17, ఆగస్టు 2020, సోమవారం

ద్రౌపది విఙ్ఞత

దుష్టుడైన దుశ్శాసనుడు ద్రౌపది ని జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకొని వచ్చిన వేళ తన భర్త ల ఆగ్రహోదగ్రత్వాన్ని వివరించి వానిని భయపెట్టింది. సభాసదులను అందరినీ దిక్కరించింది. భీష్మద్రోణవిదురాదులైన గురుజనులు అందరూ నోరు మూసుకుని కూర్చున్నందులకు వారిని కఱకుములుకులవంటి పలుకులతో నిలదీసింది. సాహసపూర్వకంగా సభాసదులను అందరినీ సంభోదించి తనకు న్యాయం చేయండి అని అర్థించింది. ధర్మం! ధర్మం! ధర్మాన్ని పరిరక్షించండి! అని మొరపెడుతూ ఆమె వారిని అయ్యలారా! మహారాజు యుధిష్ఠిరుడు ముందుగా పందెములో తనను తాను ఒడ్డుకొని ఓడిపోయినవాడు. అనంతరం అతడు పందెంలో నన్ను ఒడ్డేడు. ముందు ఒకసారి ఓడిపోయినవారికి రెండవసారి నన్ను పణంగా పెట్టడానికి అధికారం ఉంటుందా? ఉండదా? ఆలోచించి తేల్చండి. అని ప్రశ్నించింది. ఆమె మాటలను అందరునూ విని మౌనం వహించడం తప్ప సమాధానం ఏమీ చెప్పలేకపోయారు. కడపట దుర్యోధనుడి తమ్ముడు అయిన వికర్ణుడనువాడు లేచి సభాసదులారా! ఊరకున్నారేమి? ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మౌనం వీడండి అని సభాసదులను అభ్యర్థిస్తూ ఇదిగో! నా అభిప్రాయం చెబుతున్నాను వినండి! అంటూ ఇలా అన్నాడు. ముందు ద్రౌపది ఐదుగురు పురుషుల కు భార్య అన్న మాటను మరువరాదు. మిగిలిన నలుగురు భర్తలను ఉపేక్షించి తాను ఒక్కడే ఆమెను జూదంలో పణంగా పెట్టడానికి ధర్మరాజు కు అధికారం లేదు. ఇది మొదటి అంశము. అతడు తాను ముందు ఓడిపోయి తరువాత ద్రౌపది ని పణంగా ఒడ్డేడు. ఇది అతనికి అనధికార చర్య అవుతుంది. ఇది రెండవ అంశం. వికర్ణుడు ఆడిన ఈ మాటలను విదురుడు సమర్ధించాడు. ఇతర సభాసదులందరూ అతనిని ప్రశంసించారు. ఈ విధంగా నిండు సభలో దుశ్శాసనుని చేత ఈడ్వబడి అవమానింపబడినా కడకు నైతిక విజయం ద్రౌపది కే కలిగింది. ఆమె బుద్ధి మిక్కిలి పరిణస్థితిని పొందింది. ఆమె మాటను ఎవరూ ఖంఢించ లేకపోయారు. చివరకు విదురుని ప్రోత్సాహం తో ధ్రుతరాష్ట్రుడు దుర్యోధనుడి ని మందలించి ద్రౌపది కి ప్రశన్నత కలిగింపనెంచి ఆమె తో అమ్మా! నీకు ఏమి కావలెనో కోరుకో! అని అన్నాడు. అప్పుడు ఆమె మహారాజా! నా భర్తలను దాస్యవిముక్తులనూ చేయండి! ఇదే నేను మీనుండి ఆశించే వరం అని పలికింది. ఇంకను ఏమైనా కోరుకో! అని ధ్రుతరాష్ట్రుడు మరల పలికాడు. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఆమెకే తగియున్నది ఎల్లరూ మెచ్చుకొనే విధంగా ఉండి ఆమెలోని లోభ రాహిత్యం ధర్మప్రీతి ఆ సమాధానం లో స్పష్టం గా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఆ సమాధానం ఏది అంటే మహారాజా! అధికంగా ఆశించడం నాకు యుక్తం కాదు. ఇంకనూ మిమ్మల్ని ఏదో కోరాలి అన్న భావన నాకు లేదు. నా భర్తలు సర్వసమర్థులు, వారు  దాస్యవిముక్తులు అయితే తమంతట తాము గా ఏదైనా సాధించగలరు. ఇది ఆమె చెప్పిన సమాధానం. ఈ విధంగా ద్రౌపది తన విఙ్ఞత సాయంతోను పాతివ్రత్య బలంతోను తన భర్తలను దాస్యబంధవిముక్తులను చేసుకొంది...... సేకరణ 🍁
**********************

కామెంట్‌లు లేవు: