*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము*
*438 వ రోజు*
*అశ్వత్థామకు భూతం ఎదురు వచ్చుట*
రథికత్రయం పాండవశిబిరాల వైపు వేగంగా కదినారు. అశ్వత్థామ అతి వేగంగా తన రథమును నడుపసాగాడు. కృతవర్మ, కృపాచార్యులు కొంచం వెనుక పడ్డారు. అప్పుడు ఒక భూతం అశ్వత్థామ ఎదుట నిలిచింది. అశ్వత్థామ ఆ భూతానికి బెదరక దాని మీద అస్త్రప్రయోగం చేసాడు. వాటిని అన్నింటిని ఆ భూతం నోరు తెరచి మింగింది. అశ్వత్థామ వద్ద ఉన్న అస్త్రములు అన్నీ అయిపోయాయి. అశ్వత్థామకు ఏమీ చేయాలో తోచక కత్తి తీసుకుని ఆ భూతమును ఎదుర్కొన్నాడు. ఆ కత్తి ఆభూతమును తాకగానే మాడిపోయింది. అశ్వత్థామ తన వద్ద ఉన్న తోమరములు, చక్రాయుధములను ఆ భూతము మీదకు విసిరాడు. అవన్నీ ఆభూతమునకు తాకగానే తునాతునకలు అయ్యాయి. అశ్వత్థామ తన గదను ఆ భూతము మీదకు విసిరాడు. ఆ భూతం ఆ గదను మింగింది. వెనకకు తిరిగి చూసాడు కృతవర్మ, కృపాచార్యుడు కను చూపు మేరలో లేరు. కృపాచార్యుడి మాట వినక ముందుకు దూకినందుకు తనకు తగిన శాస్తి జరిగింది అని చింతించాడు. గోవులను, బ్రాహ్మణులను, బాలురను, వృద్ధులను, అంధులను, మిత్రులను, సఖులను, తోబుట్టువులను, జడులను, ఏమరుపాటున ఉన్న వారిని, నిద్రిస్తున్న వారిని, ఆడువారిని అస్త్రశస్త్రములతో కొట్టడం మహా పాపం. అది ధర్మవిహితం కాదని పెద్దలు చెప్తారు. అట్టి ధర్మమార్గం విడిచి అసుర మార్గం అవలంబించిన వారికి కార్యసిద్ధి కలుగదు. బ్రాహ్మణుడిగా పుట్టి ఇట్టి అపనిందలకు గురి కాగల కార్యమూ నేను చేయవచ్చునా ! అందుకేనేమో నాకు ఈ భూతం దాపురించింది. నాకిక ఎవరు దిక్కు " అని చింతించాడు.
*అశ్వత్థామ ఈశ్వరుడిని ధ్యానించు*
చివరకు అశ్వత్థామ ఈ సమయంలో నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు. అని అచంచలమైన మనసుతో అశ్వత్థామ పరమేశ్వరుడిని ధ్యానించాడు. ఈశ్వరా ! నేను ఈ గండం గడచి గట్టెక్కిన నిన్ను నానా భూతోపహారములతో కొత్తవిధంగా అర్చిస్తాను. నీకు ప్రీతి కలిగిస్తాను " అని అనేక స్తోత్రములతో శివుని ప్రార్థించాడు. అప్పుడు అశ్వత్థామ ముందు ఒక బంగారు వేదిక కనపడింది దాని మీద అగ్నిగుండం మండుతూ ఉంది. ఆ అగ్ని నుండి అనేక ఆకృతులతో ప్రథమగణాలు బయటకు వచ్చాయి. వాటికి అశ్వత్థామ భయపడ లేదు. అతడి మనసు ఈశ్వరుడి మీద లగ్నమై ఉంది. ఎంతకీ ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. తన విల్లంబులతో ఆ అగ్ని గుండంలో దూకబోయాడు అశ్వత్థామ కాని తనను దహించుటకు సరిపోయిన అగ్ని ప్రజ్వరిల్ల లేదు. అశ్వత్థామ తన విల్లు, అమ్ములు, అస్త్రములు, శస్త్రములు, బాణములు, అనేక విధములైన ఆయుధములు వేసి అగ్నిని చక్కగా ప్రజ్వలింప చేసాడు. అశ్వత్థామ పరమేశ్వరా ! నాకు ఏమిచేయాలో తోచడం లేదు. నా శత్రువులను చంపే బలం, శక్తి ప్రసాదించు లేని ఎడల నేను ఆత్మబలిదానం చేసుకుంటాను అని హర హర మహాదేవ " అంటూ మంటలలో దూకబోయాడు. అప్పుడు అశ్వత్థామకు ఈశ్వరుడు ప్రత్యక్షమై " అశ్వత్థామా ! ఆగు నీ భక్తికి అకుంఠిత దీక్షకు ఆనందించాను నీవు కోరినవరం ఇచ్చాను. కాని ఒక్క మాట నేనూ విష్ణాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడూ ఒక్కటే . కృష్ణుడు నన్ను పూజిస్తాడు, కృష్ణుడంటే నాకు ఇష్టం, ఆ కృష్ణుడి మీద గౌరవంతో నేను నిన్ను పాండవ శిబిరముల వైపు పోకుండా ఆపాను. నీ మనసులో మాట తెలుసుకోవాలని నేను ఇన్ని ఆటంకాలు కల్పించాను. ఇంతెందుకు ఆ పాంచాలురకు పోగాలము దాపురించింది. ఈ రోజు వారు నీ చేతిలో చస్తారు, ఇదిగో ఈ ఖడ్గంతో వారిని సంహరించు " అని ఈశ్వరుడు ఒక మహనీయమైన ఖడ్గం అశ్వత్థామకు ఇచ్చి తాను కూడా అశ్వత్థామకు తెలియకుండా అతడిలో ప్రవేశించాడు. అశ్వత్థామలో నూతనోత్సాహం, ధైర్యం, తెగింపు ఉద్భవించాయి. తన రథం దగ్గరకు వెళ్ళగానే తాను అగ్నిలో వేసి దహించిన ఆయుధములు, అస్త్రములు, శస్త్రములు యదాతధంగా రధములో ఉన్నాయి. అశ్వత్థామ రథం మీదకు ఎక్కాడు. ఇంతలో కృపాచార్యుడు, కృతవర్మ వచ్చి చేరారు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి