14, జులై 2025, సోమవారం

తిరుమల సర్వస్వం -300*

 *తిరుమల సర్వస్వం -300*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-15


సర్ థామస్ మన్రో

➖➖➖➖➖➖➖


తిరుమల ఆలయం పట్ల వ్యాపార దృక్పథం లేకుండా, ఆదరభావంతో వ్యవహరించిన అతికొద్ది మంది అన్యమత పాలకులలో థామస్ మన్రో అగ్రగణ్యులు. 1780 వ సం‌. లో ఈస్టిండియా కంపెనీకి చెందిన మద్రాసు రెజిమెంటులో సాధారణ సిపాయిగా చేరిన మన్రో, అంచెలంచెలుగా ఎదిగి, మద్రాసు రాష్ట్రం లోని కొన్ని జిల్లాల కలెక్టరు పదవుల నలంకరించి, చివరికి 1820 వ సం. లో మద్రాసు రాష్ట్రానికి గవర్నరుగా నియమింప బడ్డారు. ఏడు సంవత్సరాల సుదీర్ఘకాలం ఆ పదవిని చేపట్టిన మన్రోకు హిందువులన్నా, హైందవ మతమన్నా విశేష గౌరవం ఉండేది. అలాగే, శ్రీవేంకటేశ్వరస్వామి వారి పట్ల కుడా వారికి అపరిమిత భక్తిశ్రద్ధలు ఉండేవి‌. వారిని దర్శించుకొవాలని ప్రగాఢంగా కాంక్షించేవారు. 


ఒక నాడు మన్రో స్వామివారి దర్శనార్థం తిరుపతి చేరుకున్నారు. మరుసటి ఉదయం తిరుమల ప్రయాణం ఖరారైంది. ఆనాటి రాత్రి స్వామివారు మన్రోకు స్వప్నంలో సాక్షాత్కరించి, అన్యమతస్తుల ఆలయ ప్రవేశం కూడదని, తిరుమల యాత్ర విరమించు కొమ్మని ఆదేశించారు. అప్పట్లోనే కోట్ల సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకునే హైందవ భక్తుల సున్నితమైన మనోభావాలు దెబ్బతినకూడదని స్వామివారి అభిమతం కానీ, ఆ జగద్రక్షకునికి కులాలు, మతాలు, ప్రాంతాలతో పనిలేదు. శరణన్న వారిని చేరదీసి చింతలు బాపటమే వారి కలియుగావతార పరమార్థం. 


శ్రీవారి ఆనతిని శిరోధార్యంగా భావించిన మన్రో - శ్రీనివాసుని దర్శించకుండానే, ఒకింత నిరాశతో మద్రాసుకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, ఆలయానికి ఏదైనా మేలు చేయాలనే తలంపుతో, తన విచక్షణాధికారంలో గల కొంత సర్కారు భూమిని ఆలయానికి ధారాదత్తం చేసి, ఆ ఆదాయంతో ప్రతిరోజూ ప్రథమఘంట నివేదనకు కావలసిన ప్రసాదాలను సమకూర్చే శాశ్వత ఏర్పాటు చేశారు. అలాగే, తన స్వంత ధనం వెచ్చించి, ప్రసాద వితరణ నిమిత్తం ఒక భారీ వెండి గంగాళాన్ని ఆలయానికి సమర్పించుకొని తన భక్తి భావాన్ని చాటుకున్నారు. మన్రో గంగాళం గా సుప్రసిద్ధమైన ఆ వెండి పాత్ర, గత రెండు శతాబ్దాల పైచిలుకు కాలంగా శ్రీనివాసుని సేవలో తరిస్తూ, మన్రో ను చిరస్మరణీయునిగా చరిత్ర పుటలు కెక్కించింది. మనందరం, మనకు తెలియకుండానే, ఏదో ఒక తిరుమల యాత్ర సందర్భంగా మన్రో గంగాళం లోని అన్నప్రసాదాన్ని ఆర్తితో ఆరగించిన వారమే !!!


మద్రాసు గవర్నరుగా వారు హైందవ సమాజానికి - ఏ విధమైన వివక్షకు తావు లేకుండా - చేసిన చిరస్మరణీయ సేవలకు గుర్తుగా, చెన్నై పట్టణం లోని మౌంట్ రోడ్ లో అశ్వారూఢుడైన సర్ థామస్ మన్రో విగ్రహం ప్రతిష్ఠించ బడింది. 


ఆలయ భౌగోళిక స్వరూపం


ఆలయ పరిసరాల గురించి, అక్కడి జనావాసాల గురించి అంతకు ముందు సమగ్రమైన, ప్రామాణిక సమాచారం అందుబాటులో లేదు. కానీ, ఈస్టిండియా కంపెనీ వారి పత్రాల్లో 1800 వ సం. నాటి తిరుమల భౌగోళిక స్వరూపం కళ్ళకు కట్టినట్లు వర్ణించబడింది - 

ఆలయాన్ని అనుసంధానించి ఉన్న నాలుగు ఇరుకైన మాడవీధుల్లో మాత్రమే జనసంచారం ఉండేది, అది కూడా అత్యంత స్వల్పంగా మాత్రమే. మాడవీధుల్లో కూడా వనసూకరాలు (అడవి పందులు), తేళ్ళు, పాములు విచ్చలవిడిగా సంచరించేవి‌. ఆ వన్యప్రాణులు సాధారణంగా - వాటి సాధారణ ప్రవృత్తికి భంగం కలిగేటట్లు ప్రవర్తించితే తప్ప - భక్తులకు ఏ హానీ తలపెట్టేవి కావు. అత్యంత అరుదుగా ఎవరైనా పాముకాటుకు గురైనా - ఆ వ్యక్తి శ్రీవారి సన్నిధి లోని తీర్థాన్ని భక్తితో సేవించి, మరి కొంచెం తీర్థాన్ని సర్పఘాతానికి గురైన భాగంలో మర్దనా చేస్తే, శ్రీనివాసుని కృప వల్ల ఎంతటి ప్రమాదకరమైన విషమైనా ఏ హానీ జరగేది కాదు. భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి కంకణం కట్టుకున్న కరుడు గట్టిన హైందవేతర పాలకుల ప్రతినిధులు తమ ఏలికలకు పంపించే విశ్వసనీయమైన నివేదికల్లో ఇలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చారంటే, స్వామివారి మహిమను నిరూపించడానికి మరింకేం తార్కాణం కావాలి? 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: