14, జులై 2025, సోమవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము*


*437 వ రోజు*


*అశ్వత్థామ కృపాచార్యుని ప్రతిపాదన నిరాకరించుట*


అశ్వత్థామ కృపాచార్యుడి మాట విని ఇలా ప్రతిస్పందించాడు. " ఈలోకంలో కోపంలో ఉన్న వాడికి, ధనసంపాదనా వ్యామోహికీ, వ్యాధిగ్రస్తుడికి, కామాతురతతో కన్ను మూసుకు పోయిన వాడికి నిద్ర ఎలా పడుతుంది. నా తండ్రి మరణాన్ని తలచుకొని దహించుకు పోతున్న నా హృదయాన్ని శత్రుసంహారంతో ఆర్పి నా స్వామి సుయోధనుడి ఋణం తీర్చుకుంటాను. అంత వరకు నాకు నిద్ర రాదు. పగలు వారికి అర్జునుడు, కృష్ణుడు అండగా ఉంటాడు కనుక ఎదిరించ లేము. కనుక రాత్రి సమయంలోనే శత్రుసంహారం చేస్తాను . దయచేసి నన్ను వారించకండి. ఈ రాత్రి నేను పాండవులు, వారి బంధు మిత్రులు, సైనికులు గాఢనిద్రలో ఉండగా వారి మీద దాడి చేసి దారుణంగా వధిస్తాను. ఆతరువాత ఆ విషయం రారాజుకు చెప్పి సుఖంగా నిద్రిస్తాను " అన్నాడు.


*కృపాచార్యుడు అశ్వత్థామని నివారించడానికి ప్రయత్నించుట*


అశ్వత్థామ మాటలను విని కృపాచార్యుడు " అశ్వత్థామా ! కోపంతో ఉన్న వాడికి కార్యాకార్య విచక్షణ తెలియదు. ప్రస్తుతం నీవు ఆ స్థితిలో ఉన్నావు. ధర్మాధర్మములు ఎరుగక ఉన్నావు. కోపం వదిలి నా మాట విని ధర్మమార్గాన నడిచిన నీకు మేలు జరుగుతుంది. నిద్రిస్తున్న వాడిని, ఆయుధములు విడిచిన వాడిని, జుట్టు ముడివీడిపడిన వాడిని వాహనవైకల్యమును పొందిన వాడిని, శరణుజొచ్చిన వాడిని వధించుట ధర్మం కాదు. పాండవులు వారి సమస్తసైన్యము, పాంచాలురు గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రించినవాడు చచ్చినవాడితో సమానం. చచ్చినవాడిని మీదపడి చంపి నరకముకు ఏల పోయేవు. మహాస్త్రకోవిదుడవు, మహారధులలో ప్రథముడవు, అలాంటి నీవు ఇలాంటి నీచ కార్యముకు ఒడబడతావా ! కనుక రేపు యుద్ధములో మనం పాండువీరులతో పోరు సల్పుదాము " అన్నాడు.


*అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులను అంగీకరింపచేయుట*

అశ్వత్థామ " మామా ! కృపాచార్యా ! నీవు పెద్ద వాడవు నన్ను శాసించ తగిన వాడవు. నీవు చెప్పింది సత్యము కాని నేను చెప్పేది వినండి. రాజులంతా చూస్తుండగా అస్త్ర సన్యాసము చేసిన నా తండ్రిని పంచాల రాకుమారుడు ధృష్టద్యుమ్నుడు అది పాతకము అని తలపక నా తండ్రి జుట్టు పట్టుకుని తల నరికాడు. శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు భీష్ముని పడగొట్టాడు. భూమిలో దిగిన రథచక్రాన్ని ఎత్తుతున్న కర్ణుడి మీద అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడు. అర్జునుడు భూరిశ్రవసుడిని భుజములు నరికినందుకు అతడు ప్రాయోపవేశం చేసాడు. ప్రాయోపవేశం చేసిన భూరిశ్రవసుడిని సాత్యకి దారుణంగా చంపాడు. ఇదంతా ఎందుకు ఎక్కడో మడుగులో దాగిన సుయోధనుడిని బయటకు రప్పించి భీముని చేత అధర్మయుద్ధమున కూలత్రోయించారు. ఇన్ని విధముల యుద్ధధర్మాన్ని మీరి యుద్ధధర్మమనే వంతెనను కూల్చిన వారిని వదిలి నన్ను ధర్మంగా నడవమని చెప్పుట న్యాయమా ! " అన్నాడు. మామా ! తొడలు విరిగి నేలమీద ఉన్న సుయోధనుడు దీనంగా పలికిన పలుకులు విని కూడా నీకు ఆగ్రహం కలుగ లేదా ! అందుకనే నేను చేసేది అధర్మమైనా అధర్మమార్గాన నా తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నిడిని నేను చంపక వదలను. నన్ను మీరు ఆపలేరు. ఇందు వలన నేను కీటకంగా జన్మించినా బాధపడను " అని అంటూనే రథం ఎక్కాడు అశ్వత్థామ. " అశ్వత్థామా ! నువ్వూ నేను కృతవర్మ ఒకే పని మీద వచ్చాము. అటువంటి సమయాన నీవు ఒంటరిగా వెళ్ళడం భావ్యం కాదు. నేనూ నీతో వస్తాను " అన్నాడు కృపాచార్యుడు. అశ్వత్థామ " మామా ! చాలా సంతోషం నా తండ్రిని చంపిన వాడిని చంపడానికి వెళుతున్న నాకు మీరు తోడుగా వస్తున్నందుకు ఆనందంగా ఉంది రండి " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: