గీతామకరందము:
18-46-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ || స్వకీయ కర్మాచరణచే మనుజుడు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని ఎట్లు బడయగలడో వివరించుచున్నారు -
యతః ప్రవృత్తిర్భూతానాం
యేన సర్వమిదం తతమ్
స్వకర్మణా తమభ్యర్చ్య
సిద్ధిం విన్దతి మానవః ||
తా:- ఎవరివలన ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవర్తనము (ప్రవృత్తి) కలుగుచున్నదో, ఎవరిచేత ఈ సమస్తప్రపంచము వ్యాపింపబడియున్నదో, వారిని (అట్టి పరమాత్మను), మనుజుడు స్వకీయ కర్మముచే నారాధించి జ్ఞానయోగ్యతారూపసిద్ధిని పొందుచున్నాడు.
వ్యాఖ్య:- "యతః ప్రవృత్తిర్భూతానామ్” - ఎవరినుండి సమస్త ప్రాణికోట్లకు ఉత్పత్తి మొదలగునవి కలుగుచున్నవో - అని చెప్పుటవలన, సమస్తజీవులకును ఆధారభూతుడు ఆ పరమాత్మయే యని స్పష్టమగుచున్నది. జడమైన వస్తువు చైతన్యముయొక్క సహాయములేనిదే ఏమియు చేయజాలదు. జడమగు ప్రకృతి చిద్రూప పరమాత్మవలననే స్పందించుచున్నది. (మయా2ధ్యక్షేణ ప్రకృతిస్సూయతే స చరాచరమ్). కాబట్టి జీవులు తమ సమస్తమునకును కారణభూతుడైన ఆ పరాత్పరునియెడల అపార భక్తిశ్రద్ధలు గలిగి వారినే యారాధించుచు పరమ శ్రేయము నొందవలెను.
“యేన సర్వమిదం తతమ్" - ఇదే వాక్యము గీతయందు మూడు పర్యాయములు ప్రయోగింపబడినది. "దేనిచేత ఈ సమస్తప్రపంచము వ్యాపింపబడియున్నదో " అని దానియర్థము. పరమాత్మ సర్వవ్యాపకులై యుండుటవలన ఈ ప్రపంచమున వారు లేనిచోటు లేదని నిశ్చితమగుచున్నది. పాలలో వెన్నవలె వారు సర్వత్రవ్యాపించియున్నారు. స్థూలనేత్రమునకు వారు గోచరముకాకున్నను, జ్ఞాననేత్రమునకు సర్వత్ర గోచరించుదురు. ఈ ప్రకారముగ అణువణువునందును భగవంతుడు వ్యాపించియుండుటచే, సర్వసాక్షియై సమస్తము పరికించుచుండుటచే జీవులాతని సాన్నిధ్యమును సర్వత్ర యనుభూతమొనర్చుకొనుచు, పాపకృత్యము లెవ్వియు చేయక, భక్తిభావ సమన్వితులై యుండవలెను.
"స్వకర్మణా తమభ్యర్చ్య” – మనుజుడు మోక్షసిద్ధిని కర్మాచరణముద్వారా ఎట్లు పొందగలడను ప్రశ్నకు భగవాను డిచట చక్కగ సమాధానమొసంగిరి - "నీవు నీ కర్మ చేసికొనుచు దైవమును ఆరాధించుచుండుము, స్మరించుచుండుము, ఈశ్వరార్పణముగా నీ కర్మముల నాచరింపుము. అనగా నీ కర్మలద్వారా పరమాత్మను ఆరాధింపుము. అట్టిచో నీవు జ్ఞానసిద్ధిని, తద్ద్వారా మోక్షసిద్ధిని బడయగలవు - అని భగవానుడిచట బోధించిరి. ఈ ప్రకారముగ కర్మను ఈశ్వరార్పణబుద్ధితో చేయునపుడే చిత్తశుద్ధిద్వారా యది జ్ఞానావిర్భావమునకు హేతువై మోక్షప్రదమగును. అట్లుకాక ఫలాభిలాషతో చేసినచో కర్మ మోక్షహేతువు కానేరదు.
"కర్మనుచేయుము కాని ఫలమును ఈశ్వరార్పణము గావింపుము" - ఇదియే కర్మద్వారా ఈశ్వరుని యారాధించుట. అనగా భగవవత్ప్రీత్యర్థము కర్మలనాచరించవలెనని భావము.
కర్మచే మోక్షము లభించునా యని కొందఱు ప్రశ్నించుదురు. " లభించును, కాని, దానిని చేయవలసిన పద్ధతిలో చేసిననే లభించును" అని తెలియవలెను. ఆపద్ధతి యేదియనిన, ఆ కర్మచే భగవంతుని అర్చించవలెను. అనగా ఆ కర్మనాచరించి తత్ఫలితమును భగవంతున కర్పించవలెను. నిష్కామముగ (భగవదర్పితముగ) కర్మాచరణ చేయవలెనని భావము. అత్తఱి కర్మయందలి దోషము తొలగిపోయి చిత్తశుద్ధిద్వారా యది మోక్షసాధనముగ పరిణమించును. ఇదియే కర్మమార్గమందుగల కీలకము. ఆ కీలకమును, ఆ కర్మరహస్యమును భక్తులపై కరుణచే భగవంతు డిచట వెల్లడిచేసివైచిరి. " ఓ జీవుడా!, కర్మ చేయుము. కాని ఈశ్వరార్పణబుద్ధితో చేయుము. ఆ కర్మచే ఈశ్వరుని యారాధించుము. ఫలితములను కోరకుము. కర్మచేయుటయే నీ వంతు. ఫలితమును భగవంతునకే అర్పింపుము" అని యిచట చక్కగ బోధింపబడినది. ఈ పద్ధతిద్వారా కర్మ తనకర్మత్వమును పోగొట్టుకొని, తన బంధరూపమును తొలగించుకొని మోక్షహేతువుగా మారిపోవుచున్నది. దీనినిబట్టి కర్మ నింద్యముకాదనియు, కర్మమార్గము నికృష్టముకాదనియు, దాని నాచరించుపద్ధతిని తెలిసికొనినచో అది తక్కిన భక్తిజ్ఞానాదులవలె పరమ పవిత్రమగు ఒకానొక మోక్షసాధనము కాగలదనియు ఈశ్లోకముద్వారా స్పష్టమగుచున్నది.
కాని "స్వకర్మణా తమభ్యర్చ్య” (స్వకీయకర్మచే భగవంతుని ఆరాధించుట) - అను ఈ పద్ధతిని జనులు సరిగా గమనించక, దైవార్చితముగ కర్మలు చేయుట మాని కామ్యబుద్ధితో జేయుచున్నారు. అందువలన కర్మ బంధనరూపముగా మారిపోవుచున్నది. భగవానుడో, కర్మను మోక్షరూపముగ మార్చవచ్చునని తెలిపి దాని కిచట ఉపాయమునుగూడ సెలవిచ్చిరి. కాబట్టి ముముక్షువులెల్లరు ఈ సత్యమును జ్ఞాపకము నందుంచుకొని, ఈ భగవద్వాక్యములపై విశ్వాసముంచి తాము చేయు సమస్తకర్మలను ఈశ్వరార్పణబుద్ధితో, భగవత్కైంకర్యబుద్ధితో చేయవలయును. అట్లు చేసినచో "సిద్ధిం విన్దతి మానవః” అనునట్లు మానవుడు జ్ఞానసిద్ధిని, మోక్షసిద్ధిని తప్పక బడయగలడని గీతాచార్యులు ఘంటాపథముగ తెలుపుచున్నారు.
ఈ శ్లోకమున కర్మ, భక్తి, జ్ఞానములయొక్క సముచ్చయము తెలుపబడినది. ఎట్లనిన -
1. కర్మనాచరించుట - (కర్మ)
2. దానిద్వారా భగవంతుని ఆరాధించుట (భక్తి)
3. అట్లు ఆరాధించుటచే చిత్తశుద్ధికలుగ జ్ఞానమావిర్భవించుట (జ్ఞానము).
కర్మయను ప్రమిదలో భక్తియను తైలమునుపోసి ధ్యానమను వత్తినిబెట్టి జ్ఞానమను జ్యోతిని వెలిగించవలెను.
ప్ర:- సమస్త ప్రాణికోట్లు ఎవనినుండి ఉత్పత్తిని బొందుచున్నవి?
ఉ:- పరమాత్మనుండి.
ప్ర:- ఈ ప్రపంచమంతయు ఎవనిచే వ్యాప్తమైయున్నది?
ఉ:- పరమాత్మచే.
ప్ర:- జీవుడు మోక్షసిద్ధిని యెట్లు పడయగలడు?
ఉ:- స్వకీయకర్మచే భగవానుని ఆరాధించినచో, అనగా ఈశ్వరార్పణబుద్ధితో (నిష్కామముగ) కర్మలను ఆచరించినచో చిత్తశుద్ధిద్వారా జ్ఞానమును, దానిచే మోక్షమును బడయును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి