23, జులై 2025, బుధవారం

18-57-గీతా మకరందము

 18-57-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII సమస్త కర్మములను భగవదర్పణముచేసి చిత్తమును సదా ఆ పరమాత్మ యందే నెలకొల్పవలెనని వచించుచున్నారు -


చేతసా సర్వ కర్మాణి 

మయి సన్న్యస్య మత్పరః |  

బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తస్సతతం భవ || 


తా:- సమస్త కర్మములను (కర్మఫలములను) వివేకయుక్తమగు బుద్ధిచేత నాయందు సమర్పించి, నన్నే పరమప్రాప్యముగా నెంచినవాడవై చిత్తైకాగ్రతతో గూడిన తత్త్వవిచారణను (లేక ధ్యానయోగమును) అవలంబించి ఎల్లప్పుడు నాయందే చిత్తమును నిల్పుము.


వ్యాఖ్య:- “చేతసా” - శరీరముతో సమస్తకర్మలు చేయుచున్నను మనస్సుతో ఆ కర్మలన్నిటిని, భగవంతునికే అర్పించి వారియందే మనస్సును సంలగ్న పఱచవలెను. “చేతసా” అని చెప్పుటవలన కర్మఫలసన్న్యాసమే ఇట బోధింపబడినది కాని కర్మసన్న్యాసము కాదు. శరీరము నిశ్చలముగానుండి ఏ కర్మచేయకున్నను మనస్సు ప్రపంచములో తిరుగుచున్నచో దానివలన ఇసుమంతైనను ప్రయోజనములేదు. అట్లు కాక, శరీరముతో అనేక కర్మలు చేయుచున్నను మనస్సుతో ఆ కర్మలను, కర్మఫలములను ఈశ్వరార్పణముగావించినచో అది మోక్ష హేతువగును. కనుకనే ఇచట "చేతసా” (చిత్తముతో) అని చెప్పబడినది.

    “బుద్దియోగమ్” - ప్రీతితో భక్తిపూర్వకముగ తనను భజించువారికి “బుద్ధియోగము" నొసంగెదనని 10వ అధ్యాయమున భగవానుడు తెలిపియుండిరి. (దదామి బుద్ధియోగం తమ్). అనగా చిత్తైకాగ్రత, తత్త్వవిచారణాశక్తి ఆతనికి భగవత్కృపచే కలుగును. అద్దానిని లెస్సగ నాశ్రయించి నిరంతరము చిత్తమును ఆ పరమాత్మయందే నెలకొల్పుమని యిట చెప్పబడినది. " సతతమ్" అని వచించుటవలన ఏ కాలమందును దైవవిస్మృతి కలుగనీయక నిరంతరము చిత్తము ఆత్మయందే (దైవమందే) యుండులాగున ప్రయత్నించవలసియున్నది. ఏలయనిన, మాయ జీవుని పడగొట్టుటకు కాచుకొనియున్నది. అతడేమాత్ర మొకింత అజాగ్రతగనున్నప్పటికిని అది యాతని నావరించివైచి తమస్సులో (అజ్ఞానములో), విషయసుఖములలో పడవేయుటకు సిద్ధముగ నున్నది. కావున సాధకులు ‘సతతమ్’ అను ఈ పదమును జ్ఞప్తియందుంచుకొని దైవవిస్మృతి ఏ మాత్రము కలుగకుండులాగున చూడవలెను. 

        ‘మత్పరః’ - ప్రపంచమందలి సమస్త దృశ్యపదార్థములు నశ్వరములు. కావున విజ్ఞుడగువాడు శాశ్వతుడగు ఒక్క పరమాత్మనే పరమగమ్యముగ, పరమప్రాప్యముగ నెంచుకొనవలెను.


ప్ర:- పరమాత్మను పొందుటకై జీవుడేమి చేయవలెను?

ఉ:- (1) చిత్తముతో సమస్తకర్మలను భగవంతున కర్పించవలెను. 

     (2) వారినే పరమప్రాప్యముగ నెంచుకొనవలెను. 

     (3) బుద్ధియోగమును (చిత్తైకాగ్రతాపూర్వకవిచారణను) లెస్సగ నవలంబించవలెను. 

     (4) భగవంతునియందే నిరంతరము చిత్తమును సంలగ్న మొనర్పవలెను. 

ప్ర:- భగవానుడు కర్మసన్న్యాసమును బోధించెనా , కర్మఫలసన్న్యాసమునా ?

ఉ:- ‘చేతసా’ (చిత్తముతో సమస్త కర్మలను భగవంతునకర్పించి) అని చెప్పుటవలన శరీరముతో కర్మలను చేయుచున్నను, మనస్సుతో వానివాని ఫలములను ఈశ్వరార్పణము గావించవలెననియే బోధింపబడినదగును. కావున కర్మఫలసన్న్యాసమే ఇట వివక్షితముగాని కర్మసన్న్యాసముగాదు . 

ప్ర:- మనుజుడు దేనిని పరమప్రాప్యముగ నెంచుకొనవలెను? ఎందుచేత?

ఉ:- పరమాత్మను; వారు శాశ్వతులుకనుక. 

ప్ర:- నిరంతరము చిత్తము దేనియందు సంలగ్నమై యుండవలెను?

ఉ:- పరమాత్మయందు.

కామెంట్‌లు లేవు: