14, జులై 2025, సోమవారం

కామకళ -- స్వరూపం _నిరూపణ🙏 మూడవ భాగం

 🙏కామకళ -- స్వరూపం _నిరూపణ🙏 

               మూడవ భాగం

       ప్రకాశ బిందువు, విమర్శ బిందు ప్రకాశాలు (కాంతులు )రెండు కలిపితే బ్రహ్మ, మాయ కలవడం వంటిది. అవ్యక్త స్థితిలో శివశక్త్యాత్మకం, వ్యక్త స్థితిలో శివుడు శక్తి వేరుపడ్డారు. వేరుపడ్డప్పుడు శివుడు నిర్వికారం అయినప్పటికీ, ఈ వేరుపడ్డ శివుని మాయ వికారంగా ( చైతన్యంగా )చూపిస్తుంది. శివుడు వికారి కాలేదు, నిర్వికారమే, వికారం అయినట్లుగా మాయ చూపిస్తుంది. ఈ మాయ త్రిగుణ రహితమైన బ్రహ్మమును ఆశ్రయించి, ఆశ్రయ కారణంగా ఆ బ్రహ్మమును చూసే వారికి త్రిగుణాత్మకంగా ఉన్న బ్రహ్మముగా కనబడేలా చేస్తుంది.

పై విషయం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి


ఋగ్వేదం అకారం తోను, యజుర్వేదం ఇకారం తోను సామవేదం ఐకారంతోను ప్రారంభం అగును.

    . పరమేశ్వరుడు వేదానికి మొదలైన "అ"కార రూపుడైతే వేదాలు తరువాత వచ్చినవి. వేదాలు రాకముందు ఏమి వచ్చింది? అకార, ఉకార, మకార మాతృకలతో ఉన్న ''ఓం'' వచ్చింది. ఓం తర్వాత అనేక అక్షరాలు వచ్చినవి. అన్ని రకాల అక్షరాలతో కూడి మంత్రాలైనవి. ఋగ్వేదం మంత్రయుక్తం. మంత్రంలో మంత్ర శక్తి ఉంటుంది. మంత్రంలో మంత్రార్థం ఉంటుంది. మంత్రం ఒట్టి అక్షరాలు కాదు. ప్రాణం ఉన్న అక్షరాలు. ప్రాణం ఉన్న అక్షరాలకే వాటి సముదాయాలకే అర్థం ఉంటుంది. అర్థంలేని పదాల కూడిక వ్యర్థం. అర్థం ఉన్న పదాలతో కూడినది ఒక అర్థాన్ని ,ఒక పరమార్ధాన్ని, ఒక భావాన్ని, ఊహను అందిస్తుంది. దానిని బట్టి ఈ వేదాలు తయారయ్యాయి. ఈ పరమేశ్వరుడు ప్రకాశ బిందురూపుడు, విమర్శ బిందువు యొక్క ప్రకాశంతో కూడినపుడు, శివశక్త్యాత్మకమైనపుడు అటువంటి పరమేశ్వరుని దగ్గర నుండి వేదాలు ఉత్పన్నమైనవి. పరమేశ్వరుని వలన సృష్టించబడిన సకల ప్రపంచానికి స్థానమైన ఆత్మశక్తియందు ప్రవేశించి, శుక్లబిందు రూపమును పొందెను. ఇదియే పురుషుడయ్యింది. విమర్శ శక్తి శుక్ల బిందువు నందు జేరి, రక్తబిందు భావమును పొందినది. శుక్ల రక్త బిందువుల కలయిక వలన ఏర్పడిన మిశ్రమ బిందువు వలన నాదము పుట్టెను.అదే అహం లోని బిందువు యొక్క నాదము వలన షోడశ కళలు ఉత్పన్నమైనవి. ఆ కళలే కళాతత్వ రూపమైన పదునాలుగు భువనములను సృష్టించినది.

సృష్టి శివశక్తి విలసితము. దైవము, దేవత, సృష్టి, స్థితి, లయములు, కాలము, దేశము సర్వము శివశక్తిమయములు. పంచభూతములు, సూర్యచంద్రులు, అగ్ని అను అష్టమూర్తులు శివశక్తి సంయములు. ‘అస్తి’ అనగా ఉన్నది. శివుడు ఒక్కడే కాడు. శక్తితో కూడి ఉన్నదే ఉండుట. 


       ఈ బిందు నాదములు అహం అనే రెండక్షరాలకు శరీరముగా ఉన్నాయి. రక్త బిందువు అగ్ని బిందువైనది. శుక్ల బిందువు చంద్ర బిందువైనది. ఈ రెండింటి మిశ్రమ రూపమైన బిందువు సూర్య బిందువైనది. అదే "అహం "ఈ బింద్రత్రయము వలన శ్రీచక్రములో త్రికోణ చక్రం ఆవిర్భవించెను. ఆ చక్ర మధ్యలో నున్నది సంవిద్బిందువు అని గ్రహించండి . ఈ సంవిద్బిందువే పరాశక్తి. ఈ నాల్గు బిందువులు కలసిన ఈ ఆవరణయే భ్రమణ వేగముతో కదలి, మిగిలిన చక్రములు సర్వము ఏర్పడినవి .



శ్రుతులు అనేక భేదములుగా ఉన్నను, ఉపనిపదర్థమందు సర్వశ్రుతులును లయ మగుచున్నవి గాన ఉపనిపత్తులకన్న వేరే ప్రమాణము లేదు గాన ఈ వివరణ సర్వోవనిషత్ సమ్మతముగా నున్నది.


    ప్రకాశ బిందువు, విమర్శ బిందువు, మిశ్రమ బిందువు - ఈ మూడు బిందువులను మూడు కోణములుగా చేసి త్రిభుజమును తయారుచేస్తే ఈ మూడు బిందువులను కలుపుతూ ఒక వృత్తము గీస్తే ఆ వృత్తమే సూక్ష్మ శ్రీచక్రము.

ఆ ప్రకాశ విమర్శ బిందువులు ప్రవంచావిర్భావ పరిపాలన లయములు గలవి.(సృష్టి, స్థితి సంహారం ) నిత్యయుతములు.(ఎప్ప్పుడు జరుగుతుంది )కామేశ్వరీ కామేశ్వరులు వాగర్థరూపములని చెప్పినందున పైన చూపించిన త్రికోణమందు ' మధ్యబిందువు నందు ప్రకాశ విమర్శ శక్తి సూక్ష్మముగా నున్నది, అదియే అత్మ. అంటే సంవిద్బిందువు. .

సృష్టి ఆది వస్తువునందు ఉన్నది శివశక్తులే.



ఆత్మ యందు శివశక్తుల వస్తుద్వయ మేళనము గలదు. అది భావిసృష్టికి కారణము. సృష్టికొరకు 

సత్వరజస్తమస్సులనే గుణత్రయరూపములను పొందినది. 

అవే కోణబిందువులుగా నున్నవి. ఆకోణ బిందువులు త్రిగుణమయ 

రూపములుగాను, వాగ్భవ కామరాజ శక్తి బీజములుగాను, అందు ప్రతి 

బిందువునందును ప్రకాశ విమర్శశక్తులు ఇమిడియున్నందున వాణీ హిరణ్య 

గర్భ ద్వంద్వమును, లక్ష్మీనారాయణద్వంద్వమును, ఉమామహేశ్వర 

ద్వంద్వమును అయియున్నవి. ఇక ఈ కోణబిందు త్రయమే సృష్టిలో

ప్రధాన వస్తువులగు చంద్రాగ్ని సూర్యమండ లముల "కాస్పద మైనది. వీని వలన ఆకాశాది పంచభూతములును, వాటివలన శాఖోవశాఖలుగా సృష్టి అంతయు పెరిగినది.


ఆస్తి భాతి ప్రియం అయిన పరమాత్మ తానే రెండు రూపములు ధరించగా, ఒకటి ‘పుం’ రూపము, మరియొకటి స్త్రీ రూపమయినది.అవే శివశక్తి రూపములు. ఒకే తత్త్వమును స్వభావమును, రూపమును, నామము కలవి. ఆయన సదాశివుడు ఆమె శక్తి. ‘నమశ్శివాభ్యం నవయౌవనాభ్యం’ అని శంకరాచార్యుల వారి స్తుతిని పరిశీలిస్తే . వారు నిత్య యవ్వనులు అనే మాట స్పష్టము అవుతుంది..


పరమాత్మ అంశములు – ఆస్తి, భాతి, ప్రియం, నామరూపములు , అనగా మొదటి మూడు పరమాత్మ యొక్క అవ్యక్తమైన స్థితి. నామమన్నది వాగర్ధ రూపము. వాక్కు శక్తిరూపం – అర్ధం శివరూపము. ఇది అక్షరము, సకలము, వ్యక్తము, మూర్తము కనుకనే శివశక్తులను గురించి మనము అనగలము, వినగలము, మాట్లాడగలము. ‘నశవేన వినాశక్తిర్న శక్తి రహితః శివః’, శక్తి లేనిదే శివుడు లేదు. శివుడు లేనిదే శక్తి లేదు.

ప్రకృతి అంతా శివునిచే చైతన్యవంతమైనది. ప్రకృతిలో లీనమైన పరమాత్మ వలన ప్రకృతి ప్రకాశించుచున్నది. అది అజడ ప్రకృతి. జడ ప్రకృతి జీవము లేనిది కనుక ప్రకృతికి శివుడే రూపము. రూపము కాలమును బట్టి, స్థలమును బట్టి ఏర్పడును. ఈ రూపము శక్తి భాగము. ఈ రూపమును చైతన్యము చేయువాడు శివుడు. ఇతి స్థూలంగా శివశక్తిమయమైన అంశపంచకము యొక్క లక్షణము.

                   సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: