17, ఆగస్టు 2020, సోమవారం

పోత‌న త‌లపులో ...(22)

ప‌ర‌మాత్మ గొప్ప‌త‌నాన్ని,
ప‌ర‌మ ర‌మ‌ణీయంగా
తెలిపిన పావ‌న‌మూర్తి పోత‌న‌

                 ****
ఎవ్వని యవతార మెల్ల భూతములకు-
  సుఖమును వృద్ధియు సొరిదిఁజేయు;
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ-
  సంసార బంధంబు సమసిపోవు;
నెవ్వని చరితంబుఁ హృదయంబుఁ జేర్పంగ-
  భయమొంది మృత్యువు పరువువెట్టు;
నెవ్వని పదనది నేపాఱు జలముల-
  సేవింప నైర్మల్యసిద్ధి గలుగుఁ;

                          **
దపసులెవ్వాని పాదంబు దగిలి శాంతి
తెరువుఁగాంచిరి; వసుదేవదేవకులకు
నెవ్వఁ డుదయించెఁ; దత్కథలెల్ల వినఁగ
నిచ్చ పుట్టెడు; నెఱిఁగింపు మిద్ధచరిత!
                    ****

ఏ మహానుభావుడు అవతరించడం ఈ జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్నీ, అభివృద్ధినీ అందిస్తుందో, ఏ మహానుభావుడి దివ్యనామాన్ని ఎల్లప్పుడు ఉచ్చరించటం వల్ల భవబంధాలన్నీ పటాపంచలు అయిపోతాయో, ఏ మహానుభావుడి పవిత్ర చరిత్రని భావించిన మాత్రంచేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుడి పాదాల నుంచి ఉద్భవించిన నదీజలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు సమస్తం నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో, ఏ మహానుభావుడి చరణాలను సమాశ్రయించి సంయమీంద్రులు శాంతి మార్గాన్ని సాధించారో, ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు ముద్దుల బిడ్డడుగా జన్మించాడో, ఆ మహానుభావుడైన వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చట పడుతున్నామయ్యా.
ఓ సూతమునీంద్రా! అవన్నీ మాకు వినిపించు, అని శౌన‌కాది మునుల విన్న‌పం.

🏵️*పోత‌న ప‌ద్యం 🏵️
🏵️అక్ష‌ర పారిజాతం🏵️

కామెంట్‌లు లేవు: