. తదనుగుణంగా, అప్పుడు తిరుమల దేవాలయం యొక్క వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకు - ఆలయ నిర్వహణ విధుల నుండి తప్పుకొని; ఆ బాధ్యతను తగిన వ్యక్తులకు గానీ, వ్యవస్థకు గానీ అప్పగించ వలసిందిగా తాఖీదు అందింది.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి