*తిరుమల సర్వస్వం -309*
ఆవిర్భావ పరమార్థం-4
భృగుడంతటి తపస్సంపన్నుడు, జ్యోతిష్యశాస్త్రాన్ని ఔపోసన పట్టి భృగు సంహిత అనే మహద్గ్రంథాన్ని లోకానికి అందించిన ద్రష్ట - సంయమనం కోల్పోయి తాను జీవితాంతం ఆరాధించిన శ్రీహరిపై పాదప్రహారం చేయడమేమిటి?
సదా విష్ణువు వక్షఃస్థలం లోనే వసిస్తూ, సర్వం తెలిసిన శ్రీమహాలక్ష్మి సఖునిపై అలకబూని భూలోకానికి పయనమవ్వడ మేమిటి?
రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని భకవద్గీత ద్వారా విశ్వమానవాళికి బోధించిన, స్థితప్రగ్జ్నుడైన శ్రీహరి - సతీవియోగంతో వ్యాకులచిత్తుడై అమ్మవార్ని అన్వేషించడానికి వైకుంఠాన్ని వీడి సప్తగిరులపై కాలు మోపడమేమిటి?
ఇవన్ని శ్రీహరి చిత్త సంకల్పాలే కదా!
ఈ విధంగా - శ్రీహరి పూర్వపు యుగాల్లో ఇచ్చిన అభయాలను, వరాలను, వాగ్దానాలను నెరవేర్చడం కోసం; తపస్సంపన్నులు, పతివ్రతా శిరోమణుల శాపాలను నిష్ఫలం కాకుండా చూడడం కోసం - తిరుమల క్షేత్రాన్ని తన క్రీడాస్థలంగా ఎంచుకుని; తగిన నెపాన్ని తనంత తానుగా సృష్టించుకొని, ఆనందనిలయంలో అర్చామూర్తిగా వెలసి కోర్కెలు తీర్చే కొండలరాయడిగా వాసికెక్కారు.
అర్చారూపమే ఎందుకు?
పైన చెప్పుకున్నట్లు, శ్రీమహావిష్ణువు ఆదిలో అర్చామూర్తిగా అవతరించ లేదు. మొదట్లో మానవరూపధారియైన మాధవుడు, తదనంతరం అర్చామూర్తిగా వెలశాడు. దీనికి మూలకారణం తెలుసుకోవాలంటే వైఖానస ఆగమ సాయం తీసుకోవాలి.
పంచగుణాత్మకం..
వైఖానస ఆగమ శాస్త్రానుసారం పరమాత్ముడు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా రూపాలనే పంచగుణాత్మక రూపాలలో తన ఉనికిని చాటుకుంటాడు -
పర రూపమంటే పాలసముద్రంలో, శేశతల్పంపై శ్రీమహాలక్ష్మితో సపర్యలు అందుకుంటూ ఉండే కాలాతీత సచ్చిదానంద రూపం. ఈ రూపాన్ని కాంచాలంటే విష్ణ్వైక్యం చెందిన సిద్ధులకే తప్ప అన్యులకు సాధ్యం కాదు. దేవాధిదేవతలు కూడా దీనికి అతీతులు కారు.
వ్యూహ రూపమంటే సృష్టి, స్థితి, లయ అనే వ్యూహాలను రచించి, అమలు పరిచే నిర్గుణాత్మకమైన వ్యవస్థాగత రూపం. కావున ఈ రూపాన్ని దర్శించుకోవడం, అర్చించు కోవడం అసాధ్యం.
విభవ రూపమంటే మత్స్య, కూర్మ, వరాహాది దశావతారాలు మరియు శ్రీమద్భాగవతం లో ఉటంకించ బడిన అన్య అవతారాలు. ఆయా అవతార కార్యాలు సుసంపన్నమైన అనంతరం అవతార పరిసమాప్తి జరిగిపోతుంది కనుక, ఆ అవతారాలను ఈనాడు మనం దర్శించు కోలేము. త్రేతాయుగపు వాసులు శ్రీరామచంద్రుణ్ణి, ద్వాపరయుగ వాసులు కృష్ణుణ్ణి రక్తమాంసాలతో నేలపై నడయాడుతూ చూచారు కానీ, మనకా మహద్భాగ్యం లేదు.
అంతర్యామి అంటే సృష్టిలోని సమస్త చరాచర వస్తువులలో నిబిడీకృతమై ఉన్నట్టి ఆత్మ, పరమాత్మ లేదా అంతరాత్మ. ఆత్మావలోకనం చేసుకోగలిగితే భగవత్సాక్షాత్కారం సిద్ధించినట్లే. కానీ అది అంత సులభం కాదు. తనలో నున్న పరమాత్మను దర్శించుకో గలగటం తపస్సంనన్నులకే సాధ్యం.
ఇక మిగిలింది అర్చా రూపం. మన బోటి సాధారణ భక్తులు దర్శించుకో గలిగింది, కొలువ గలిగింది గుణాత్మకమైన అర్చారూపమే! విభవరూపానికే పరిమితమైతే అవతార కార్యం నెరవేరగానే అవతార పరిసమాప్తి చెందాలి. కానీ, కలియుగ వాసుల కడు దైన్యస్థితిని కాంచిన కరుణామయుడు - విభవరూపాన్నుండి అర్చారూపానికి పరివర్తన చెంది; శాశ్వతంగా కొండపై కొలువుండి దీనజనోద్ధరణకై కంకణం కట్టుకున్నాడు. అంతే కాదు, విస్తారమైన వైదిక కర్మలు సులభసాధ్యం కాని కలియుగంలో - సరళమైన పద్ధతుల్లో భక్తులు తనను అర్చించు కోవడానికి వీలుగా; విఖనసమహర్షి ద్వారా వైఖానస ఆగమాన్ని రచింప జేశాడు. ఆ వివరాలను విఖనసమహర్షి అధ్యాయంలో తెలుసుకుందాం.
దశావతారాలకు, కలియుగావతారానికి ఉన్న మరో ముఖ్య తారతమ్యం ఇదే! దీనికి అవతార పరిసమాప్తి అనే ప్రక్రియ లేనే లేదు. నిత్యసత్యము, నిరామయము, నిర్నిరోధము, నిత్యనూతనము అయిన ఈ అర్చారూపం సృష్టి, స్థితి, లయలకు అతీతంగా భాసిల్లుతుంది.
పైన క్లుప్తంగా తెలుపబడిన పౌరాణికాంశాలన్నీ ఆయా అధ్యాయాలలో విశదంగా, వివరించ బడ్డాయి. గమనించ గలరు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి