🌻శ్రీకాళహస్తీశ్వరా నమోస్తు🌻
భవదీయ నామంబు ప్రత్యహ మందునన్
భజియించు నుత్తమ భక్తతతికి
దుశ్శకునంబులు దూరంబుగా నుండు
గ్రహదోష కష్టముల్ కలుగ కుండు
శలభంబు లెంతగా సంరంభమున పడ్డ
కాలెడు ననలమున్ గప్ప గలవె !
అరయ నీ మానవు లెఱిగియు న్నన్నియున్
సతతంబు నీసేవ సల్పు కొనియు
పడెడు నిడుముల నెల్లను బాపు కొనక
కోలు పోయదరేలనో కాల మంత ?
భక్త పాలన శంకరా ! పరమ పురుష !
ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ ! 29*
ఈ ప్రాణముల్ నేను కాపాడు కొనుటకు
నన్య దైవతముల న్నడుగ నెపుడు
నడుగంగ బోయిన న్ననయంబు నీదు పా
దార్చనారతులనే నడుగ బోదు
నీ పద పద్మముల్ నిరతంబు గొల్చెడు
మహితమౌ భక్తిలో మసలునాకు
నింకనున్ గోరంగ నేముండు శంకరా !
భక్తి సాధకమైన ముక్తి దప్ప
ఇట్టి నాపైన దయజూపి పట్టి కరము
చింతలనుదీర్చి నీలోన చేర్చు కొనుము
కరుణ చూపుము నా పైన కామదహన !
ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ ! 30*
✍️గోపాలుని మధుసూదనరావు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి