*బాదరాయణ సంబంధం అంటే ఏమిటి?*
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
వైశాఖ మాసం చివరి రోజులు. రోహిణి కార్తెలో రోళ్ళు బద్దలవుతాయి అంటారు. నడి వేసవిలో పది గంటలకే ఎండ మండిపోసాగింది. ఒకాయన బండి తోలుకుంటూ గ్రామంలోకి ప్రవేశించాడు. పల్లె మొదట్లోనే రేగు చెట్టు ఉంది. చెట్టు కింద బండి ఆపి ఎడ్లను విప్పి చెట్టుకు కట్టేసాడు.
చెట్టుకు ఎదురుగా ఉన్న ఇంటి వీధి గుమ్మం తలుపు తీసే ఉంది. గుమ్మం దాటి నడవ లోకి వెళ్లి "అమ్మాయీ, కొంచెం దాహం తీసుకురామ్మా" అన్నాడు. వంటింట్లో ఉన్న ఇల్లాలు "ఎవరు ఇంత చనువుగా పిలుస్తున్నారు" అనుకుంటూ మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది.. ఇంటి ఎదురుగా బండి, ఎద్దులు కనిపిస్తున్నాయి. "గ్రామాంతరం నుంచి వచ్చినట్లు ఉంది. ఎవరో గుర్తు తెలియడం లేదు. భర్త వైపు బంధువులే అయిఉంటారు" అనుకుంది.
"ఎప్పుడూ నా వైపు బంధువులనే ఆదరిస్తారనీ, ఆయన వైపు బంధువులకు మర్యాద చెయ్యననీ అంటుంటారు. ఈ వచ్చిన ఆయనకు పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెడితే ఆయన ఇంక నన్ను ఏమీ అనరు" అనుకుంది. "కూర్చోండి బాబయ్య గారూ" అంటూ లోపలికి వెళ్ళింది. ఎడ్ల మేత పూర్తయ్యాక వెడదాం అనుకుని ఆయన కూర్చున్నాడు.
ఇంటి యజమాని కొంతసేపటికి ఇంట్లోకి వచ్చాడు. నడవలో కూర్చున్న ఆయనను చూసి భార్య వైపు బంధువు అనుకుని "బాగున్నారా?" అని పలకరించి లోపలికి వెళ్ళాడు. వంటింట్లో భార్య అనేక రకాల వంటలు చేస్తోంది. "వచ్చింది ఆమె దగ్గర బంధువే కాబోలు. అందుకే పెద్ద ఎత్తున వండుతోంది. తనవైపు బంధువులను నేను గౌరవించనని అంటుంది కదా. ఇప్పుడు నేను చేసే మర్యాదలు చూస్తే ఇంక నోరెత్తలేదు." అనుకున్నాడు.
వచ్చిన ఆయనను స్నానానికి పిలిచాడు. సంపెంగ నూనెతో, పన్నీటితో అభ్యంగనస్నానం. స్నానం కాగానే యజమాని కొత్త బట్టలు తెచ్చి కట్టబెట్టాడు. ఆపైన పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం, పచ్చకర్పూరంతో తాంబూలం. "ఇక వెళ్లి వస్తానమ్మా, వస్తానయ్యా బాబూ" అంటూ ఆయన వెళ్లి ఎడ్లను బండికి కట్టి బయలుదేరాడు.
భార్య "చూశారా మీ వాళ్లకు ఎంత మంచి భోజనం పెట్టానో." అని అంది. భర్త "ఏమంటున్నావు. మీ వాళ్ళు అనుకునే మర్యాద తగ్గకూడదని కొత్తబట్టలు ఇచ్చాను." అన్నాడు. ఇద్దరూ ఒకరి నొకరు తిట్టుకున్నారు.
ఆ పైన బండి వెనక పరిగెత్తి "అయ్యా మీరు ఎవరు? మాతో మీకు ఉన్న సంబంధం ఏమిటి?" అని అడిగాడు.
"మీ ఇంటి ముందు బదరీ వృక్షం ఉంది (రేగు చెట్టు). నా బండి చక్రం రేగుకర్రలతో చేశారు. మనది బాదరాయణ సంబంధం అంతకన్నా ఏం లేదు." అంటూ బండి తోలుకుని వెళ్ళిపోయాడు.
భార్యాభర్తల కళ్లలో బండి కదలటం వల్ల రేగిన దుమ్ము పడింది. వారిద్దరి కళ్లలో దుమ్ము పడిందా? వారే కళ్లల్లో దుమ్ము కొట్టుకున్నారా? ఇద్దరూ నీ వాళ్ళు, నా వాళ్ళు అనుకోకుండా మన వాళ్ళు అనుకుంటూ సఖ్యంగా ఉంటే ఈ కథ మరోలా ఉండేది కాదా?
*అస్మాకం బదరీ చక్రం యుష్మాకం బదరీ తరుః!*
*బాదరాయణ సంబంధం యూయం యూయం వయం వయం!!*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి