23, జులై 2025, బుధవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము*


*446వ రోజు*

*అర్జునుడు బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించుట*


కృష్ణుడు అర్జునుడిని చూసి " అర్జునా ! ఇది బ్రహ్మశిరోనామాస్త్రం. ఇది అత్యంత భయంకర మైంది. దీనికి సాటి మరియొకటి లేదు. దీనిని మరే అస్త్రం నిరోధించ లేదు. నీవు కూడా నీకు ద్రోణాచార్యుడు ప్రసాదించిన బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగించి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమును నిరోధించి నిన్ను నీ సోదరులను కాపాడుకో ! " అని తొందర పెట్టాడు. వెంటనే అర్జునుడు రధము దిగి తన గురువు ద్రోణాచార్యుని మనసులో తలచి గాండీవమును తీసుకున్నాడు. బ్రహ్మశిరోనామాస్త్రమును ఎక్కు పెట్టాడు. అర్జునుడు తనలో " ఈ మహాస్త్రమును నేను అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమును నిరోధించుటకు మాత్రమే ప్రయోగిస్తున్నాను. ఈ అస్త్రము వలన నాకు కాని, నా సోదరులకు కాని, గురుపుత్రుడు అశ్వత్థామకు కాని హాని కలుగకుండు గాక " అని ప్రార్ధించి అస్త్రప్రయోగం చేసాడు. అర్జునుడు ప్రయోగించిన అస్త్రం అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని నిరోధించ ప్రయత్నించింది. రెండు అస్త్రాలు ఒక దానిని ఒకటి ఢీ కొట్టడంతో సముద్రాలు పొంగాయి. ఆకాశం నుండి ఉల్కలు రాలాయి, భూమి కంపించింది, సూర్యుడు కాంతిని కోల్పోయాడు, ఆకాశం నుండి పిడుగులు పడ్డాయి, రాళ్ళ వర్షం పడుతుంది. ఈ ఉత్పాతాలు చూసి జనం భయంతో కంపించి పోతూ అటూ ఇటూ పరుగులెత్త సాగారు. ప్రజల ముఖాలలో ఆశ్చర్యాందోళనలు, భయం భీతి కనిపిస్తున్నాయి.



*నారదుడి రాక*



ఈ ఉత్పాదనలు చూసి నారదుడు పరుగు పరుగున వ్యాసుడి వద్దకు వచ్చాడు. నారదుడు వ్యాసుడితో కలిసి కృష్ణార్జునులు ఉన్న చోటుకు వచ్చి అర్జున అశ్వత్థాల మధ్య నిలిచి " ఓ అకల్మషులారా ! ఇంతకు ముందు ఎంతో మంది వీరులు, భుజబలసంపన్నులు, శూరులు ఈ పుడమి మీద జన్మించారు గతించారు. వారెవ్వరూ బ్రహ్మశిరోనామాస్త్రమును జనావాసాల మీద ప్రయోగించ లేదు. మీరెందుకు ఈ సాహసానికి ఒడి గట్టారు. " అని ఆడిగాడు వ్యాసుడు. అర్జునుడు వ్యాసుడు నారదులకు నమస్కరించి " ఓ మహాత్ములారా ! అశ్వత్థామ పాండవవంశ నిర్మూలనకై సంకల్పించి బ్రహ్మశిరోనామాస్త్రము ప్రయోగించాడు. శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు ఆ అస్త్రమును నిరోధించుటకు మాత్రమే నేను అదే అస్త్రమును ప్రయోగించాను కాని జనావాసాల మీద ప్రయోగించాలన్న క్రూరమైన తలంపు నాకు లేదు. తమరు ఆజ్ఞాపిస్తే నేను నా అస్త్రమును ఉపసంహరిస్తాను. కాని అలా చేస్తే ఆదుర్మార్గుడు తాను ప్రయోగించిన అస్త్రముతో మమ్ములను అందరినీ దహిస్తాడు మీరు మా క్షేమం కూడా ఆలోచించాలి " అని వినయంగా పలికి అర్జునుడు తాను ప్రయోగించిన బ్రహ్మశిరోనామాస్త్రమును అవలీలగా ఉపసంహరించాడు.


*వ్యాసుడు అశ్వత్థామ అస్త్రమును ఉపసంహరించమని కోరుట*


వ్యాసుడు అశ్వత్థామను చూసి " అశ్వత్థామా నీవు కూడా నీవు ప్రయోగించిన మహాస్త్రమును నిరోధించు " అన్నాడు. అశ్వత్తామ తాను ప్రయోగించిన బ్రహ్మశిరమును ఉపసంహరించాలని ప్రయత్నించాడు కాని సాధ్యం కాలేదు. అప్పుడు అశ్వత్థామ వ్యాసుడితో " మహాత్మా ! ఈ భీమసేనుడు సిగ్గు లేకుండా సుయోధనుడిని అక్రమ మార్గమున చంపాడు. అంతటితో ఆగక మునివృత్తి అవలంబించిన నాతో యుద్ధానికి దిగాడు. అందుకని కోపంతో ప్రాణభీతితో వివేకం కోల్పోయి ఈ అస్త్ర ప్రయోగం చేసాను కాని నాకు ఈ అస్త్రాన్ని ఉపసంహరించడం తెలియదు. ఇది పాపం పాండవులను దహించి వేస్తుంది అని తెలిసినా తప్పనిసరి పరిస్థితిలో దాన్ని నేను ప్రయోగించాను " అన్నాడు. అశ్వత్థామ మాటలను సావదానంగా విన్న వ్యాసుడు " అశ్వత్థామా ! నీ తండ్రి ద్రోణుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ప్రీతితో బ్రహ్మశిరమును ఇచ్చాడు. కనుక అర్జునుడు నీకు కీడు తలపెట్టడు. నీవు ప్రయోగించిన అస్త్రమును ఆపడానికే తాను అస్త్ర ప్రయోగం చేసానని చెప్పాడు. మేము కోరినంతనే ఉపసంహరించాడు. ఇంతటి అస్త్ర విద్యా వైభవం కలిగిన అర్జునుడిని వధించడానికి నీ తరం కాదు. ఈ బ్రహ్మశిరోనామాస్త్రమును గురించి చెప్తాను విను " ఇది ప్రయోగించిన దేశంలో పన్నెండేళ్ళు అనావృష్టి సంభవిస్తుంది. కనుక నిన్ను పాండవులను రక్షించడానికి ఈ ఉపాయం చెప్పాను. కనుక తాపస వృత్తిని అవలంబించానని అంటున్నావు కనుక ఈ మహాస్త్రమును ఉపసంహరించి కోపం విడిచి నీ వద్ద ఉన్న శిరోణ్మణిని ఇతడికి ఇవ్వు నిన్ను సంహరించినంతగా సంతోషపడి నిన్ను విడిచిపెడతారు. ఇది అందరికి ఆమోదయోగ్యమైనది. ఆ ప్రకారం చెయ్యి " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: