15, జులై 2025, మంగళవారం

అయిదు ప్రశ్నలకు

 ఈ అయిదు ప్రశ్నలకు 

సరైన జవాబులు వెతికి పట్టుకోగలవాడే జ్ఞానవంతుడు. 


ఆ జవాబులకు తగినట్టుగా 

జీవించటమే బుద్ధిమంతుడి లక్షణం. 


1 నేనెవరు, 

2 నా లక్ష్యం ఏమిటి, 

3. ఈ లక్ష్యం చేరేది ఎలా, 

4 మార్గం ఏమిటి, 

5 వీటికి విరోధి ఎవరు? 


ఈ ప్రశ్నపంచకాన్ని అర్థపంచకం అంటారు. 


మొదటి ప్రశ్న సమాధానంపై మిగతా నాలుగు ప్రశ్నల జవాబులు ఆధారపడి ఉంటాయి.


నేను జీవుడిని, నాకు ఆధారం దేవుడు. నేను అస్వతంత్రుడిని, భగవంతుడు సర్వస్వతంత్రుడు అన్న ఎరుక కలగటమే తొలి ప్రశ్నకు జవాబు. 


మనం ఏమిటన్నది మొదట తెలుసుకోవటం 

స్వరూప జ్ఞానం. జీవుడినైన నేను దేవుడికి దూరమయ్యాను, తిరిగి చేరువ కావటం నా లక్ష్యం అన్నది రెండో ప్రశ్నకు జవాబు. ఇది ఫలస్వరూప జ్ఞానం.


ఈ లక్ష్యం భగవంతుడి అనుగ్రహంవల్లే నెరవేరాలి. మార్గదర్శనం చేయించగల సమర్థుడు... ఆయనను నమ్మి మనస్ఫూర్తిగా ఆదుకొమ్మని ఆకాంక్షిస్తే, ఏదో ఒక దారి కనిపించకపోదు. 


అది కర్మ కావచ్చు, 

భక్తి కావచ్చు, 

జ్ఞానం కావచ్చు. అర్హతకు తగిన మార్గం తప్పకుండా కనిపిస్తుంది. ఇది పరస్వరూప జ్ఞానం.


మార్గం అంటే ఉపాయం. 


ఏ మార్గంలో ఎలా వెళ్లాలో ముందుగా ఆలోచించి, అడుగు వేయడం చాలా అవసరం. చిత్తశుద్ధి, ఏకాగ్రబుద్ధి కలిగి, చేపట్టిన పనులు చేస్తే భగవంతుడు మెచ్చుతాడు. కృష్ణార్పణంగా చేసే కర్మలే నిష్కామ కర్మలు.


 ‘కర్మ నీ వంతు, ఫలితం నా పూచీ’ అని కృష్ణుడు చెప్పనే చెప్పాడు. నదులన్నీ సముద్రంలో చేరే చందాన ఆ కర్మలు మోక్ష ద్వారానికి దారి తీస్తాయి, దగ్గరికి చేరుస్తాయి. 


ఈ దారిలో ఎదురుపడే విరోధులు ఎవరు? 


అహంకార 

మమకారాలు, 

రాగద్వేషాలు, 

స్వపర భేదాలు. వీరందరూ ఇంటి దొంగలు. 


మనలోని అజ్ఞానపు చీకటి గది వీరి నివాసం. 


యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు సాధనా రూప దీపాలు. వీటి వల్ల మనసుకు పట్టిన మకిలి దూరం అవుతుంది. మనసు నిలకడ ధారణ. తైల ధారలా సాగే మనోయానమే ధ్యానం. ధ్యానం పరాకాష్ఠ చెందడమే సమాధి. విరోధిని అధిగమించిన సమాధి అయిదో ప్రశ్నకు సమాధానం. అదే స్వస్వరూప జ్ఞానం. 


అంటే స్వతహాగా మనం అజ్ఞానులమని తెలుసుకోవటం. అజ్ఞానం తొలగితే అంతా జ్ఞానమయమే. 


శరణాగతికే మరో పేరు ఉపాయ స్వరూప జ్ఞానం.


భారత, 

భాగవత, 

రామాయణాలు జ్ఞాన భాండారాలు. నిత్యపారాయణ గ్రంథాలు కూడా. మనమేమిటో, మన స్వరూప, స్వభావాలు ఎలాంటివో, ఏ విధంగా మనం మన జీవితాలను మలచుకోవాలో, సర్వగమ్యమైన జీవిత పరమార్థం ఎలా సాధించాలో... వీటికి తగిన సమాధానాలు వాటిలో ఉన్నాయి. 


భారతం అంటే స్థూల శరీరం. 

భాగవతం సూక్ష్మశరీరం. 

రామాయణం కారణ శరీరం. 


భారతం చదివి మానవుడిగా, 

భాగవతం చదివి దేవుడిగా, 

రామాయణం చదివి ఆదర్శ మానవుడిగా మెలగటం నేర్చుకోవాలి. 


నేర్చినది జీవితానికి అనువదించాలి లేక ఆచరించాలి. అందుకే వ్యాస వాల్మీకులు వేదసారాన్ని సులభ సుందరంగా అక్షరానువాదం చేసి మనకు నిత్య సంసేవనంగా అందజేశారు. ఇహం లేనిది పరం దక్కదు. కర్మ చేయక జ్ఞానం దొరకదు. కర్మ జ్ఞానాలు భక్తిలో ఊరితేగాని పరిపూర్ణం కావు. 



ప్రతి మనిషిలో మూడు భాగాలున్నాయి. 


ఒకటి పశు భాగం. 

రెండోది ప్రాణ భాగం. 

మూడోది ఆత్మ భాగం. 


శరీరం, ప్రాణం, ఆత్మ... ఈ మూడూ మనుగడకు, అస్తిత్వానికి ఆధారభూతాలు.


 ‘నేను జీవుడిని... నాకు ఆధారం ఆ దేవుడు’ అన్న మొదటి సమాధానమే భవ్య దివ్య జీవన సంవిధానానికి మూలాధారం.

కామెంట్‌లు లేవు: